Shrimp production sector
-
ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారం, ప్రోత్సాహకాలు, రాయితీలతో రాష్ట్రంలో ఆక్వా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో మత్స్య ఉత్పత్తులు పెరగడమే కాకుండా, ఈ రంగంలో ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఆక్వా రంగంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలుస్తోంది. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల దిగుబడి దేశ సగటు దిగుబడిని మించి ఉంది. దేశ సగటు దిగుబడి హెక్టార్‌కు 7.5 టన్నులు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 8.8 టన్నులు ఉంది.ఒడిశా రాష్ట్రంలో ఇది 4.1 శాతమే ఉంది. దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ లోతైన అధ్యయనం చేసి వెల్లడించిన వివరాలివి. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. ఆంద్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఆక్వా రంగంలో అవకాశాలు, సవాళ్లను మ్యాపింగ్ చేయడం, ఈ రంగంలో ఫుడ్ ప్రోసెసింగ్ అవకాశాలను, ఎంఎస్ఎంఈల పని తీరును మెరుగుపరచడం ద్వారా ఉద్యోగావకాశాల మెరుగుకు ఈ అధ్యయనం చేసినట్లు నివేదిక పేర్కొంది.భారత దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశి్చమబెంగాల్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలది ఆధిపత్యమని తెలిపింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 71,900 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తులు సాగవుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా 6,34,672 టన్నుల రొయ్యలు ఉత్పత్తవుతున్నట్లు వెల్లడించింది. ఒడిశాలో 10,600 హెక్టార్లలో ఆక్వా ఉత్పత్తుల సాగు ఉండగా 43,677 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 91 శాతం ప్రాసెస్ చేయని చేప ఉత్పత్తులనే విక్రయిస్తున్నారని, ఆక్వా ఉత్పత్తులు ప్రోసెసింగ్ రంగం అభివృద్ధికి ఏపీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.ఆహార ప్రోసెసింగ్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ మెరుగుపడుతుందని పేర్కొంది. ఎక్కువ పోషక విలువలు గల రొయ్యల ప్రోసెస్డ్ ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పింది. ఉత్పత్తి సమయంలో రసాయనాల వినియోగం తగ్గించడంతో పాటు ప్రోసెసింగ్ చేసిన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని నివేదిక పేర్కొంది. ఎగుమతి చేసే ఆక్వా ఉత్తు్తలకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 19,894 సంస్దలు ఉన్నాయని, 105 ఫ్రీ ప్రోసెసింగ్ ప్లాంట్లు, 99 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయని, 74 మంది మాన్యఫ్యాక్చర్ ఎగుమతిదారులతో పాటు 69 మర్చంట్ వ్యాపారులు ఉన్నారని నివేదిక తెలిపింది. రొయ్యల ప్రాసెసర్ల శ్రామిక శక్తిలో 70–80 శాతం మంది మహిళలు ఉన్నట్లు అంచనా వేసింది.ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఆక్వా రంగంలో ఈ వృద్ధి సాధ్యమైందని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020–25 ఆహార ప్రాసెసింగ్ విధానాన్ని ప్రకటించి ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని, అలాగే మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఎక్కువ మందికి స్థానికంగా ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టిందని వివరించింది. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ కేంద్రాలను అభివృద్ధి ద్వారా ఆక్వాకు పెద్ద ఎత్తున చేయూతనిస్తోందని తెలిపింది. ఆక్వాలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. -
మత్స్యరంగం కొత్త పుంతలు
సాక్షి, అమరావతి: ‘ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మూడోదిగా ఏర్పాటైన ఈ వర్సిటీకి ఓ వైపు నూతన భవన సముదాయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే.. మరోవైపు దీనికి అనుబంధంగా కొత్త మత్స్య కళాశాల కొలువు దీరింది. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు..నిష్ణాతులైన అధ్యాపక బృందంతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 1200కు మించి పట్టభద్రుల్లేని పరిస్థితి రాష్ట్రంలో 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం..1.10 లక్షల హెక్టార్ల మంచినీటి సాగు..80 వేల హెక్టార్లలో ఉప్పునీటి సాగు విస్తీర్ణం ఉంది. 1.75 లక్షల మంది ఆక్వా రైతులు..8.50 లక్షల మంది మత్స్యకారులున్నారు. ఈ రంగంపై ఆధారపడి 16.50 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 51.06 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే నం.1 స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో చేపల ఉత్పత్తిలో 25.60 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 78 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి 11,901 డిప్లమో హోల్డర్లు, 6118 బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ), 2541 మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (ఎంఎఫ్ఎస్సీ) చదివిన వారు అవసరం. 