సంక్రాంతి పండుగ వచ్చింది. వస్తూ వస్తూ బండెడు ధాన్యాన్ని మోసుకొచ్చింది. ఏడాదంతా రైతులు పొలంలో పడిన కష్టానికి ప్రతిఫలం. ఈ పండుగ సందర్భంగా.. ‘రాబోయే ఏడాదికి ఈ పంటలు వేసి చూడండి..’ అంటూ అంతరించి పోతున్న పంట విత్తనాల ప్రదర్శన పెట్టారు మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్ గ్రామ మహిళా రైతులు.
సంక్రాంతి.. పంటల పండుగే కాదు, విత్తనాల పండుగ కూడా అంటున్నారు ఈ మహిళా రైతులు. బండిని, ఎడ్లను అలంకరించి అరుదైన విత్తనాలను పెట్టెల్లో పెట్టి ఊరూరా తిప్పుతున్నారు. ఈ వేడుకను చూడడానికి విదేశాల నుంచి కూడా మహిళా రైతు ప్రతినిధులు పస్తాపూర్ వచ్చారు. వెస్ట్ ఆఫ్రికాలోని మాలి అనే చిన్న దేశం నుంచి వచ్చిన అలిమాత ట్రావోరే... మెదక్ జిల్లాలో ఇరవై ఏళ్లుగా జీవ వైవిధ్య పంటల సాగు చేస్తున్న మహిళా రైతులతో సమావేశమయ్యారు. నిన్న భోగి పండుగ రోజు ప్రారంభమైన జీవ వైవిధ్య సంచార జాతర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు.
మీ నుంచి నేర్చుకున్నాం
‘‘భారతదేశం నుంచి అనేక మంది మహిళలు 2014లో వెస్ట్ ఆఫ్రికాలోని డిజిమినిలో జరిగిన విత్తన మేళాకు హాజరయ్యారు. డీడీఎస్ (దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ) మహిళలు అవలంబిస్తున్న విత్తన బ్యాంకు విధానాన్ని మేము కూడా అనుసరిస్తున్నాం. ఈ గ్రామీణ మహిళల స్పూర్తితో మా దేశాల్లో కూడా గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేయగలిగాం. విత్తనాలను భద్రపరుస్తున్నాం. చిరు ధాన్యాల ప్రాసెసింగ్, మిల్లెట్ మార్కెటింగ్, చెట్ల మందులు తదితర వాటిపై వీడియోలు తీయడం కూడా నేర్చుకున్నారు’’ అని చెప్పారు ట్రావోరే. ఈ సమావేశానికి వచ్చిన సెనెగల్‌కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్టర్, మహిళా రైతు ఫ్రాన్సిస్కాడౌఫ్ మాట్లాడుతూ.. ‘‘భారతీయ మహిళల ఆహార పంటల సేద్యం చాలా బాగుంది. సేంద్రీయ వ్యవసాయం చేయడం ఎంతో గొప్ప విషయం.
జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను, ఇక్కడి అనుభవాల గురించి తెలుసుకునేందుకు వచ్చాను’’ అన్నారు. ప్రాన్స్ కు చెందిన జీవ వైవిద్య వినిమయం, అనుభవాలను పంచుకునే సంస్థ ప్రతినిధి ఆనె బర్‌సో మాట్లాడుతూ ‘‘మేము జీవ వైవిద్యం, ఆహారం కోసం పనిచేసే ఇతర సంస్థలను కలుపుకుని పనిచేస్తున్నాం. మా వ్యవసాయానికి, ఆహార భద్రతకు వాణిజ్య సంస్థల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వెస్ట్ ఆఫ్రికాలో ఒక కొత్త గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలన్నదే మా ప్రయత్నం’’ అని పేర్కొన్నారు. జీవ వైవిద్యాన్ని పరిరక్షించుకునేందుకు గాను మనమంతా కలిసి మన గొంతుకలను పెద్దవిగా చేసి వినిపించాల్సిన అవసరం ఉందని మహిళా రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.
– శ్రీనివాసరెడ్డి, సాక్షి, జహీరాబాద్
ఫొటోలు : బి. శివప్రసాద్ సాక్షి, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment