కథాసంక్రాంతి | Special Story On Sankranti Festival | Sakshi
Sakshi News home page

కథాసంక్రాంతి

Published Sun, Jan 12 2020 1:46 AM | Last Updated on Sun, Jan 12 2020 1:46 AM

Special Story On Sankranti Festival - Sakshi

సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేయడంతో కపిలముని కంటినుండి వెలువడిన మంటలు వాళ్లందరినీ బూడిదగా మార్చేశాయి. ఆ భస్మరాశుల మీద పవిత్రమైన గంగాజలాలు  ప్రవహిస్తే కానీ, వారికి సద్గతులు కలగవని తెలుసుకుని తమ పితరులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించేందుకు ఆ వంశంలోని దిలీపుడు, అంశుమంతుడు తదితరులందరూ ఆకాశంలో ఉండే గంగని నేలమీదకి రప్పించడం కోసం పరిపరివిధాలా ప్రయత్నించి విఫలమవుతారు. చివరికి అదే వంశంలో పుట్టిన భగీరథుడు అనేకానేక ప్రయత్నాలు చే స్తాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతిరోజునే గంగమ్మ నేలమీద అవతరించిందని కొన్ని పురాగాథలను బట్టి తెలుస్తుంది.

సంక్రాంతి గంగిరెద్దుల వెనుక ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. స్వభావరీత్యా మంచివాడే, అయినప్పటికీ పుట్టుకతో వచ్చిన అసుర లక్షణాల వల్ల శివుడు ఎల్లప్పుడూ తన కడుపులో ఉండాలని వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దాని ప్రకారం దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ ధరించి, నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. గజాసురుడి భవనం ముందు చిత్ర విచిత్ర రీతులలో గంగిరెద్దును ఆడించారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు వరమిస్తాను, కోరుకోమన్నాడు. ‘‘ఇది శివుడి వాహనమైన నంది, తన యజమానిని కనుగొనాలని వచ్చింది కాబట్టి నీ పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపు’’ అని కోరారు. వారు ఆనాడు శివుని పొందేందుకు చేసిన విన్యాసాలే ఈనాటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ ఉంది.

ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు. అప్పటినుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకే గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. సంక్రాంతితోపాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది.

సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీ కృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమట.  అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగటికాలం అనీ, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమనీ చెబుతారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారనీ, వారిని తల్చుకుంటూ ప్రసాదాలు పెట్టాలనీ ఓ ఆచారం.

కనుమ రోజు  మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకనే గారెలు, మాంసంతో... ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. కనుమ రోజున రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది. ఇలా కనుమతోనే సంక్రాంతి సంప్రదాయాలన్నీ పూర్తయిపోతాయి. అందుకనే శాస్త్ర ప్రకారం అసలు ముక్కనుమ అన్న పండుగే లేదు. కాకపోతే కనుమ మర్నాడు గ్రామదేవతలకు బలులిచ్చి, మాంసాహారాన్ని వండుకునే ఆచారం మాత్రం ఉంది. అదే క్రమంగా ముక్కనుమగా మారింది.
 ఇవీ సంక్రాంతి కథలు, కబుర్లు.
– గోపరాజు పూర్ణిమాస్వాతి

కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు...?
తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు... భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ. కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు కూడా ఆగి... పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని... మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు అత్యవసరం అయితే తప్ప.. ఆ మాట దాటకూడదనీ...కాదూ కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement