
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వ్యాపారవేత్త, సినీ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన షేర్ చేసిన ఫొటోలు మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ‘సంక్రాంతి శుభాకాంక్షలు.. వెలకట్టలేని ఙ్ఞాపకాలు’ అనే క్యాప్షన్‌తో తమ కుటుంబం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తండ్రీ కొడుకులు మెగాస్టార్ చిరంజీవి- రామ్‌చరణ్, అత్తాకోడళ్లు సురేఖ- ఉపాసన ఒకే రకమైన దుస్తులు ధరించి ఉన్న ఫొటో.. రామ్‌చరణ్ నానమ్మను ఉపాసన హత్తుకున్న ఫొటో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘మీకు కూడా పండుగ శుభాకాంక్షలు వదినా.. మీది పరిపూర్ణ కుటుంబం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా సంక్రాంతి పర్వదినాన మెగా కుటుంబమంతా ఒక్కచోట చేరి పండుగ జరుపుకొంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవితో పాటు అల్లు ఫ్యామిలీ కూడా కలిసి ఉన్న ఫొటోను రామ్ చరణ్ తేజ్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అదే విధంగా చిరంజీవి కుమార్తె శ్రీజ సైతం తన తండ్రి, అన్నయ్యతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సుస్మితతో పాటు నిహారికా ఇతర మెగా ఆడపడచులు ఉన్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.