ప్రత్యర్థి కోళ్లను ఢీ కొట్టేందుకు సిద్ధం నగరంలోనూ జోరుగా అమ్మకాలు
ఇప్పటికే కొనుగోలు చేసిన ఔత్సాహికులు
పందెం కోళ్లకు ప్రత్యేక ఆహారం, శిక్షణ
రంగు, జాతిని బట్టి పలుకుతున్న ధరలు
నెలకు ఐదు నుంచి ఆరు వేల వరకూ ఖర్చు
సంక్రాంతి పండుగలో డూడూ బసవన్నలు, రంగవల్లులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటలు ఎంత ప్రాధాన్యత కలిగినవో.. కోడి పందేలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.. గట్టిగా చెప్పాలంటే.. సంక్రాంతి సందడిలో కోడిపందేలే కీలంకంగా మారాయి కూడా.. ఆంధ్రలో సంక్రాంతికి కోడిపందేలకు మహిళలు సైతం వెళ్లి పందేలు కాస్తారంటే ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి ఆంధ్రా సంక్రాంతి కోడి పందేలకు నగరం నుంచి పందెం రాయుళ్లతో పాటు కోళ్లు కూడా వెళుతున్నాయి..
అంతే కాదు పందేల్లో ప్రత్యర్థి కోళ్లను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సారి పందేల బరిలోకి దిగేందుకు పాతబస్తీలోని కోళ్లు కాలుదువ్వుతున్నాయి. పాతబస్తీలో పందెపు కోళ్ల పెంపకంతోపాటు వాటికి బరిలో పడే విధంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. దీంతో ఇక్కడ పెంచుతున్న కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి నేపథ్యంలో దీనిపైనే ప్రత్యేక కథనం..
– సాక్షి, సిటీబ్యూరో
సంక్రాంతి కోడి పందేలకు ఇప్పటికే సర్వం సిద్ధమవుతోంది. బరిలో నిలిచే కోళ్లను ఇప్పటికే పందెంరాయుళ్లు జల్లెడపట్టేశారు. మరికొందరు ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఒక్కో కోడి ధర పదివేల నుంచి లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. జాతి, రంగును బట్టి కూడా ధరలను నిర్ణయిస్తారు. బరిలో దిగితే చావో రేవో తేల్చుకునేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. కొన్ని రకాల జాతి పుంజులైతే రూ.70 వేల నుంచి లక్ష వరకూ పలుకుతాయి.. అత్యంత ఖరీదుగా ఉండేవి సీతువ జాతి కోడి పుంజులు. ఆ తరువాతి స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకిపుంజు, పెట్టమారు రకాలున్నాయి.
మెనూ చాలా ముఖ్యం..
అట్లపెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్ చేస్తారు. చికెన్, ఎండు చేప ముక్కలు ధాన్యంలో కలిపి ఇస్తారు. ఇవేకాకుండా జీడి పప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, మేకపాలు, వీటితోపాటు బలవర్ధకమైన పోషకాలు ఉండే ఆహారం తినిపిస్తారు. గంట్లు, చోళ్ళు, బియ్యం, రాగులు మినప, శనగపప్పు, గోధుమ మిశ్రమాన్ని రోజూ తినిపిస్తారు. దీంతో పాటు మధ్యాహ్నం మటన్ కీమా, సాయంత్రం స్నాక్స్‌గా జొన్నలు, కోడిగుడ్లు పెడతారు. ప్రతి మూడు గంటలకూ ఓ సారి జీడిపప్పు, బాదం పిస్తా మిశ్రమాన్ని వడ్డిస్తారు. పుంజులకు బలమైన ఆహారం ఇస్తూనే కఠినమైన వ్యాయామం శిక్షణ ఇస్తారు.
ఎంపికే కీలకం...
కోడిపుంజు ఎంపిక నుంచి దానికి ఇచ్చే ఆహారం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కోడిపందెం కోసం అన్ని రకాల జాతులూ పనికిరావు. ప్రత్యేకంగా సూచించిన వాటినే కోడిపందేలకు ఉపయోగిస్తారు. వీటిలో డేగా, నల్లకాకి, తెల్లపర్ల, నెమలి కాకి, కాకిడేగ, కత్తిరాయి, జుమర్, నూరీ, కగర్, డుమర్, యాకూద్, కాకిడేగ, అబ్రాస్, పచ్చ కాకి, సీతువా, అసీల్ ప్రధానమైనవి. సాధారణ కోడిపుంజుల కంటే పందెంకోళ్లు భిన్నంగా ఉంటాయి. 24 గంటలు వాటిపై ప్రత్యేక నిఘా పెడతారు.
పోటీకి ప్రత్యేక శిక్షణ..
ప్రత్యర్థి దెబ్బలు తట్టుకుని సత్తా చాటేలా కోడి పుంజులకు తర్ఫీదు ఇస్తున్నారు. కోడి బలిష్టంగా తయారు కావడానికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. పిల్లగా ఉన్నప్పటి నుంచే పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రోజువారీ మెనూ, కసరత్తు, మాసాజ్‌తో వాటిని కుస్తీకి సిద్ధం చేస్తారు. నాలుగు నెలల శిక్షణా కాలాన్ని విభజించి పోటీకి తీర్చిదిద్దుతారు. ఉదయాన్నే వాటికి మౌత్ వాష్ చేయిస్తారు. ట్రైనర్ నోటిలో నీళ్లు పోసుకుని కోళ్ల ముఖంపై స్ప్రే చేస్తాడు. ఈ ప్రక్రియను కల్లె కొట్టడం అంటారు. పుంజు కండరాలు బిగుతుగా ఉండేందుకు వాకింగ్ చేయిస్తారు. వేడి నీళ్లు, స్పెషల్ షాంపూతో కోడికి స్నానం చేయిస్తారు. రెండు గంటల సమయం తర్వాత మళ్లీ శిక్షణ మొదలవుతుంది. మరో పుంజును బరిలో దించడం ద్వారా పోటీకి రెచ్చగొట్టేలా ట్రిక్స్ ఉపయోగిస్తారు. తద్వారా రెండు పుంజులూ పోటాపోటీగా పోరాడేలా చేస్తారు. ఈ పోటీ తర్వాత పుంజులకు మసాజ్ సెషన్ ఉంటుంది. అంతేకాదు.. తిన్నది ఒంటబట్టేవిధంగా కసరత్తులు ఉంటాయి. చెరువులో ఈత కొట్టిస్తారు. పందెం కోడి నిర్వహణకు నెలకు ఐదు నుంచి ఆరు వేల వరకూ ఖర్చు అవుతుంది
భారీ డిమాండ్ ఉంది..
గత కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రాంతానికి మా కోళ్లు పెందేలకు తీసుకెళుతున్నారు. దీంతో భారీ డిమాండ్ ఏర్పడింది. అప్పటి నుంచి మేము పందెం కోళ్లను పెంచుతున్నాం.. వాటికి ప్రత్యేక ఆహారంతో పాటు, శిక్షణ కూడా ఇస్తాం. కోడి బ్రీడ్, జీవనశైలిని బట్టి వాటి ఆహారం, శిక్షణ ఉంటుంది. ఇప్పటికే పలువురు మా కోళ్లను కొనుగోలు చేశారు. ఆల్ బొగ్దాది అండ్ స్కోర్ ఆసీల్ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ నిర్వహిస్తున్నాము. దీని ద్వారా కోళ్లు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. – హబీబ్ జైన్, పందెం కోళ్ల ఫామ్ యజమాని .
Comments
Please login to add a commentAdd a comment