ఇంటింటా సంక్షేమ సంక్రాంతి | AP People Getting The Welfare Benefits of YS Jagan Govt | Sakshi
Sakshi News home page

ఇంటింటా సంక్షేమ సంక్రాంతి

Published Wed, Jan 15 2020 3:56 AM | Last Updated on Wed, Jan 15 2020 8:03 AM

AP People Getting The Welfare Benefits of YS Jagan Govt  - Sakshi

సాక్షి, అమరావతి: చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సంక్రాంతి పండుగ కొత్త కళ సంతరించుకుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో తెలుగింట అతి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. పండుగ కొనుగోళ్లతో దుకాణాలు కిటకిటలాడటంతో వ్యాపారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కాలం కలిసి రావడం, ప్రభుత్వం అండగా నిలవడంతో సాగుతోపాటు వ్యవసాయ దిగుబడులు పెరిగాయి. వైఎస్‌ జగన్‌ సర్కారు ‘నవరత్నాల’ పథకాలతో గడప గడపకూ కొత్త కొత్త సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. లక్షలాది మంది చిరుద్యోగులకు వేతనాలు / గౌరవ వేతనాలు పెరిగాయి. వార్డు, గ్రామ సచివాలయాలతో నిరుద్యోగులకు లక్షలాది కొత్త ఉద్యోగాలు వచ్చాయి. రైతులతోపాటు అన్ని వర్గాలకు ఆర్థిక బాసట లభించింది.

మొత్తమ్మీద ‘నవరత్నా‘లు ప్రతిఫలించి సంక్షేమ సం‘క్రాంతి’ వెల్లివిరిసింది. వెరసి రాష్ట్రమంతటా వస్త్ర, కిరాణా సరుకుల కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు కిటకిటలాడిన దుకాణాలు రుజువు చేశాయి. పిండి వంటలతో వీధులు ఘుమ ఘుమలాడుతున్నాయి. రంగవల్లులు, గొబ్బమ్మలతో ప్రతి గడపా కొత్త శోభ సంతరించుకుంది. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థాయిలో వారు ఇంటిల్లిపాదికీ కొత్త వస్త్రాలు కొనుగోలు చేశారు. ఆడపడుచులను ఆహ్వానించి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. రైతు భరోసా, ధరల స్థిరీకరణ నిధి లాంటి పథకాలకు తోడు.. వరుణుడు కరుణించడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. కూలీలకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. వీటన్నింటికీ తోడు ప్రతి కుటుంబానికి రెండు మూడు సంక్షేమ పథకాల ఫలాలు అందడం వల్ల ఈ ఏడాది ప్రజలు నిజమైన సంక్రాంతి జరుపుకుంటున్నారు. ఎడ్ల పందేలు, రంగవల్లులు, గంగిరెద్దులు, ఆట, పాటల మధ్య ఊరూరా.. ఇంటింటా.. సంక్రాంతి సంబరం అంబరం అంటింది. 
                                                            
రైతు లోగిళ్లలో లక్ష్మీకళ 
మంచి వర్షాలతో కాలం కలిసి రావడం, రైతు పక్షపాతి వైఎస్‌ జగన్‌ సర్కారు తన వంతు పూర్తి స్థాయి ప్రోత్రాహం అందించడంతో  అన్నదాతలకు ఆర్థిక భరోసా ఏర్పడింది. భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కడం, రిజర్వాయర్లు నిండటం, ప్రభుత్వం రైతు భరోసా కింద ఆర్థిక దన్ను కల్పించడంతో ఖరీఫ్‌లో పంటల సాగు పెరిగింది. దీంతో వ్యవసాయోత్పత్తుల దిగుబడి ఊహించని విధంగా పెరిగింది. దీంతో రైతు లోగిళ్లు లక్ష్మీకళ సంతరించుకున్నాయి. రబీలోనూ సాగు విస్తీర్ణం రికార్డు స్థాయికి చేరుకుంది.

వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ కింద పంటల సాగుకు ఖర్చుల నిమిత్తం ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. రూ.13,500 చొప్పున తొలి ఏడాది అందజేసింది. ఈ పథకం కింద 44,92,513 మంది రైతులు, 1,58,116 మంది కౌలు రైతులు.. మొత్తం 46,50,629 మంది లబ్ధి పొందారు. మొదటి ఏడాది కింద ప్రభుత్వం రూ.6,298.98 కోట్లు చెల్లించింది. మరోవైపు ధరల స్థిరీకరణ కోసం కేటాయించిన రూ.3 వేల కోట్ల నిధి నుంచి శనగ రైతులకు సాయం అందించింది. 22 పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి అండగా నిలిచింది. కనీస గిట్టుబాటు ధర లేని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి వంటి వాటికి దేశంలో ఎక్కడా లేని విధంగా సేకరణ ధరలను ప్రకటించడమే కాకుండా వీటిని ప్రతి గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తోంది. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు 217 మార్కెట్‌ యార్డులు, 150 సబ్‌ మార్కెట్‌ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేసింది.  

