Makar Sankranti Celebrations 2022: Cockfight preparations in full swing, Details Inside - Sakshi
Sakshi News home page

Makar Sankranti 2022: కోడి పందేలకు రె'ఢీ'

Jan 14 2022 5:16 AM | Updated on Jan 14 2022 7:38 PM

Cockfight preparations in full swing For Sankranti Festival - Sakshi

Makar Sankranti Celebrations 2022: జిల్లాలో కోడిపందేలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. భారీగా పోలీసుల ఆంక్షలు, దాడులు, వరుస కేసులు నమోదు చేస్తున్నా పందేలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు (శుక్ర, శని, ఆదివారాలు) లక్షలాది రూపాయలు పందేలు నిర్వహించేలా బరులు సన్నద్ధం చేస్తున్నారు. ఇదంతా ఏటా సాగే తంతు అయినా పోలీసులు కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పందేలు నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్న వ్యవహారం కాబట్టి పందేలు కూడా అదేస్థాయిలో నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రహస్యంగా ఏర్పాట్లు
జిల్లాలో కోడిపందేలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయ క్రీడలతో పాటు కోడిపందేలు దాదాపు వందేళ్లుగా జిల్లాలో కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఉన్నా పందేల జోరు స్థాయి మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది కూడా జిల్లాలోని భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ఉంగుటూరు, దెందులూరులో పందేల నిర్వహణకు పదుల సంఖ్యలో బరులు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి వారం రోజుల ముందు నుంచే కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో పోలీసులు సీరియస్‌గా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రహస్యంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 

జిల్లావ్యాప్తంగా బరులు
జిల్లా పోలీస్‌ యంత్రాంగం భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు రూరల్‌ ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టి కోడిపందేలు జరిగితే సంబంధిత ఎస్సై, సీఐలపై సస్పెండ్‌ వేటు ఉంటుందని స్పష్టంచేసింది. అయినా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా నరసాపురం ప్రాంతంలో ముత్యాలపల్లి, కోత్తాట, పేరుపాలెం, కేపీపాలెం, నరసాపురం పట్టణంలోని లక్ష్మణేశ్వరం, పితానిమెరిక, పీచుపాలెం, పాలకొల్లులో కలగంపూడి, మొగల్తూరులో బరులు సిద్ధమయ్యాయి. ఇక్కడ రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు పందేలు జరుగనున్నాయి.

భీమవరం ప్రాంతంలో ఐ.భీమవరం, ఆకివీడు, కాళ్ల మండలంలోని జువ్వలపాలెం, సీసలి, కాళ్ల, వెంపలో భారీగా కోట్లల్లో పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో శ్రీనివాసపురం, లక్కవరం, దేవులపల్లిలో భారీగా పందేలు  నిర్వహించనున్నారు. పేరంపేట, తాడువాయి, పంగిడిగూడెంలో బరులు సిద్ధమయ్యాయి. ఉంగుటూరు పరిధిలో నారాయణపురం, గొల్లగూడెం, బాదంపూడి, రాచూరు, నల్లమిల్లిలో బరులు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దెందులూరు నియోజకవర్గంలో శ్రీరామవరం, పెరుగ్గూడెం, పోతునూరు, కొవ్వలి, గొల్లమ్మగూడెం, గంగన్నగూడెం, జోగన్నపాలెంలో పందేల నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వీటితో పాటు జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లో బరులు ముస్తాబవుతున్నాయి.

పోలీసులకు సవాలు
కోడిపందేల కట్టడి అంశం ఏటా పోలీసులకు సవాలుగా మారుతుంది. పండుగకు వారం, పది రోజుల నుంచి బైండోవర్‌ కేసులు, కోడికత్తులు స్వాధీనం చేసుకుని సాంప్రదాయ క్రీడలు నిర్వహించాలని పిలుపునిస్తూ పోలీసులు శాఖాపరంగా హడావుడి చేసినా చివరి మూడు రోజులు మాత్రం స్పందన నామమాత్రంగానే ఉంటుంది. దీంతో కొన్ని గంటల పాటైనా భారీగా కోడిపందేలు సాగుతుంటాయి. కోడిపందేలతో పాటు పేకాట, గుండాటలు కూడా లక్షల్లో కొనసాగుతుంటాయి. జిల్లాలో పోలీసులు ఇప్పటివరకు 3,783 బైండోవర్‌ కేసులు నమోదు చేసి 4,600 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement