సాక్షి, న్యూఢిల్లీ : సుదీర్ఘ కాలం పాటు దేశంలో ముఖ్యమంత్రులుగా కొనసాగిన వారికి గత కొన్ని సంవత్సరాలుగా కలసి రావడం లేదు. 24 సంవత్సరాల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా కొనసాగిన పవన్ కుమార్ చామ్లింగ్ 2019 అధికారం నుంచి దిగిపోయారు. అంతకంటే ఏడాది ముందు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ గద్దె దిగారు. 2018, డిసెంబర్‌లో కూడా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులయిన రామన్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2020 సంవత్సరంలో చౌహాన్ మళ్లీ పదవిలోకి వచ్చారు. అది వేరే విషయం. (డబుల్ యువరాజులు x డబుల్ ఇంజిన్ అభివృద్ధి)
2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2005 నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (2014లో కొన్ని నెలలు మినహా) ఎదురు లేకుండా అధికారంలో అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నారు. నవీన్ పట్నాయక్ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్న బిహార్‌లో ఏ పార్టీ గెలుస్తుంది ? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ? అన్న విషయంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. (నితీష్ స్కాం 30 వేలకోట్లు : మోదీ)
ఈ ఏడాది మొదట్లో కూడా ఎన్నికల సందడి కనిపించలేదు. బీజేపీ మద్దతుతో జేడీయూ గెలుస్తుందని, మళ్లీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారులే అన్న మాటలే చప్పగా వినిపించాయి. నితీష్ కుమార్ పార్టీని విమర్శిస్తూ వచ్చిన లోక్‌జనశక్తి పార్టీ, బీజేపీతో చేతులు కలపడంతో ముఖ్యమంత్రిగా నితీష్ ఈసారి తప్పుకోవడం తప్పనిసరని అందరూ భావించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకొని నితీష్ కుమార్‌కు మద్దతు ప్రకటించడంతో రాజీ కుదిరిందనుకున్నారు. కానీ నితీష్ ఫొటోలు లేకుండా బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుండడం, ప్రధాని మోదీ పోస్టర్లతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం, ఎల్‌జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ నాయకులు ఇప్పటికీ ప్రశంసించడం చూస్తుంటే నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లే కనిపిస్తోంది. (తొలి దశ ఓటింగ్ 54.26%!)
మరోపక్క కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌తో కలసి పోటీ చేస్తోన్న ఆర్జేడీ కూడా నితీష్ కుమార్ లక్ష్యంగాన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వీ యాదవ్, మోదీకి బదులు నితీష్‌నే ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఆయన విస్తృత ఎన్నికల ప్రచారానికి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండడం కూడా నితీష్ భవితవ్యాన్ని ప్రశ్నిస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ సారి బిహార్ ఎన్నికలు నితీష్ పనితీరుకు రిఫరెండమ్ అని చెబుతున్నారు. (నితీష్‌ని ఇరకాటంలో పడేసిన మోదీ)
Comments
Please login to add a commentAdd a comment