పండగెళ్లింది..పైకం పోయింది
కోడి పందాలు సంప్రదాయమని చెప్పిన రాజకీయ నాయకుల సాక్షిగా వేలాది మంది జీవితాలు తారుమారయ్యాయి. గడచిన మూడు రోజుల్లో నిర్వహించిన పందాల్లో సుమారు రూ.100 కోట్లు చేతులు మారాయి. పేకాట, గుండాట, కోతాట, లోన-బయట వంటి జూద క్రీడలతో దిగువ, మధ్య తరగతి వర్గాలతోపాటు సంపన్నులూ కోలుకోలేని దెబ్బతిన్నారు. విశాఖలో స్థిరపడిన డెల్టా ప్రాంత పారిశ్రామికవేత్త ఒకరు గురువారం భీమవరంలో పేకాట ఆడి అక్షరాలా రూ.42 కోట్లు పొగొట్టుకున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :పోలీసుల ఆంక్షలను దాటి భోగి రోజు మధ్యాహ్నం మొదలైన కోడిపందాలు, పేకాట సంక్రాంతి రోజున తారస్థాయికి చేరాయి. కనుమ రోజైన శుక్రవారం రాత్రి వరకు యథేచ్ఛగా సాగాయి. ఉన్నత వర్గాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీ సులు పక్కకు తప్పుకోవడంతో జిల్లావ్యాప్తంగా కోడిపందాలు, అనేక రూపాల్లో జూదాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా పెద్దఎత్తున సాగాయి. బరులకు ప్రజాప్రతినిధులే రక్షణ కవచంలా నిలబడటంతో పందాల రాయుళ్లు రెచ్చిపోయారు. క్రికెట్ స్టేడియాలను మించి పందెం బరులు ఏర్పాటు చేశారు. అక్కడే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు వెలిసి జాతరను తలపించాయి. కోడిపందాలు, పేకాట ఆడిన ప్రతివారు రూ.లక్షలు పొగొట్టుకుంటే గుండాట, కోతాటల్లో రూ.వేలకు వేలు చేతులు మారాయి.
‘వెంప’ర్లాడిన వీక్షకులు
డెల్టాలోని వెంప, సీసలి, ప్రకృతి ఆశ్రమం, ఐ.భీమవరం, మహదేవపట్నం, పూలపల్లి, కొణితివాడ తదితర ప్రాంతాల్లోని బరుల్లో పందెం కోళ్లు దుమ్ములేపాయి. వెంపలో పందాలను చూసేందుకు ప్రవాసాంధ్రులు కూడా తరలివచ్చారు. ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు పోటెత్తడంతో అక్కడి బరులు భారీ ఉత్సవాలను తలపిం చాయి. ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, బుల్లితెర నటీనటులు ఇక్కడి పందాలను తిలకించారు. కాళ్ల మండలం కోనాలపల్లి గ్రామంలో పందాలను చూసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెలంగాణ రాష్ట్రంలోని కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఎం.కృష్ణారావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకరరెడ్డి, సినీ ఆర్టిస్ట్ శ్రవణ్ తదితరులు తరలివచ్చారు. ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోనూ భారీ ఎత్తున కోడిపందాలు జరిగాయి. శింగవరంలో పందాలకు సినీ నటుడు శివాజీరాజా హాజరయ్యారు.
తణుకులో ప్రతిచోటా
తణుకు నియోజకవర్గంలో ఈసారి పందాలు హోరెత్తాయి. గతంలో కొన్ని మారుమూల ప్రాంతాలకే పందాలు పరిమితం కాగా, ఈ సారి పట్టణంలోను, ప్రతి గ్రామంలోనూ బరులు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో రెండేసి బరులు వేసి కోడి పందాలు నిర్వహించారు. మండపాకలో పందాలను సినీ ప్రముఖులు కోటి, ఎ.కోదండరామిరెడ్డి, ఎంఎస్ రాజు తిలకించారు. ఈ గ్రామంలో రెండు పార్టీల వారు ఏర్పాటు చేసిన బరుల విషయంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకుని రెండు బరులను తొలగించారు.