ఇంతకన్నా ఏం కావాలి?
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి బాగుంది. శానా సంవత్సరాల తర్వాత వర్షాలు బాగా పడ్డాయి. పంటలు సేతికొచ్చాయి. మొన్న నాణ్యమైన వేరుశనగ కాయలు ఇచ్చారు. నల్లరేగడి భూముల రైతులకు పప్పుశెనగ విత్తనాలు ఇచ్చారు. వైఎస్సార్‌ రైతు భరోసాతో మా లాంటి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్న కారు రైతులకు చాలా ప్రయోజనం కలిగింది. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. ఇంకా ఉచిత బోర్లు, గిట్టుబాటు ధరలు.. ఇవి కాకుండా అమ్మఒడి లాంటి పథకాల ద్వారా పల్లెల్లో చాలా మంది ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. రైతులకు ఇంతకన్నా ఏమి కావాలి?
– ఎస్‌.గోవిందప్ప, దేవాదులకొండ గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా

ఉద్యోగులందరిలోనూ నూతనోత్సాహం
ప్రభుత్వ ఉద్యోగులకు పదో వేతన సవరణ సంఘం గడువు ముగిసినందున జగన్‌ సర్కారు 27 శాతం మధ్యంతర భృతిని గత ఏడాది జూలై నుంచే అమలు చేస్తోంది. దీంతో ఉద్యోగవర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. ఆశ వర్కర్లు, హోంగార్డులు, పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య మిత్రలు, లాంటి చిరుద్యోగులకు జగన్‌ ప్రభుత్వం గౌరవ వేతనం/ వేతనం పెంచింది. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. 

ఐఆర్‌ ఒకేసారి ఇవ్వడం సంతోషం
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా 27 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్‌) ఇవ్వడం సంతోషంగా వుంది. పాదయాత్ర సందర్భంగా  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఐఆర్‌ ఇచ్చారు. గత ప్రభుత్వాలు ప్రకటించిన ఐఆర్‌ను అయిదు నెలల తర్వాత అమలు చేశాయి. ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. 
– బి.వి.రాణి, తహసీల్దార్, గోపాలపట్నం, జేఏసీ ఉమెన్‌ వింగ్, విశాఖపట్నం

సచివాలయాలతో ఉద్యోగ జాతర
ప్రజల గడపకే సంక్షేమ ఫలాలు అందించాలనే ఉదాత్త లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 2.70 లక్షల మందికి గ్రామ వలంటీర్లుగా ఉపాధి లభించింది. 1,34,000 మందికి శాశ్వత ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర చరిత్రలో ఇంత మందికి అతి తక్కువ కాలంలో ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఇప్పటి వరకూ లేకపోవడం గమనార్హం. 

జగన్‌ చలువతోనే ఉద్యోగం 
నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే మాట నిలుపుకున్నారు. స్వల్ప కాలంలోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నారు. నేను బీఎస్సీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి కాగానే నాకు ఉద్యోగం వచ్చింది. నాలా ఎందరో ఉద్యోగాలు పొందారు. ఈ విషయాన్ని ఎప్పటికీ మరచిపోలేం. మేము ఎప్పటికీ సీఎంకు రుణపడి ఉంటాం.  
– బండారి లక్ష్మీలావణ్య, సచివాలయం కార్యదర్శి, పెదపట్నంలంక, మామిడికుదురు మండలం, తూర్పు గోదావరి జిల్లా  

వైఎస్సార్‌ వాహన మిత్ర.. ఎంతో అండ
ఆటో/ మ్యాక్సీ క్యాబ్‌లను సొంతంగా నడుపుకునే వారికి ప్రభుత్వం వైఎస్సార్‌ వాహన మిత్ర కింద రూ.10,000 ఆర్థిక సాయం అందించింది. ఈ పథకం ఆటో డ్రైవర్లకు ఎంతగానే అండగా నిలిచింది. ఆటో రిపేర్లకు, ట్యాక్స్‌ చెల్లింపులకు ఈ మొత్తం బాగా ఉపయోగపడుతుందని పలువురు ఆటో, ట్యాక్రీ డ్రైవర్లు కొనియాడుతున్నారు. 

