మాజీ సిఎం... డిప్యూటీ సిఎం
ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్‌లో ఉన్న శక్తిపీఠం ‘వింధ్యావాసిని’ని దర్శించుకుంటున్న వీరిద్దరూ పరిచితం. ఒకరు రబ్రీదేవి- బిహార్ మాజీ ముఖ్యమంత్రి. మరొకరు ఆమె కుమారుడు ప్రస్తుత బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. ఒకప్పుడు రంజీ ట్రోఫీలు ఆడి క్రికెటర్ అవుదామనుకున్న తేజస్విని పిలిచి తండ్రి లాలూ పొలిటికల్ బ్యాట్ ఇచ్చి గేమ్ ఆడమన్నాడు. ప్రస్తుతం ఆ ఆటలో ఉన్న తేజస్వి కేంద్ర ప్రభుత్వం మీద అడపా దడపా విసుర్లు విసురుతుంటాడు. ‘కేంద్రప్రభుత్వం పనితీరు కంటే మీరంతా జంగిల్‌రాజ్ అని పిలిచే మా బిహార్‌లోనే ప్రభుత్వం పనితీరు బాగుంది’ అని ఇటీవల అతడు వ్యాఖ్యానించాడు. రానున్న
ఎన్నికల్లో బిజెపి మీద పోరాటానికి ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్న లాలూ కుటుంబం అందుకు ఆలయాల దర్శనం కూడా ముఖ్యమని భావించినట్టుంది. అన్నట్టు వింధ్యాచల్‌లో ఉన్న వింధ్యావాసిని అమ్మవారి కథతో కృష్ణుడి కథ ముడిపడి ఉంది. కృష్ణుడు పుట్టాక అతణ్ణి తప్పించి మరో పసిపాపను పెట్టాక కంసుడు వచ్చి ఆ పసిపాపను కూడా చంపబోతాడు. అప్పుడు ఆ పాప గాలిలో అదృశ్యమై ‘దుర్మార్గుడా... నిన్ను సంహరించేవాడు ఇదివరకే జన్మించేశాడురా’ అని చెప్పి అదృశ్యమవుతుంది. ఆ తర్వాత ఆ పసిపాప శక్తిరూపం దాల్చి వింధ్యావాసినిగా వింధ్యా చల ప్రాంతంలో ఉండిపోయిందని భక్తుల నమ్మకం. ఈ శక్తిపీఠానికి నిత్యం వచ్చే భక్తుల సంఖ్య ఏ మాత్రం తక్కువ కాదు. వారిలో కోరికలతో వచ్చే సిఎంలు, మాజీ సిఎంలు కనిపించడంలో ఆశ్చర్యం లేదు.