ఫ్లడ్ లైట్ల కాంతిలో
ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు, భీమడోలు మండలాల్లోని 20 గ్రామాల్లో పందాలు భారీఎత్తున నిర్వహించారు. వేకువజాము వరకు ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో పోటీలు జరిగాయి. నరసాపురం నియోజకవర్గ పరిధిలోని సీతారామపురం, పితానిమెరక, మొగల్తూరు, రామన్నపాలెం, కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాల్లో చిన్నపాటి పందాలు జరిగాయి. పాలకొల్లు నియోజకవర్గంలోని పూలపల్లి, యలమంచిలి, ఏనుగువానిలంకలో భారీ పందాలు నిర్వహించగా, వెంకటాపురం, లంకలకోడేరు, దగ్గులూరు, తిల్లపూడి, చింతపర్రు, వడ్లవానిపాలెం గ్రామాల్లో ఒక మోస్తరు పందాలు జరిగాయి. తాడేపల్లిగూడెం పట్టణంలో మూడు బరులు, మండలంలోని గ్రామాల్లో తొమ్మిది బరులు, పెంటపాడు మండలంలోని నాలుగు బరుల్లో మూడు రోజులపాటు విచ్చలవిడిగా పందాలు సాగాయి.
చేపల చెరువులను ఒడ్డబోయి..
ఏలూరు సమీపంలోని కొల్లేరు గ్రామమైన గుడివాకలంకలో గురువారం రాత్రి ఇద్దరు జూదగాళ్లు చేపల చెరువులను పందెం కట్టేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు పరుగు పరుగున బరికి వచ్చి బతిమాలడంతో పెద్దమనుషులు జోక్యం చేసుకుని ఇద్దరినీ వారించారు. ఆచంట నియోజవ ర్గ పరిధిలోని వల్లూరు, పెనుగొండ, దొంగరావి పాలెం, ములపర్రు, వడలి, పెళ్లికూతురమ్మచెర్వు , మార్టేరు, ఆలమూరు, జుత్తిగ గ్రామాల్లో పందాలు జోరుగా సాగాయి.
చింతలపూడికి తెలంగాణ నుంచి
చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని శెట్టివారిగూడెం, వెంకటాద్రిగూడెం, రాఘవాపురం, సీతానగరం తదితర గ్రావూల్లో కోడి పందాలను యుథేచ్ఛగా నిర్వహించారు. వీటిని చూసేందుకు కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాలతోపాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి కూడా పందెం రాయుుళ్లు తరలివచ్చి బెట్టింగ్‌లు వేశారు. బుట్టాయగూడెం, దుద్దుకూరు, రెడ్డిగణపవరం, మర్రిగూడెం, కొయ్యలగూడెం, యర్రంపేట, రాజవరం, కన్నాపురం, పట్టిసీమ, పోలవరం, గూటాలలో పెద్దపందాలు జరిగాయి. జిల్లామొత్తం మీద చిన్నాపెద్దా అన్ని బరులు, పేకాట శిబిరాలు, గుండాటల్లో దాదాపు రూ.100 కోట్లపైనే సొమ్ములు చేతులు మారి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
నేడూ అనుమతివ్వాలని..
పండగ మూడురోజుల పాటు పందాలకు అనధికారిక అనుమతులు తీసుకురావడంలో విజయం సాధించిన టీడీపీ నేతలు ముక్కనుమ రోజైన శనివారం కూడా పోలీసులు చూసీచూటనట్టు వ్యవహరించాలని కోరుతున్నారు. భోగి రోజు ఎటూ మధ్యాహ్నం వరకూ పందాలు జరగలేదు. ఈ దృష్ట్యా శనివారం వరకు ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలని పలువురు ఎమ్మెల్యేలు ఓ పోలీస్ అధికారికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇంతవరకు సానుకూల స్పందన రాకున్నా.. శనివారం ఉదయం నాటికి గ్రీన్‌సిగ్నల్ వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. శనివారం అనుమతిస్తే సెలవు రోజైన ఆదివారం కూడా ఎవరూ పట్టించుకోరని, దీంతో పండగ ముందు అడ్డుకున్నందుకు ప్రతిఫలంగా వరుసగా ఐదు రోజులు ఆడినట్టవుతుందని టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. మరి ఈ పొడిగింపుపై పోలీసులు ఏం నిర్ణయం తీసుకుంటారనేది శనివారం ఉదయం తేలనుంది.
ఇక ఖాకీ ప్రతాపం
ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పని పరిస్థితుల్లో పక్కకు తప్పుకున్న పోలీసులు ఇప్పుడు పందాల రాయుళ్లపై కేసుల నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. టీవీలు, పత్రికల్లో వచ్చిన వార్తలు, ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా కేసులు పెట్టాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా, ఇప్పటికే కోడిపందాల ముసుగులో ఎవరెవరు ఎక్కడెక్కడ అక్రమాలకు తెరలేపారనే వివరాలను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.