శక్తికేంద్ర సమావేశాలు ప్రారంభం | Power central meetings in New Delhi | Sakshi
Sakshi News home page

శక్తికేంద్ర సమావేశాలు ప్రారంభం

Published Tue, Dec 2 2014 12:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Power central meetings in New Delhi

 సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలకు బీజేపీ అన్నివిధాలుగా సన్నద్ధమవుతోంది. ఇందులోభాగంగా వ్యవస్థాపరంగా పటిష్టమయ్యేం దుకు ప్రయత్నాలు ఆరంభించింది. కార్యకర్తల్లో మరింత ఉత్తేజితులను చేసే ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇందులోభాగంగా శక్తికేంద్ర సమావేశాలను జాతీయ రాజధాని నగరంలో సోమవారం ప్రారంభించింది.ఈ సమావేశాల్లో పాల్గొంటున్న దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కేంద్ర సహాయ మంత్రులు గిరిరాజ్‌సింగ్, సాధ్వీ నిరంజన్‌జ్యోతితోపాటు బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు ఎంపీలు ఆ పార్టీ కార్యకర్తలతో సోమవారం ముచ్చటించారు. ఈ సమావేశాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేదాకా కొనసాగనున్నాయి. దాదాపు20 రోజుల పాటు కొనసాగనున్నాయి. సోమవారం  ఏడుగురు ఎంపీలు  శక్తి కేంద్ర సమావేశాలలో పాల్గొన్నారు.
 
 బీహార్‌కు చెందిన గిరిరాజ్‌సింగ్ కేశవపురంలోని ధీర్‌పుర్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన జగదాంబికాపాల్... ఓఖ్లా, రామ్ చరిత్ నిషాద్ ఇంద్రలోక్, వినోద్‌సోన్‌కర్... చాందినీచౌక్,  రాజస్థాన్‌కు చెందిన సంతోష్ అహ్లావత్‌లలల కోట్లాముబారక్‌పుర్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన సాధ్వీనిరంజన్ జ్యోతి...  పశ్చిమ ఢిల్లీలోని ఖయాలా నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో ముచ్చటించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీల సంఖ్య అంతంతగానే ఉన్నప్పటికీ మున్ముందు పెరుగుతుందని అంటున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ ఎంపీలతో విధానసభ ఎన్నికల ప్రచారం చేయించాలంటూ ఆ పార్టీ   జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా  ఆదేశించారు. ఈ మేరకు పార్టీకి చెందిన 300 మంది ఎంపీలు  ఈ నెల ఒకటో తేదీనుంచి 20 వరకు ఇక్కడ నిర్వహించనున్న దాదాపు 2,700 శక్తికేంద్ర సమావేశాలలో పాల్గొని కార్యకర్తలతో ముచ్చటిస్తారని దక్షిణఢిల్లీ ఎంపీ రమేష్ బిధూడీ చెప్పారు.
 
 పార్లమెంట్ పనిచేసే రోజుల్లో  శక్తికేంద్ర సమావేశాలు సాయంత్రం వేళల్లో జరుగుతాయని, సెలవురోజుల్లో రెండు పూటలా జరుగుతాయన్నారు. ఒక్కొక్క ఎంపీ రోజుకు  రెండు మూడు సమావేశాలలో పాల్గొంటారని వివరించారు. ఓటర్ల నేపథ్యాన్ని బట్టి వారివారి ప్రాంతాలకు చెందిన ఎంపీలతో శక్తికేంద్ర సమావేశాలు జరుపుతారు. ఇదిలాఉంచితే పూర్వాంచల్ ఓటర్లపై బీజేపీ దృష్టి సారించనుంది. అందువల్ల తొలిరోజునే పూర్వాంచలీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించింది. మున్ముందు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లకు చెందిన ఎంపీలు నగరంలోని పలుప్రాంతాలలో నిర్వహించనున్న శక్తికేంద్ర సమావేశాలలో పాల్గొనున్నారు. ఈ సభలు తమ పార్టీ కార్యకర్తలకు  నూతనోత్తేజాన్ని ఇస్తాయని ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement