సంబరాలు జరుపుకుంటున్న ఎల్జేపీ శ్రేణులు
న్యూఢిల్లీ: బిహార్లో అధికారంలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) నుంచి ఆదివారం కీలక భాగస్వామ్య పక్షం లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వైదొలగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 143 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్నది తమ లక్ష్యమని, అందుకు కృషి చేస్తామని పేర్కొంది.
ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ భేటీలో నిర్ణయించారు. లక్షలాది బిహారీల అభిప్రాయాలను క్రోడీకరించి తాము రూపొందించిన ‘బిహార్ ఫస్ట్.. బిహారీ ఫస్ట్’ దార్శనిక పత్రం అమలు జేడీయూతో కలిసి కూటమిలో ఉంటే సాధ్యం కాదని స్పష్టమైందని వ్యాఖ్యానించింది.
జేడీయూతో సైద్ధాంతిక విభేదాల కారణంగా కూటమికి సంబంధం లేకుండా బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, బీజేపీ అభ్యర్థులు పోటీలో నిలిచిన స్థానాల్లో ఎల్జేపీ తరఫున అభ్యర్థులను నిలపబోమని తెలిపింది. బీజేపీపై వ్యతిరేకత లేదని, ప్రధాని మోదీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొంది. ఎల్జేపీ నిర్ణయంతో.. రానున్న ఎన్నికల్లో జేడీయూ పలు స్థానాల్లో నష్టపోనుందని, కాంగ్రెస్, ఆర్జేడీల విపక్ష కూటమి లాభపడే అవకాశముందని భావిస్తున్నారు.
అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: వీఐపీ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీకి దిగుతామని విపక్ష కూటమి నుంచి బయటకు వచ్చిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) ప్రకటించింది.
రామ్‌విలాస్ పాశ్వాన్‌కు శస్త్ర చికిత్స
కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్‌కు ఆదివారం గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అస్వస్థతతో గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దళిత నేత హత్య
బహిష్కృత ఆర్జేడీ నేత శక్తి మాలిక్ ఆదివారం హత్యకు గురయ్యారు. బిహార్‌లోని పుర్నియా జిల్లాలోని ఆయన నివాసంలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయారు. ఇది రాజకీయ హత్య అని, దళిత నాయకుడైన తన భర్త స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన భార్య ఆరోపించారు. శక్తి మాలిక్ హత్య అనంతరం ఒక వీడియో వైరల్ అయింది. రాణిగంజ్ టికెట్ కావాలంటే రూ. 50 లక్షలు ఇవ్వాలని తేజస్వీ యాదవ్ శక్తి మాలిక్‌ను డిమాండ్ చేస్తున్నట్లుగా, అంతు చూస్తానని బెదిరించినట్లు, కులం పేరుతో దూషించినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ కేసులో తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment