పప్పుల రేట్లు పైపైకి..
కేజీకి రూ.8-10లు పెరుగుదల
రిటైల్ మార్కెట్లో మరింత ఎక్కువ
సిటీబ్యూరో : నగర మార్కెట్లో పెసర, మినపప్పుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే వీటి ధర కేజీకి రూ.8-10లు అదనంగా పెరగడం సామాన్య ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రిటైల్ మార్కెట్లో మినపప్పు కేజీ రూ.98, పెసర పప్పు కేజీ రూ.110 ధర పలుకుతోంది. గత నెలలో పెసరపప్పు కేజీ రూ.99, మినపప్పు రూ.90 ఉండేది. కొత్తపంట రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండంతో వ్యాపారులు కూడబలుక్కొని ధరలు పెంచేశారన్న వాదనలు విన్పిస్తున్నాయి. కార్పొరేట్ దుకాణాలతో పోలిస్తే కాస్తో కూస్తో రైతుబజార్లలో పప్పుల ధరలు కొంతమేర తక్కువగా ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పలు రైతుబజార్లలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పెసరపప్పు కిలో రూ.91, మినపప్పు రూ.103ల ప్రకారం విక్రయించారు. నిత్యం డీఎస్‌ఓ కార్యాలయం నుంచి పప్పుల ధరలు తెలుసుకొని హోల్ సేల్ ధరకు రూ.2 అదనంగా నిర్ణయిస్తుండటంతో రైతుబజార్లలో ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే కందిపప్పు ధర గత వారం రోజుల్లోనే రూ.2-3 పెరిగింది. రైతుబజార్లలోని గృహ మిత్ర, ఏపీ మార్క్‌ఫెడ్, నాఫెడ్, హాకా, డీసీఎంఎస్ ఏజెన్సీలు కందిపప్పును అందుబాటులో ఉంచడం ద్వారా ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ముందు జాగ్రత్త...
మినప, పెసరపప్పు ధరలు పెరుగుతుండటంతో నగరంలోని పలు హోటళ్లు, మెస్‌ల నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించారు. కొన్ని హోటళ్లలో నాణ్యమైన మినప, పెసర పప్పులో రెండో క్వాలిటీని మిక్స్ చేసి మెనూను యథావిధిగా కొనసాగిస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం భోజనంలో కందిపప్పుకు బదులు శెనగపప్పు, ఎర్రపప్పును, ఇతర కూరగాయల కర్రీని ఇస్తున్నాయి. కందిపప్పును మెనూలో తప్పనిసరిగా ఇచ్చే హోటళ్లలో మాత్రం అది పప్పులా కాకుండా పలుచగా సాంబారులా అందిస్తున్నారు.