మత్స్యరంగం కొత్త పుంతలు | Matsya University in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మత్స్యరంగం కొత్త పుంతలు

Published Mon, Jan 22 2024 4:31 AM | Last Updated on Mon, Jan 22 2024 3:45 PM

Matsya University in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఆక్వా హబ్‌ ఆఫ్‌ ఇండియా’గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మూడోదిగా ఏర్పాటైన ఈ  వర్సిటీకి ఓ వైపు నూతన భవన సముదాయం  నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే.. మరోవైపు దీనికి అనుబంధంగా కొత్త మత్స్య కళాశాల కొలువు దీరింది. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు..నిష్ణాతులైన అధ్యాపక బృందంతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 

1200కు మించి పట్టభద్రుల్లేని పరిస్థితి 
రాష్ట్రంలో 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం..1.10 లక్షల హెక్టార్ల మంచినీటి సాగు..80 వేల హెక్టార్లలో ఉప్పునీటి సాగు విస్తీర్ణం ఉంది.  1.75 లక్షల మంది ఆక్వా రైతులు..8.50 లక్షల మంది మత్స్యకారులున్నారు. ఈ రంగంపై ఆధారపడి 16.50 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 51.06 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే నం.1 స్థానంలో ఉంది.

జాతీయ స్థాయిలో చేపల ఉత్పత్తిలో 25.60 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 78 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి 11,901 డిప్లమో హోల్డర్లు, 6118 బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ (బీఎఫ్‌ఎస్సీ), 2541 మాస్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ (ఎంఎఫ్‌ఎస్సీ) చదివిన వారు అవసరం. 2030 నాటికి కనీసం 50 వేల మందికి పైగా అవసరమవుతారని అంచనా. కానీ ప్రస్తుతం కేవలం 450 మంది డిప్లమో, 700 మంది బీఎఫ్‌ఎస్సీ, 50–60 మంది ఎంఎఫ్‌ఎస్సీ పూర్తిచేసిన వారు మాత్రమే అందుబాటులో ఉన్నారు.  

ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు 
ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2005 వరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, ఆ తర్వాత వెటర్నరీ యూనివర్సిటీకీ అనుబంధంగా ఉన్న మత్స్య యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఏపీ ఫిషరీస్‌ యూనివర్సిటీ యాక్టు–2020ను తీసుకురావడమే కాదు..2022 ఫిబ్రవరి 19 నుంచి వర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ  వర్సిటీ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లా ముతుకూరులోని కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌తో పాటు అవనిగడ్డ మండలం బావదేవర పల్లి వద్ద ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, కాకినాడలో ఉప్పునీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభధ్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రం, ఉండి వద్ద మంచి నీటి చేపలు, రొయ్యల పరిశోధన కేంద్రంతో పాటు 8 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలను మత్స్య వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేశారు.  

తొలి ఏడాదిలోనే గుర్తింపు 
వర్సిటీకి అనుబంధంగా 60 బీఎఫ్‌ఎస్సీ సీట్లతో కొత్తగా నర్సాపురం మత్స్య కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచింది. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సాపురం కళాశాలకు నిష్ణాతులైన అధ్యాపక బృందాన్ని నియమించి 2022–23 విద్యా సంవత్సరం నుంచే నర్సాపురంలోని తుఫాన్‌ భవనం (తాత్కాలికంగా)లో తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు యూజీసీ, ఐసీఏఆర్‌ గుర్తింపు కూడా లభించడం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్, పీహెచ్‌డీ కోర్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఫిషరీస్‌ కళాశాలలతో పాటు కొత్తగా నాలుగు మత్స్య పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ తాడిగడపలో వర్సిటీ క్యాంప్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అధి­కారికంగా   కార్యకలాపాలకు శ్రీకారంచుట్టారు. 

శరవేగంగా నిర్మాణ పనులు 
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో లఖితపూడి– సరిపల్లి గ్రామాల మధ్య 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో యూనివర్సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే 40 ఎకరాలను గుర్తించగా, దాంట్లో రూ.100 కోట్లతో పరిపాలనా భవనంతో పాటు అకడమిక్‌ బ్లాక్, బాలుర, బాలికల హాస్టళ్లు, రైతుల శిక్షణ కేంద్రం, వైస్‌ చాన్సలర్‌ బంగ్లా, మల్టీపర్పస్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనులు జోరందుకున్నాయి.   పిల్లర్ల దశకు చేరుకున్నాయి. మరొక పక్క వర్సిటీతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మత్స్యకళాశాల కోసం 48 టీచింగ్, 52 నాన్‌ టీచింగ్, 40 అవుట్‌సోర్సింగ్‌ కలిపి 140 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనామోదం కూడా ఇచ్చింది. 

శాస్త్రవేత్తను కావాలని.. 
మాది నెల్లూరు. మా నాన్న   ఆర్టీసీ కండక్టర్‌.గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఎంసెట్‌తో పాటు నీట్‌లో కూడా క్వాలిఫై అయ్యాను. చిన్నప్పటి నుంచి మత్స్యశాస్త్రవేత్త కావాలన్న సంకల్పంతో బ్యాచురల్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌లో చేరాను. నర్సాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో సీటు వచ్చింది. ఫ్యాకల్టీ చాలా బాగుంది. నర్సాపురం సమీపంలోనే ప్రాసెసింగ్‌ ప్లాంట్స్, హేచరీలు, మత్స్య పరిశ్రమలుండడం మాకెంతో ఉపయోగంగా ఉంది. 
–పి.హరిబాబు, బీఎఫ్‌ఎస్సీ విద్యార్థి 

అపార అవకాశాలు 
మాది గుంటూరు. నాన్న బ్యాంక్‌ మేనేజర్‌. ఎంబీబీఎస్‌ చేయాలని నీట్‌ రాశాను.   క్వాలీఫై కాలేకపోయాను. అపారమైన ఉపాధి అవకాశాలున్న మత్స్య రంగంలో అడుగు పెట్టాలన్న సంకల్పంతో నర్సాపురం కళాశాలలో బీఎఫ్‌ఎస్సీలో సీటు సాధించా. మత్స్య శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అవ్వాలన్నదే నా లక్ష్యం. 
–ఎస్‌డీ షరీఫాతేజ్, బీఎఫ్‌ఎస్సీ విద్యార్థిని

త్వరలో నూతన ప్రాంగణంలోకి.. 
అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశా­లున్న మత్స్యరంగం బలోపేతం కావాలంటే ప్రత్యేకంగా మత్స్య యూనివర్సిటీ అవసరం. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో మూడో మత్స్య  వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలిదశలో రూ.100 కోట్లతో వర్సిటీ  భవనాలు నిర్మాణమవుతున్నాయి.   వర్సిటీ భవనాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం.  సాధ్యమైనంత త్వరగా నూతన ప్రాంగణంలో వర్సిటీ కార్యకలాపాలతో పాటు  మరిన్ని కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. –డాక్టర్‌ ఓగిరాల సుధాకర్, రిజిస్ట్రార్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement