![Rs 40 Crore Government Space was Allotted to TDP Office in YSR District - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/7/TT.jpg.webp?itok=238l89mp)
టీడీపీ కార్యాలయానికి ఇచ్చిన స్థలం ఇదే...
సాక్షి, కడప కార్పొరేషన్ : వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్నట్లుగా ఉంది టీడీపీ సర్కారు వ్యవహారం. కారు చౌకగా ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించేసింది. ఏడాదికి వెయ్యి రూపాయలు చెల్లిస్తే చాలు.. రూ.40కోట్ల విలువైన స్థలంలో ఎంచక్కా పార్టీ ఆఫీసు కట్టేసుకోవచ్చని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ స్థలంలో ప్రజల కోసం పార్కు నిర్మించాలన్న కార్పొరేషను ప్రయత్నాలకు గండి కొట్టింది. ఎన్నికలకు ముందు తెలివిగా పావులు కదిపి విలువైన స్థలం కొట్టేయడంపై ప్రజా సంఘాలు ఆక్షేపిస్తున్నాయి.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన టీడీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఎప్పుడో మర్చి పోయింది. ఎక్కడ జాగా కనిపించినా తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే పాగా వేసేశారు. ఇప్పుడు అధికారికంగా రెండెకరాల స్థలాన్ని కారు చౌకగా స్వపక్షానికి కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. కడప నగరంలో రూ.40కోట్లు విలువ జేసే అత్యంత విలువైన స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి చౌకగా అప్పగిస్తూ ఇటీవల జీఓ జారీ చేసింది.
రెండునెలల్లో ఎన్నికలు వస్తాయనగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. నగర నడిబొడ్డున ఉన్న పాత మున్సిపల్ కార్యాలయ స్థలంలో ఒక ఎకరం స్థలం తమ పార్టీ కార్యాలయానికి తీసుకోవడానికి టీడీపీ నాయకులు ఎత్తుగడ వేశారు. అధికార పార్టీ కుటిలయత్నాన్ని వైఎస్‌ఆర్‌సీపీతోపాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఆందోళనకు సిద్ధమవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
గుట్టు చప్పుడు కాకుండా..
రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనగా అక్కాయపల్లెలో( 40వ జాతీయ రహదారి ప్రక్కనే సర్వే నంబర్ 37/4లో) రెండెకరాల స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి అప్పగిస్తూ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థలం నేషనల్ హైవే పక్కనే ఉంది. సెంటు విలువ రూ.20లక్షల వరకూ ఉంటుంది. రెండు ఎకరాలంటే రూ.40కోట్లు విలువ చేస్తుంది. ఇదివరకు ఈ స్థలంలో పౌరసరఫరాల సంస్థ గోదాములుండేవి.
దాని పక్కనే ఉన్న స్థలాన్ని రవీంద్రనాథ్‌రెడ్డి మేయర్‌గా ఉన్న సమయంలో న్యాక్ ట్రైనింగ్ సెంటర్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఇక్కడ భవనాలన్నీ పాడుబడిపోయాయి. ఖాళీగా ఉన్నాయి. దీంతో టీడీపీ నాయకుల కన్ను దీనిపై పడింది. ఇంకేముంది. ఎలాగూ అధికారం చేతిలో ఉంది. ఆ బలాన్ని ఉపయోగించి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించేలా చక్రం తిప్పారు. టీడీపీ కార్యాలయం నిర్మించి 99 సంవత్సరాలపాటు ఈ స్థలం పొందేలా ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేయించుకున్నారు.
ఇందుకుగాను ఆర్‌అండ్‌బీ శాఖకు ఎకరాకు సంవత్సరానికి రూ.1000లు నామమాత్రపు లీజు చెల్లించేలా ఒప్పందం. ఇంత విలువైన ఆస్థిని కారుచౌకగా టీడీమీ కార్యాలయానికి అప్పగిం చడం పట్ల అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు మం డిపడుతున్నారు. ఈ స్థలా న్ని అక్కాయపల్లె ప్రజల సౌకర్యార్థం పార్కుకు కేటాయిం చాలని గతంలో కడప నగరపాలక సంస్థ పాలకవర్గం తీర్మానించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు దిగితే ఇంకెవరికి చెప్పుకోవాలని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇదివరకు కాంగ్రెస్ కార్యాలయానికి ఇచ్చిన స్థలం కేవలం యాభై సెంట్లే కావడం గమనార్హం. ప్రభుత్వం, నేతల అధికార దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంత విలువైన స్థలాన్ని తీసుకోవడం సరికాదు
రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాలు అప్పగించవచ్చు. కానీ మరీ ఇంత విలువైన స్థలాన్ని అప్పగించడం సరికాదు. ఇక్కడ సెంటు రూ.20లక్షలు విలువ ఉంది. ఇలాంటి చోట రెండు ఎకరాల స్థలాన్ని ఇవ్వడం అంటే అధికారాన్ని దుర్వినియోగం చేయడమే.
– అన్నయ్య, స్థానికుడు, అక్కాయపల్లె
ప్రజల ఉపయోగార్థం వినియోగించాలి
ఈ స్థలంలో ఇది వరకు పౌరసరఫరాల గోడౌన్ ఉండేది, దాని పక్కనున్న స్థలంలో న్యాక్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది. ప్రస్తుతం ఆ భవనాలన్నీ పడిపోయి ఖాళీగా ఉంది. దీన్ని ప్రజల ఉపయోగార్థం వినియోగించాలి. అంతేగానీ పార్టీ కార్యాలయానికి కేటాయించడం అన్యాయం.
– పి. రాజశేఖర్, స్థానికుడు, అక్కాయపల్లె
చౌకగా ఉన్న చోట తీసుకుంటే అభ్యంతరం లేదు
ఇది ఖరీదైన భూమి. ఇక్కడ పార్కు ఏర్పాటు చేయాలని 30వేల మంది అక్కాయపల్లె, రవీంద్రనగర్ ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్నారు. కలెక్టర్‌ను కలిసి విన్నవించాం, భూమి ధర తక్కువగా ఉన్నచోట టీడీపీ కార్యాలయానికి స్థలం తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు.
– పాకా సురేష్‌కుమార్,47వ డివిజన్ కార్పొరేటర్
Comments
Please login to add a commentAdd a comment