ఇదివరకెవ్వరూ ఇలా ఆదుకోలేదు
నా కుటుంబానికి నేనే ఆధారం. నాకు ఒక పాప, బాబు ఉన్నారు. వారిని చదివిస్తున్నాను. ఆటో నడిపితే గానీ పూటగడవని పరిస్థితి. ఒక్కో రోజు వచ్చే మొత్తం గిట్టుబాటు కావడం లేదు. ఆటోకు ఏవైనా మరమ్మతులు చేయించాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకున్నా. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో రూ.10 వేలు నా బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. నాలాంటి ఎంతో మంది పేదలకు ఈ పథకం వరం. సీఎం జగన్‌కు మేమంతా రుణపడి ఉంటాం.
– బాగుల బాలాజీ, ఆటో డ్రైవర్, రేఖపల్లి, వీఆర్‌పురం మండలం, తూర్పు గోదావరి జిల్లా  

అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసట
నేను గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తుంటాను. అగ్రిగోల్డ్‌ సంస్థ లక్షలాది మంది ఖాతాదారులను నిలువునా ముంచింది. గత ప్రభుత్వానికి బాధితులు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌ మాత్రం.. నేనున్నానంటూ బాధితుల తరఫున న్యాయం చేసేందుకు పూనుకున్నారు. అధికారంలోకి రాగానే తొలి విడతగా అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.269 కోట్లు ఇచ్చి ఆదుకున్నారు. నేను రూ.10 వేల సాయం అందుకున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ప్రజల అదృష్టం. ఇకపై అగ్రిగోల్డ్‌ బాధితులు ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు. రానున్న రోజుల్లో అగ్రిగోల్డ్‌ బాధితులందరి కష్టాలు పూర్తిగా తీరుస్తారనే భరోసా వచ్చింది. 
– జి.సుబ్రమణ్యం, నూజెండ్ల, వినుకొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లా

పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఒక వరం 
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించారు. ఇది నిజంగా పోలీసులకు ఓ వరం లాంటిది. ఎప్పుడూ ఉద్యోగ ఒత్తిడిలో ఉండే పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండగలుగుతున్నాం. బ్రిటిష్‌ కాలం నాటి నుంచి పోలీస్‌ వ్యవస్థలో వీక్లీ ఆఫ్‌ అనేది లేదు. ఆ చరిత్రను ఈ సీఎం తిరగరాశారు. 
– కొప్పిశెట్టి శ్రీహరి, ట్రాఫిక్‌ కానిస్టేబుల్, రాజమహేంద్రవరం

ఎన్నెన్నో పథకాలతో కోట్లాది మందిలో సంక్రాంతి
– పిల్లలను చదివించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న ప్రతి పేద విద్యార్థి తల్లికి ప్రోత్సాహకంగా ఏటా రూ.15,000 అందించడం ఈ పథకం ఉద్దేశం. 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్లలో ఈ పథకం కింద రూ.6,456 కోట్లు జమ అయింది.   
– మగ్గం ఉన్న నేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని కింద ప్రతి లబ్ధిదారు కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది.  
– ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్‌ మొత్తాన్ని రూ.2,250కి పెంచింది. దీనిని ఏటా రూ.250 చొప్పునా పెంచుకుంటూ వెళ్తుంది.
– డ్వాక్రా మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలను అమల్లోకి తెచ్చింది. రాబడి రాగానే వడ్డీ లేకుండా అసలు మాత్రమే చెల్లించే వెసులుబాటు కల్పించింది.
– కొత్తగా ప్రాక్టీసు ప్రారంభించిన న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. 
– ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడం వల్ల రాష్ట్రంలోని 1.40 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది. రాష్ట్రంలోని ఆసుపత్రులతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సైతం వైద్యం పొందేలా విప్లవాత్మక మార్పులు చేసింది.   
– జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు పేద విద్యార్థుల పాలిట నిజంగా వరం. పేద విద్యార్థులు ఎంత వరకైనా చదువుకునేలా ఉన్నత చదువులకు అవసరమైన ఫీజు మొత్తాన్ని విద్యా దీవెన పథకం ద్వారా అందజేస్తుంది. హాస్టల్‌ వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేల సాయాన్ని వసతి దీవెన పథకం కింద ఇస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement