రేపటి నుంచి ధనుర్మాసం
పెద్ద పండుగకు మోగనున్న నెలగంట
హరిదాసులు, గంగిరెడ్లు, కొమ్మదాసులు, జంగమ దేవరల రాక
నెల రోజులపాటు సందడి చేయనున్న సంప్రదాయ కళలు
హరిలో రంగ హరి.. అంటూ హరిదాసులు.. అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు.. అంటూ డూడూబసవన్నలు.. అంబ పలుకు.. జగదంబ పలుకు అంటూ.. జంగమదేవరలు.. ఓ లప్పో.. లచి్చమప్పో.. అంటూ.. కొమ్మదాసుల విన్యాసాలతో పెద్ద పండుగను నెల రోజుల ముందే వెంటేసుకొస్తారు.. సంక్రాంతికి అందరి ఇళ్లకు బంధువులు పండుగకు మూడు, నాలుగు రోజుల ముందు వస్తే.. ‘ఊరికి బంధువులు’ మాత్రం నెలగంట మోగిన వెంటనే ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతూ సందడి చేస్తారు.. సంప్రదాయ కళలకు పట్టం గడుతూ.. తృణమో పణమో ఆనందంగా తీసుకుని అందరూ చల్లగా ఉండాలని దీవిస్తూ ధనుర్మాసంలో ఊరూవాడా తిరుగుతుంటారు. సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది.
సాక్షి, భీమవరం: సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. దీనిని ధనుస్సంక్రమణమని, నెల పట్టడం అని పల్లె నానుడి. ఈనెల 16న (సోమవారం) నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. జనవరిలో మకర సంక్రమణం వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెలరోజుల పాటు ఉదయాన్నే హరినామ సంకీర్తలు పాడుతూ హరిదాసులు, డూడూ బసవన్నలతో విన్యాసాలు చేయిస్తూ గంగిరెడ్ల వారు, పప్పుదాకలో పడిపోతున్నానంటూ కొమ్మదాసులు, అంబ పలుకు జగదంబ పలుకంటూ బుడబుక్కల వాళ్లు, శంఖం ఊదుతూ జంగం దేవరలు, ఏడాదికో మారంటూ పిట్టల దొరలు, భట్రాజులు, సోదెమ్మలు, పగటి వేషగాళ్లు, కనికట్టు చేసేవాళ్లు, గారడీ చేసేవాళ్లు వరుసగా క్యూ కడుతుంటారు.
ఆయా జాతుల వారు ఊళ్లను పంచుకుని తమతమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తమ కళలను ప్రదర్శించి వినోదాన్ని పంచి యజమానులు ఇచ్చిన మొత్తాన్ని తీసుకువెళుతుంటారు. పల్లె జీవనానికి ఈ సంప్రదాయ కళలకు ఎంతో అనుబంధం ఉందని పెద్దలు చెబుతుంటారు. మారుతున్న కాలంలో ఆదరణ తగ్గి ఉపాధి కోసం జిల్లాలోని చాలా మంది కళాకారులు వేరే వృత్తుల్లో స్థిరపడగా, కొందరు మాత్రం తమ తాతల కాలం నుంచి వస్తున్న విద్యను ప్రదర్శిస్తూ సంప్రదాయ కళలను కాపాడుకుంటూ వస్తున్నారు. సోమవారం నుంచి ఊరూరు తిరిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
కొమ్మదాసు
ఓ లప్పో.. లచి్చమప్పో.. అక్కో రాఖీ పండక్కొచి్చనప్పుడు నీకు షాపింగ్‌మాల్‌లోంచి కాస్ట్‌లీ చీరతెత్తానప్పా.. మాయగారు ఆనందంగా ఉండాల. వారానికి 3 సినిమాలకు వెలతుండాల.. నీ కుటుంబమంతా బాగా ఉండాల అంటూ కొమ్మదాసులు మాటల గారడీ చేస్తూ ఆకట్టుకుంటారు. పూర్వం చెట్లు ఎక్కి హడావుడి చేసేవారు. ఇప్పుడు భుజాన కొమ్మేసుకుని తిరుగుతున్నారు.
గంగిరెడ్లు..అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ యజమానికి చెప్పే ఆదేశాలకు తలాడిస్తూ గంగిరెడ్లు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. గంగిరెద్దులు బసవన్నల రూపంలో ఇంటి ముందుకొస్తేనే పండుగ మొదలవుతుంది. గంగిరెడ్ల వారు పీపీలు ఊదుతూ పాటలు పాడుతుంటే గంగిరెద్దుల గజ్జల చప్పుడు మధ్య తమ ఇంటికి లక్ష్మీ కళ వస్తుందని నమ్మకం.
హరిదాసులు : శ్రీమద్రమా రమణ గోవిందో హరి.. అంటూ తెలవారకుండానే నుదుటన తిరునామం, నెత్తిన అక్షయపాత్ర, చేతిలో చిడతలు, భుజాన తంబూర, పట్టుధోవతి పంచెకట్టు, మెడలో మాల, కాళ్లకు గజ్జలతో హరిదాసులు వీదివీధి తిరుగుతూ హరినామ సంకీర్తనలు ఆలపించడం అనాదిగా వస్తున్న ఆచారం. వారు నడయాడిన గ్రామం పాడిç³ంటలతో సుభిక్షంగా ఉంటుందని, హరిదాసు అక్షయపాత్రలో పోసే కాసి బియ్యం తమ ఇంటిని సిరిసంపదలతో నింపుతాయని పల్లె ప్రజలు భావిస్తారు. పండుగ నెల పట్టారంటే ప్రతిరోజూ ఉదయాన్నే ప్లేటులో బియ్యంతో మహిళలు హరిదాసు రాకకోసం పల్లెల్లో ఇంటి ముంగిట వేచి ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment