మెగాస్టార్ వారసుడు నేడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. సుమారు 17 ఏళ్ల క్రితం 'చిరుత'గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'గా మారాడు. తన నటనతో 'రంగస్థలం'పై 'రచ్చ' చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'తుఫాన్' క్రియేట్ చేశాడు. అభిమానుల గుండెల్లో 'గోవిందుడు అందరివాడు' అయ్యాడు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ 'వినయ విధేయ రాముడు' అని అందరితో పిలిపించుకున్నాడు. 'ఎవడు' అయినా సరే తన దారికి అడ్డొస్తే తొక్కుకుంటూ పోతానంటూ 'ఆర్‌ఆర్‌ఆర్'తో గాండ్రించాడు. అలాంటి వాడు ఎవడో తెలుసా..? పాన్ ఇండియా 'మగధీరుడు' రామ్ చరణ్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1985 మార్చి 27న జన్మించిన చరణ్ నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలుగా వచ్చారు. కానీ చరణ్ చాలా ప్రత్యేకం. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వ్యక్తిత్వం కలిగిన హీరో. ఉపాసనతో పెళ్లికి ముందు రామ్ చరణ్ వేరు. పెళ్లి తరువాత రామ్ చరణ్ వేరు. టాలీవుడ్‌లో వేలు ఎత్తి చూపించుకోని విధమైన ప్రవర్తనను రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తున్న హీరో ఎవరైనా వున్నారా అంటే అది రామ్ చరణ్ నే.
మెగాస్టార్ తర్వాత చరణ్ పేరు తప్పక ఉంటుంది
మెగాస్టార్ చిరు తర్వాత డ్యాన్స్ బాగా చేసే టాలీవుడ్ హీరోలు ఎవరు..? అని ఎవరినైనా అడిగితే వారు చెప్పే జాబితాలో చరణ్ గ్యారెంటీగా ఉంటుంది. చిన్నప్పుడు డ్యాన్స్‌కు దూరంగా ఉండే చరణ్ ఇప్పుడు తన టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నాడు. అయితే, తన తండ్రి చిరంజీవి మంచి డ్యాన్సర్ కాబట్టి కుమారుడు 'అదుర్స్ అనిపించేలా చేస్తే బాగుణ్ను' అని అనుకునేవారు. చరణ్ డ్యాన్స్ చేస్తాడా, లేదా? అని అభిమానులు కూడా టెన్షన్ పడేవారు. తండ్రి తన నుంచి ఏం ఆశిస్తున్నారో గ్రహించిన చెర్రీ ఎవరి ట్రైనింగ్ అవసరంలేకుండా తనంతట తానే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన డ్యాన్స్‌కు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.
'చిరుత' అలా సెట్ అయింది కానీ..
చరణ్‌ను తన వారసుడిగా దింపే సమయం చిరంజీవికి వచ్చింది. అందుకోసం అల్లుఅరవింద్‌తో చర్చలు జరిపారు. ఒక స్టార్ డైరెక్టర్ ద్వారా చరణ్‌ను ఇండిస్ట్రీకి పరిచయం చేయాలని ఆలోచించారు. దాంతో అప్పటికే స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజమౌళిని సంప్రదిస్తే.. చరణ్ నటనపై నాకు అవగాహన లేదని, మొదటి సినిమాను ఒక మంచి దర్శకుడితో తెరకెక్కించమని ఆయన సలహా ఇచ్చాడు. కానీ రెండవ సినిమా ఖచ్చితంగా నేనే చేస్తాను అని రాజమౌళి చెప్పారట. దాంతో చిరంజీవి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ని పిలిపించి అసలు విషయం చెప్పడం. ఆపై వెంటనే పూరీ రెండు మూడు కథలను వినిపించగా చివరికి చిరుత స్టోరి ఓకే అయ్యింది.
భారీ అంచనాల మధ్య 'చిరుత' 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. మొదటి రోజే దాదాపు ఈ సినిమా రూ.5 కోట్ల షేర్‌ను సాధించి ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది. సౌత్‌లో ఒక డెబ్యూ హీరోకు ఆ రేంజ్ కలెక్షన్లు రావడం టాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమాతో తన నటనకుగాను చెర్రీ 'స్పెషల్ జ్యూరీ' విభాగంలో 'నంది' అందుకున్నాడు. కానీ కొందరు కావాలనే ఈ సినిమాలో చరణ్ లుక్స్‌పై విమర్శలు భారీగానే చేశారు. చరణ్‌కు నటన రాదని, హీరో ఫేస్ కాదని పలువురు క్రిటిక్స్ విమర్శించారు. కేవలం ఈ సినిమా పూరీ టేకింగ్, చిరంజీవి మేనియాతోనే హిట్టయిందని పలువురు అభిప్రాయపడ్డారు. అప్పుడు ఏమాత్రం చరణ్ కుంగిపోలేదు.. విమర్ళలను తీసుకున్నాడు. తనను తాను మార్చుకున్నాడు.
'మగధీర'తో సమాధానం ఇచ్చాడు
ఫస్ట్ మూవీ ఓకే.. మరి నెక్ట్స్ ఏంటి? అంటూ చెర్రీ భవిష్యత్తుపై ఇంకొందరు లెక్కలు వేస్తుంటే.. 'మగధీర'తో సమాధామిచ్చాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆ సినిమా సుమారు రూ.150 కోట్లు వసూళ్లు (గ్రాస్) చేసి, టాలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. రెండో చిత్రంతోనే అగ్ర కథానాయకుల జాబితాలో చేరిన చరణ్ మూడో ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అదే ‘ఆరెంజ్’.
'ధృవ'తో రూట్ మార్చుకున్నాడు
రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ.. ఇలా మళ్లీ కమర్షియల్ ధోరణిలో సాగుతున్న అతను ‘ధృవ’తో రూటు మార్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ’ చరణ్ మార్కెట్‌ను అమాంతం పెంచింది. ఆ తర్వాత వచ్చిన ‘రంగస్థలం’ ఆయన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో చరణ్ నటనకు విమర్శకుల సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 130కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. చరణ్ తన నటన, అభినయంతో ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ మళ్ళీ రప్పించాడు. దాని తర్వాత వినయ విధేయ రామ, ఆచార్యతో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడు చరణ్.
అవమానం జరిగిన చోటే జండా పాతాడు
బాలీవుడ్‌లో చరణ్ డెబ్యూగా ‘జాంజీర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో తుఫాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘొర పరాజయాన్ని చవిచూసింది. అంతే కాకుండా బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్‌ను తీవ్రంగా విమర్శించారు. బిగ్ బీ అమితాబ్ నటించిన జాంజీర్ పేరును చెడగొట్టాడని, చరణ్‌ది వుడెన్ ఫేస్ అని విమర్శించారు. అలా ఎన్నో విమర్శలు ఎదర్కొని నిలబడ్డాడు. ఎళ్లు గడిచాయి.. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. పక్కా ప్లాన్‌తో బాలీవుడ్‌కు తన రేంజ్ ఎంటో ఆర్‌ఆర్‌ఆర్‌తో చూపించాడు. బాలీవుడ్ ఏంటీ..? ఏకంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.. టాలీవుడ్ కీర్తిని ప్రపంచానికి చాటేలా చేశాడు.
చెర్రీ.. ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ బాక్సాఫీసు వద్ద రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని టాలీవుడ్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల ఫలితం ఎలా ఉన్నా నటన, డ్యాన్స్ విషయంలో చరణ్ అభిమానుల్ని ఎక్కడా నిరుత్సాహపరచలేదని చెప్పొచ్చు. ఇలాంటి స్పీడ్ డ్యాన్సర్‌కు మరో స్పీడ్ డ్యాన్సర్ (ఎన్టీఆర్) తోడైతే ఎలా ఉంటుందో ‘నాటు నాటు’తో ప్రపంచానికి చూపించారు. వారిద్దరి స్టెప్పులకు ‘ఆస్కార్’ అవార్డు వరించింది. ఇందులో రామ్ చరణ్ ఎంట్రీ సీన్‌కు బాలీవుడ్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ వచ్చాయి. ఎన్టీఆర్‌ను చరణ్ కొరడా దెబ్బలు కొట్టే సన్నివేశంలో ఆయన పలికించిన భావాలకు అక్కడి క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు. అలా అవమానం జరిగిన చోటే తన సత్తా ఎంటో రుచి చూపించాడు.
Comments
Please login to add a commentAdd a comment