సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. కీలకమైన ఎన్నికలకు ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి (ఎల్‌జేపీ) దూరమవ్వడంతో ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొదటి నుంచి ఎల్‌జేపీకి వెన్నుదన్నుగా ఉన్న దళిత సామాజికవర్గం ఈసారి ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమికి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోపార్టీ వికాస్‌షీల్ ఇసాన్ పార్టీ (వీఐపీ)కి తమ కూటమిలో చోటిచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఈబీసీలను కొంతమేర తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇరు పార్టీల అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాలపై కూటమి నేతలు వరుస సమీక్షలు చేపడుతున్నారు. (పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!)
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యతన శనివారం సమావేశమైన వీరు.. బిహార్ ఎన్నికల్లో విజయావకాశాల గురించి చర్చించారు. ఎల్‌జేపీ దూరంకావడంతో దాని ప్రభావం ఎన్డీయే కూటమిపై ఏ విధంగా పడబోతుందనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థులు పోటీచేసే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే విధంగా అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారం కూడా నిర్వహించాలని మోదీ, అమిత్ షా స్థానిక నేతలకు సూచించారు.
అయితే కేవలం జేడీయూ అభ్యర్థులున్న చోటనే ఎల్‌జేపీ అభ్యర్థులను నిలబెట్టడంతో కూటమిలో కొంతమేర విభేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. తాము నితీష్‌కు మాత్రమే వ్యతిరేకమని, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించడం ఎన్డీయే కూటమిలో కలకలం రేపుతోంది. ఈ అంశంపై కూడా తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 121, నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ 122 స్థానాల్లో పోటీచేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ ఒంటరిగా బరికి దిగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment