
పట్నా : బిహార్‌లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల వేటలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. విపక్షాల ఎత్తులను చిత్తుచేసే విధంగా రాజకీయ అండతోపాటు ధనబలమున్న అభ్యర్థుల వైపే అధినేతలు మొగ్గుచూపుతున్నారు. సీట్లపై ఇప్పటికే అన్ని పార్టీలు ఓ అంచనాకు రాగా.. అధికార జేడీయూ ఇప్పటికే రెండోవిడత అభ్యర్థులను సైతం విడుదల చేసింది. 90మందితో కూడా జాబితాను ఆ పార్టీ చీఫ్, సీఎం నితీష్ కుమార్ గురువారం ప్రకటించారు. వీరిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కొత్తవారికి కూడా చోటుదక్కింది. (నితీశ్‌కు అగ్నిపరీక్ష)
ఇదిలావుండగా జేడీయూ విడుదల చేసిన జాబితాలతో అనూహ్యంగా ఓ ఇద్దరు వ్యక్తులు చోటుదక్కించుకున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి మంజూవర్మకు నితీష్ మరోసారి టికెట్ కేటాయించారు. బెగుసరై సమీపంలోని బర్యార్‌పూర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఆమె బరిలో నిలువనున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారంరేపిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసుకు సంబంధించి మంజు వర్మతో పాటు ఆమె భర్త చంద్రశేఖర్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కోర్టుకు సైతం లొంగిపోయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ సైతం విచారణ జరుపుతోంది.
షెల్టర్ హోంలో 30 మంది బాలికలపై లైంగిక దాడుల ఆరోపణల రావడంతో మంత్రి పదవి నుంచి తప్పించడంతో పాటు 2018లోనే ఆమెను నితీష్ పార్టీ నుంచి తప్పించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మంజూవర్మతో పాటు ఆమె భర్తతో సహా మరో 11 మందిపై అభియోగాలు దాఖలు చేసింది. మరోవైపు బాలికపై అత్యాచార ఘటనలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్మకు టికెట్ కేటాయించడం పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మామ చంద్రికా రాయ్‌కు సైతం జేడీయూ టికెట్ దక్కింది. పర్సా నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలువనున్నారు. ఇక 27 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది.