బీజేపీ కళ్లు తెరుస్తుందా? | Editorial on BJP Government in By Elections | Sakshi
Sakshi News home page

బీజేపీ కళ్లు తెరుస్తుందా?

Published Fri, Mar 16 2018 12:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

Editorial on BJP Government in By Elections - Sakshi

ఉప ఎన్నికలు జరిగినప్పుడు సర్వసాధారణంగా పాలకపక్షాలే గెలుస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ, జేడీ(యూ) లకు షాకిచ్చాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని ఆవిరిచేశాయి. ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన రెండు లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. బిహార్‌లో ఉప ఎన్నిక జరిగిన ఒక లోక్‌సభ స్థానాన్ని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ గెల్చుకోగా, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీ చెరొకటీ గెల్చుకున్నాయి. ఈ ఉప ఎన్నికలు అనేక విధాల కీలకమైనవి. యూపీలోని గోరఖ్‌పూర్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సొంత స్థానం. 

ఆయన గోరఖ్‌పూర్‌ మఠం ప్రధాన పూజారిగా ఉంటూ ఇక్కడ అయిదు దఫాలు విజయం సాధించారు. అంతక్రితం కూడా ఆ మఠం ప్రధాన పూజారులే విజేతలు. వెరసి ముప్పై ఏళ్లుగా అది బీజేపీదే. మరో స్థానం ఫుల్పూర్‌ 2014లో తొలిసారి బీజేపీ గెలిచిన స్థానం గనుక అక్కడ ఇప్పుడెదురైన ఓటమి ఆ పార్టీని పెద్దగా బాధించదు. ఇక బిహార్‌లో లాలూ జైల్లో ఉన్నా ఆయన తనయుడు తేజస్వియాదవ్‌ గట్టిగా కృషి చేసి తమ పార్టీ స్థానాలను నిలబెట్టుకోగలిగారు.  

ఉప ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడం బీజేపీకి ఇది మొదటిసారేమీ కాదు. గత సార్వత్రిక ఎన్నికలు జరిగిన నాలుగు నెలల తర్వాత పది రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకూ, 33 అసెంబ్లీ స్థానాలకూ జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ సగం స్థానాలు పోగొట్టుకుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఈమధ్య రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జరి గిన ఉప ఎన్నికల్లో సైతం అదే జరిగింది. ఏ పార్టీకైనా ఎన్నికల్లో గెలుపు అర్థమైనం తగా ఓటమి అర్థంకాదు. ఎందుకంటే ఓటమి అనాథ. ఎవరికి వారు నెపాన్ని ఎదు టివారిపైకి నెట్టే యత్నం చేస్తారు. అందువల్ల ఇప్పుడెదురైన చేదు అనుభవానికి కారణాలేమిటో అర్థం కావడానికి బీజేపీకి మరికొంత సమయం పడుతుంది. 

నిజా నికి ఉప ఎన్నికలను పాలకపక్షాలు పెద్దగా పట్టించుకునేవి కాదు. అక్కడ గెలిచినా, ఓడినా అదనంగా ఒరిగేదేమిటని అనుకునేవి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాల సారథ్యం మొదలయ్యాక పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బీజేపీ ప్రతి ఎన్నికనూ తీవ్రంగా తీసుకుంటోంది. ఉప ఎన్నికలను కూడా వదలడం లేదు. ప్రస్తుత ఉపఎన్నికలనూ అలాగే భావించింది. కనుకనే ఇప్పుడు వెల్లడైన ఫలితాలు ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఉన్న 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 71 గెల్చుకుంది. మోదీ ఆ రాష్ట్రంలోని వారణాసి స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలాగే సరిగ్గా సంవత్సరం క్రితం అక్కడి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 403 స్థానాలకు 312 సాధించింది. 

ఇలాంటి రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా గెల్చుకుంటున్న లోక్‌సభ స్థానాన్ని, అందునా మొన్నటివరకూ సీఎం ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని చేజార్చుకోవడం చిన్న విషయం కాదు. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్‌పీలు ఏకమవుతాయనిగానీ... ఏక మైనా ఇంతటి ప్రభావం చూపగలవనిగానీ తాము అనుకోలేదని, అతి విశ్వాసమే దెబ్బతీసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50 శాతం బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఆ రెండు పార్టీల ఓట్లనూ కలిపి లెక్కేసినా బీజేపీ కన్నా అవి చాలా దూరంలో ఉన్నాయి. 

ఆ ఓట్లన్నీ ఇప్పుడెందుకు గల్లంతయ్యాయి? బీఎస్‌పీ నేత మాయావతి వ్యూహాత్మకంగా ఎన్నికల బరినుంచి తప్పుకుని ప్రధాన శత్రువుగా భావించే ఎస్‌పీకి మద్దతు ప్రకటించడం ఉప ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేసింది. దళిత ఓటర్లు మాయావతి పిలుపు అందుకుని మూకుమ్మడిగా ఎస్‌పీకి ఓట్లేశారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఎన్నికల్లో యాదవులకే పెద్దపీట వేసే అలవాటున్న ఎస్‌పీ ఈసారి రెండు స్థానాలనూ ఓబీసీలకు కేటాయించడం కూడా గెలుపునకు దోహదపడింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ చేతులు కలిపితే బీజేపీ కంగారుపడక తప్పదు.

బిహార్‌ ఉప ఎన్నికలు సైతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యూ)నేత నితీష్‌ కుమార్‌తోపాటు బీజేపీ పెద్దల్ని కూడా నిరాశపరిచాయి. 2015లో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌ల కూటమి బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా...ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ కూటమినుంచి నితీష్‌ వైదొలగి, సీఎం పదవికి రాజీనామా చేసి, విపక్షంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వానికి సార థ్యంవహించడం మొదలెట్టారు. పైగా రెండు కేసుల్లో దోషిగా తేలి లాలూ జైల్లో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులందరూ అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. లాలూ కుమారుడు తేజస్వియాదవ్‌ ఎన్నికల పోరులో అనుభవమున్న వ్యక్తికాదు. కనుక ఈ ఉప ఎన్నికలో గెలుపు ఖాయమని అధికార కూటమి భావించింది. కానీ ఓటర్లు వేరేలా తలిచారు. 

కొత్తగా అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు మెరుగైన, సమర్ధవంతమైన పాలన అందించడానికి బదులు పోలీసులకు విస్తృతాధికారాలిస్తాయి. వారు చేసే హడా వుడి కారణంగా ప్రభుత్వం చాలా చురుగ్గా ఉన్నట్టు అందరూ భావిస్తారని పాలకుల విశ్వాసం. యోగి ఆదిత్యనాథ్‌ కూడా దీన్ని తుచ తప్పకుండా పాటించారు. పోలీ సులు ముందుగా ప్రేమికులపై ప్రతాపం చూపడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈవ్‌టీజింగ్‌ను కట్టడి చేసే పేరుతో నడి బజారుల్లో అతిగా ప్రవర్తించారు. నేర స్తులను అరికట్టే పేరిట ఏకంగా వరస ఎన్‌కౌంటర్లకు దిగారు. 

యోగి అధికారం స్వీకరించాక ఏడాది వ్యవధిలో 1,142 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిల్లో 38మంది చనిపోయారు. ప్రతి ఎన్‌కౌంటర్‌కూ వేర్వేరు కథలు వినిపించే ఓపిక లేక కాబోలు ఒకే మాదిరి కథనాన్ని 9 ఎఫ్‌ఐఆర్‌లలో చేర్చారు. నేరాన్ని కట్టడి చేసే పేరుతో ప్రభుత్వమే ఇలా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడటాన్ని జనం మెచ్చరు. ఇలాంటి వన్నీ యోగి పాలనను పలచన చేశాయి. ఈ ఉప ఎన్నికలను హెచ్చరికగా భావించి లోపాలను సరిదిద్దుకోనట్టయితే, విపక్షాలను తక్కువగా అంచనా వేస్తే వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితుల్లో పడొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement