సాక్షి, భీమవరం: సంక్రాంతి పేరు చెబితే గుర్తొచ్చేవి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలే. పండుగ మూడు రోజులు నిర్వహించే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. పందేల బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే పందెం పుంజుల సన్నద్ధతకు పెద్ద కసరత్తే మొదలవుతుంది.
కోడి పందేలకు ఉన్న క్రేజ్‌కు తగ్గట్టుగానే పుంజుల పెంపకంలో పందెంరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాలు వద్ద పుంజులను పెంచితే.. ఎక్కువ మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను ఎంచుకుని వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకే అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి వచ్చే ఔత్సాహికులు ఆన్‌లైన్‌లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందే అడ్వాన్స్‌లు చెల్లిస్తుంటారు. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపక కేంద్రాలు ఉన్నాయి.
అత్యంత గోప్యంగా..
కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతులకు చెందిన ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీటి పాత ఈకలు ఊడిపోయి కొత్త ఈకలు వస్తుంటాయి. అనంతరం వీటికి శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు శిక్షణ ప్రారంభిస్తారు. అందుకోసం ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తారు. పుంజులకిచ్చే ఆహారం, మందులు నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నదీ ఇతరులకు తెలియకుండా గోప్యత పాటిస్తారు. మకాంలోని ఐరన్ కేజ్‌లలో ఉండే పందెం కోళ్లను బయటకు తీసి ఆరుబయట కట్టడం మొదలుపెడతారు. అప్పటి నుంచే వీటి శిక్షణ మొదలవుతుంది.
చదవండి: ఆయ్.. ఇంకా పట్టా‘లెక్కలేదండి’
ప్రస్తుతం చాలా మకాంల వద్ద పుంజులను బయట కట్టడం ప్రారంభించారు. రోజు ఉదయాన్నే వేడి నీటిని పట్టిస్తారు. బరిలో చురుగ్గా కదిలేందుకు వీలుగా కాళ్లల్లో చురుకుదనానికి నెలరోజులు పాటు రోజు విడిచి రోజు సమీపంలోని చెరువులు, నీళ్ల తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. తర్వాత ‘వీ’ ఆకారంలో నెట్‌లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) కొట్టిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ వాకింగ్ చేయిస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తారు. పండుగలు దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు.
5 వేలకు పైగా కోళ్లు
కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఇలా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. సంక్రాంతి పందేల కోసం 5వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిద్వారా రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.
మేత దర్జానే వేరు
శిక్షణలో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు పందెం పుంజులకు ఈ మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. కోడి సైజును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మేక మాంసం, 5 వరకు బాదం గింజలు, రెండు వెల్లుల్లి రేకలు, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డును ముక్కలు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం చోళ్లు, గంట్లు, రాగులు మొదలైన వాటిని ఆహారంగా ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment