Cock fight races
-
సంక్రాంతి పందెం పుంజులకు స్పెషల్ ట్రైనింగ్!
సాక్షి, భీమవరం: సంక్రాంతి పేరు చెబితే గుర్తొచ్చేవి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలే. పండుగ మూడు రోజులు నిర్వహించే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. పందేల బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే పందెం పుంజుల సన్నద్ధతకు పెద్ద కసరత్తే మొదలవుతుంది.కోడి పందేలకు ఉన్న క్రేజ్‌కు తగ్గట్టుగానే పుంజుల పెంపకంలో పందెంరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాలు వద్ద పుంజులను పెంచితే.. ఎక్కువ మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను ఎంచుకుని వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకే అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందే అడ్వాన్స్‌లు చెల్లిస్తుంటారు. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపక కేంద్రాలు ఉన్నాయి.అత్యంత గోప్యంగా..కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతులకు చెందిన ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీటి పాత ఈకలు ఊడిపోయి కొత్త ఈకలు వస్తుంటాయి. అనంతరం వీటికి శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు శిక్షణ ప్రారంభిస్తారు. అందుకోసం ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తారు. పుంజులకిచ్చే ఆహారం, మందులు నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నదీ ఇతరులకు తెలియకుండా గోప్యత పాటిస్తారు. మకాంలోని ఐరన్ కేజ్‌లలో ఉండే పందెం కోళ్లను బయటకు తీసి ఆరుబయట కట్టడం మొదలుపెడతారు. అప్పటి నుంచే వీటి శిక్షణ మొదలవుతుంది.చదవండి: ఆయ్.. ఇంకా పట్టా‘లెక్కలేదండి’ప్రస్తుతం చాలా మకాంల వద్ద పుంజులను బయట కట్టడం ప్రారంభించారు. రోజు ఉదయాన్నే వేడి నీటిని పట్టిస్తారు. బరిలో చురుగ్గా కదిలేందుకు వీలుగా కాళ్లల్లో చురుకుదనానికి నెలరోజులు పాటు రోజు విడిచి రోజు సమీపంలోని చెరువులు, నీళ్ల తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. తర్వాత ‘వీ’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) కొట్టిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ వాకింగ్ చేయిస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తారు. పండుగలు దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు.5 వేలకు పైగా కోళ్లుకోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఇలా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. సంక్రాంతి పందేల కోసం 5వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిద్వారా రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.మేత దర్జానే వేరుశిక్షణలో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు పందెం పుంజులకు ఈ మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. కోడి సైజును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మేక మాంసం, 5 వరకు బాదం గింజలు, రెండు వెల్లుల్లి రేకలు, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డును ముక్కలు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం చోళ్లు, గంట్లు, రాగులు మొదలైన వాటిని ఆహారంగా ఇస్తారు. -
పందెం.. నీదా నాదా సై..
రూ.కోట్లలో సాగిన కోడిపందేలు తొలుత కత్తులు లేకుండా.. తర్వాత కత్తులు కట్టి.. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో రివాల్వర్ కాల్పుల కలకలం గోదావరి జిల్లాల్లో రూ.150 కోట్ల బెట్టింగ్ సాక్షి నెట్వర్క్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోదావరి జిల్లాలతో పాటు పలు చోట్ల శుక్రవారం కోడి పందేలు భారీ ఎత్తున సాగాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు రూ.150 కోట్ల వరకు బెట్టింగ్‌లు జరిగాయని అంచనా. టీడీపీ ఎమ్మెల్యేలు పందేలు ప్రారంభించిన ప్రాంతానికి వెళ్లేందుకు పోలీసులు సాహసించ లేదు. కోడిపందేలతో పాటు పొట్టేళ్ల పందేలు, పేకాట, గుండాటలు నిర్వహించారు. అనధికార మద్యం బెల్ట్‌షాపుల విక్రయాలు జోరందుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం కోడిపందేల బరి వద్ద ఖమ్మం జిల్లాకు చెందిన దయాకర్ (టీడీపీ నేతగా భావిస్తున్నారు) గాలిలోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్‌లకు నగదు ఇబ్బంది లేకుండా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 40 బరులు ఏర్పాటు చేసి, పందేలు నిర్వహించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తదితర ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి టీడీపీ నేతల సమక్షంలో కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురంలో, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడిపందేలు జరిగాయి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రాతినిథ్యం వహిస్తున్న జగ్గంపేట నియోజకవర్గంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం స్వగ్రామం కిర్లంపూడిలో కోడిపందేలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అదే నియోజకవర్గం గోకవరం మండలం గంగంపాలెంలో పందెం కోళ్లను దాచారంటూ ఎస్ఐ ఒక ఇంటిలోకి చొరబడి గర్భిణిపై దురుసుగా ప్రవర్తించారంటూ గ్రామస్తులు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తొలుత కత్తులు లేకుండా... కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకుండా పందేలు నిర్వహించుకోవచ్చన్న కోర్టు ఆదేశాలను పందెంరాయుళ్లు చక్కగా ఉపయోగించుకున్నారు. పందేల ఆరంభానికి ముందు కత్తులు లేకుండా కోళ్లను మాత్రమే బరిలోకి వదిలి, సాధారణ పందేలు నిర్వహించారు. తర్వాత కోళ్లకు కత్తులు కట్టి పందేల్లో నెత్తురు చిందించారు. మురమళ్లలో కోడిపందేలకు టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కత్తులు లేకుండా శ్రీకారం చుట్టి, అనంతరం కత్తులు కట్టి పందేలు యథేచ్ఛగా నిర్వహించారు. ఒక్కో పందెం రూ.10 లక్షలకు తక్కువ కాకుండా సాగింది. పందేలు వీక్షించేందుకు వచ్చిన వారిలో కొందరు ఒక్కో పందేనికి రూ.20 లక్షలు పైబడి కూడా పందేలు వేశారు. రూ.38 లక్షలకు హక్కులు దక్కించుకున్న గుండాట నిర్వాహకులు గుండాట, సూట్ బాల్ ఆటల కోసం 15 బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ రెండు ఆటలతో సుమారు రూ.50 లక్షల లావాదేవీలు జరిగాయి. మురమళ్ల కాకుండా మిగిలినచోట్ల దాదాపు రూ.4 కోట్ల వరకూ పందేలు సాగాయి. ఆన్లైన్ ద్వారా.. పెదవేగి మండలం కొప్పాకలో ప్రభుత్వ విప్ చింతమనేని ఆధ్వర్యంలో కోడిపందేలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందాలు సాగాయి. తెలంగాణ నుంచి కోడి పందేల రాయుళ్లు భారీగా తరలి వచ్చారు. రూ.లక్షల్లో పందాలు జరిగాయి. పందేల ముసుగులో కోతాట, గుండాట, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. కాగా, పందెం కోళ్ల అమ్మకాలు ఆన్లైన్ వేదికగా సాగాయి. ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసుకున్న కోడి పుంజులను నేరుగా పందేల బరి వద్దకు తీసుకొచ్చి లావాదేవీలు నిర్వహించారు. పందెం కోడి ధర రూ.3 వేల నుంచి రూ.60 వేల వరకు సాగింది. నిలిపివేయాలంటూ సుప్రీంకు... కోడి పందేలను నిలిపివేయాలంటూ జాతీయ జంతు సంరక్షణ విభాగం శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోడి పందేలను నిషేధించినప్పటికీ పలుచోట్ల కోడిపందేలు నిర్వహిస్తున్నారని, వాటిని నిషేధించాలని సుప్రీం కోర్టును కోరారు. ఇప్పటికిప్పుడు కోడిపందేలను నిలపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే కత్తులు కట్టకుండా ఢింకీ కోడి పందేలు వేసుకుంటామంటూ కనుమూరు రఘురామకృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఢీ అంటే ఢీ.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లులో శుక్రవారం పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎంపీపీ దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసాద్ పందేలను ప్రారంభించారు. హైదరాబాద్, విజయనగరం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, వరంగల్ ప్రాంతాల నుంచి పొట్టేళ్లను పందేలకు తీసుకు వచ్చారు. కాశం జిల్లా మార్టేరులో కోడి పందేల చాటున పొట్టేలు పందేలు కూడా నిర్వహించారు. ఎంపీల సాక్షిగా పందేల జోరు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జరుగుతున్న కోడిపందేలకు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) ఆహ్వానం మేరకు అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి హాజరయ్యారు. కలిదిండి మండలం తాడినాడలో శుక్రవారం వారు కోడి పుంజులను చేత్తో పట్టుకుని బరిలోకి దించుతూ పందేలను ప్రోత్సహించారు.