2030 నాటికి కనీసం 50 వేల మందికి పైగా అవసరమవుతారని అంచనా. కానీ ప్రస్తుతం కేవలం 450 మంది డిప్లమో, 700 మంది బీఎఫ్ఎస్సీ, 50–60 మంది ఎంఎఫ్ఎస్సీ పూర్తిచేసిన వారు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2005 వరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, ఆ తర్వాత వెటర్నరీ యూనివర్సిటీకీ అనుబంధంగా ఉన్న మత్స్య యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్టు–2020ను తీసుకురావడమే కాదు..2022 ఫిబ్రవరి 19 నుంచి వర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లా ముతుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్‌తో పాటు అవనిగడ్డ మండలం బావదేవర పల్లి వద్ద ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల, కాకినాడలో ఉప్పునీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభధ్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రం, ఉండి వద్ద మంచి నీటి చేపలు, రొయ్యల పరిశోధన కేంద్రంతో పాటు 8 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలను మత్స్య వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తొలి ఏడాదిలోనే గుర్తింపు వర్సిటీకి అనుబంధంగా 60 బీఎఫ్ఎస్సీ సీట్లతో కొత్తగా నర్సాపురం మత్స్య కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచింది. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సాపురం కళాశాలకు నిష్ణాతులైన అధ్యాపక బృందాన్ని నియమించి 2022–23 విద్యా సంవత్సరం నుంచే నర్సాపురంలోని తుఫాన్ భవనం (తాత్కాలికంగా)లో తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు యూజీసీ, ఐసీఏఆర్ గుర్తింపు కూడా లభించడం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, పీహెచ్డీ కోర్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఫిషరీస్ కళాశాలలతో పాటు కొత్తగా నాలుగు మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ తాడిగడపలో వర్సిటీ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కార్యకలాపాలకు శ్రీకారంచుట్టారు. శరవేగంగా నిర్మాణ పనులు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో లఖితపూడి– సరిపల్లి గ్రామాల మధ్య 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో యూనివర్సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే 40 ఎకరాలను గుర్తించగా, దాంట్లో రూ.100 కోట్లతో పరిపాలనా భవనంతో పాటు అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టళ్లు, రైతుల శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. పిల్లర్ల దశకు చేరుకున్నాయి. మరొక పక్క వర్సిటీతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మత్స్యకళాశాల కోసం 48 టీచింగ్, 52 నాన్ టీచింగ్, 40 అవుట్సోర్సింగ్ కలిపి 140 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనామోదం కూడా ఇచ్చింది. శాస్త్రవేత్తను కావాలని.. మాది నెల్లూరు. మా నాన్న ఆర్టీసీ కండక్టర్.గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఎంసెట్‌తో పాటు నీట్లో కూడా క్వాలిఫై అయ్యాను. చిన్నప్పటి నుంచి మత్స్యశాస్త్రవేత్త కావాలన్న సంకల్పంతో బ్యాచురల్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో చేరాను. నర్సాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో సీటు వచ్చింది. ఫ్యాకల్టీ చాలా బాగుంది. నర్సాపురం సమీపంలోనే ప్రాసెసింగ్ ప్లాంట్స్, హేచరీలు, మత్స్య పరిశ్రమలుండడం మాకెంతో ఉపయోగంగా ఉంది. –పి.హరిబాబు, బీఎఫ్ఎస్సీ విద్యార్థి అపార అవకాశాలు మాది గుంటూరు. నాన్న బ్యాంక్ మేనేజర్. ఎంబీబీఎస్ చేయాలని నీట్ రాశాను. క్వాలీఫై కాలేకపోయాను. అపారమైన ఉపాధి అవకాశాలున్న మత్స్య రంగంలో అడుగు పెట్టాలన్న సంకల్పంతో నర్సాపురం కళాశాలలో బీఎఫ్ఎస్సీలో సీటు సాధించా. మత్స్య శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నదే నా లక్ష్యం. –ఎస్డీ షరీఫాతేజ్, బీఎఫ్ఎస్సీ విద్యార్థిని త్వరలో నూతన ప్రాంగణంలోకి.. అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న మత్స్యరంగం బలోపేతం కావాలంటే ప్రత్యేకంగా మత్స్య యూనివర్సిటీ అవసరం. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మూడో మత్స్య వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలిదశలో రూ.100 కోట్లతో వర్సిటీ భవనాలు నిర్మాణమవుతున్నాయి. వర్సిటీ భవనాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా నూతన ప్రాంగణంలో వర్సిటీ కార్యకలాపాలతో పాటు మరిన్ని కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. –డాక్టర్ ఓగిరాల సుధాకర్, రిజిస్ట్రార్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం -
నాణ్యమైన రొయ్యల ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఆక్వాసాగులో యాంటిబయోటిక్స్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా యాంటిబయోటిక్స్ వినియోగాన్ని 95 శాతానికిపైగా నియంత్రించగలిగారు. ఇకముందు 100 శాతం నియంత్రించేదిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్ శాతాన్ని పరీక్షించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏటా తొమ్మిదిలక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. లక్షటన్నులు స్థానికంగా వినియోగమవుతుండగా, లక్షన్నర టన్నులు ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వెళుతున్నాయి. మిగిలిన 6.50 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీన్లో 50 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, 30 శాతం చైనాకు, 10 శాతం వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలకు, 6–8 శాతం యూరప్ దేశాలకు, మిగిలింది మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యాంటిబయోటిక్ రెసిడ్యూల్స్ మితిమీరి ఉన్నాయంటూ ఒకప్పుడు పెద్ద ఎత్తున కన్సైన్మెంట్స్ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో ఏపీ సడా, సీడ్, ఫీడ్ యాక్టులు తీసుకురావడంతోపాటు తీరప్రాంత జిల్లాల్లో రూ.50 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన ఆక్వాసాగు వివరాలను ఈ ఫిష్ యాప్‌లో నమోదుచేస్తూ, నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా పెద్ద ఎత్తున మత్స్యసాగుబడులు నిర్వహిస్తున్నారు. యాంటిబయోటిక్స్ వినియోగంవల్ల తలెత్తే దుష్పరిణామాలపై ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తున్నారు. పంటకాలంలో కనీసం నాలుగైదుసార్లు వాటర్ అనాలసిస్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడమే కాదు.. పొరుగు రాష్ట్రాలు, దేశాలతో పోల్చుకుంటే రొయ్యల ఎదుగుదల 12.76 శాతం మేర పెరిగింది. మరోవైపు యాంటిబయోటిక్స్ వినియోగం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి విదేశాలకు పంపే రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు 0.3 నుంచి 0.4 శాతం ఉంటే, మన రాష్ట్రం నుంచి వెళ్లే వాటిలో 0.2 శాతం మాత్రమే నమోదవుతున్నాయి. అవికూడా కొద్దిపాటి కన్సైన్మెంట్లలోనే. ఈక్విడార్ వంటి దేశాల్లో ప్రతి ఉత్పత్తిని టెస్ట్ చేసిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతినిస్తారు. అదే మనదేశంలో ర్యాండమ్‌గా చెక్‌చేసిన తర్వాత ఎగుమతులకు అనుమతినిస్తుంటారు. వ్యాధుల నియంత్రణ పేరుతో విచ్చలవిడిగా వినియోగిస్తున్న యాంటిబయోటిక్స్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాంటిబయోటిక్స్ అవశేషాలుంటే ఇకనుంచి రొయ్యలను కొనుగోలు చేయబోమని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్‌పోర్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నూరుశాతం యాంటిబయోటిక్స్ రహిత ఉత్పత్తులుగా మన రొయ్యలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈక్విడార్ తరహాలోనే నూరుశాతం తనిఖీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ఆపరేటర్లతోపాటు రైతుసంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ పర్యవేక్షణలో సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్ అవశేషాలను క్రమం తప్పకుండా పరీక్షించనుంది. ప్రస్తుత సీజన్ నుంచే ఈ కార్యాచరణ అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యాంటిబయోటిక్స్ పరీక్షలకు అయ్యే వ్యయం రైతులపై పూర్తిగా పడకుండా సమష్టిగా భరించేలా ఏర్పాటు చేస్తోంది. యాంటిబయోటిక్స్ నియంత్రణే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాంటిబయోటిక్స్ వినియోగం నూరుశాతం నియంత్రణే లక్ష్యంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ రైతుల్లో అవగాహన కల్పించడమే కాదు.. సీడ్ నుంచి పట్టుబడి వరకు దశలవారీగా ప్రతి చెరువులోని రొయ్యలను పరీక్షిస్తుంది. – వడ్డి రఘురాం, అప్సడా వైస్ చైర్మన్ కమిటీ ఏర్పాటు మంచి ఆలోచన యాంటిబయోటిక్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. యాంటిబయోటిక్స్ లేని రొయ్యలను మాత్రమే ఎగుమతి చేసేందుకు ఇది ఎంతో దోహదపడనుంది. – ఐ.పి.ఆర్.మోహనరాజు, జాతీయ రొయ్యరైతుల సంఘం అధ్యక్షుడు -
జలాశయాల్లోకి 4 కోట్ల రొయ్యలు
సాక్షి, హైదరాబాద్: నీలకంఠ రొయ్యల ఉత్పత్తి మత్స్యకారులకు మంచి లాభాలు తెచ్చిపెడుతుండటంతో ఈ సారి దాదాపు 4.07 కోట్ల రొయ్యలను వదిలేందుకు మత్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 23 రిజర్వాయర్లలో వీటిని వదలాల్సి ఉండగా ఇప్పటికే పలు జలాశయాల్లో వదిలారు. గతేడాది రూ.కోటి పెట్టుబడితో రొయ్యలను వదలగా ఏకంగా ఏడింతలు రూ.8 కోట్ల పైన లాభాలు రావడం విశేషం. గతేడాది పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ పథకం మత్స్యశాఖకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టింది. గత నవంబర్‌లో పైలట్ ప్రాజెక్టు కింద 11 రిజర్వాయర్లలో రూ.1.39 కోట్లతో 1.08 కోట్ల నీలకంఠ రొయ్యలను వదిలారు. ఒక్కో రొయ్య పిల్లకు రూ.1.28 చొప్పున 1.08 కోట్ల రొయ్య పిల్లలకు మొత్తం రూ.1.39 కోట్లు ఖర్చయ్యాయి. వీటికి రూ. 8.06 కోట్లు పైన లాభాలు వచ్చాయి. 10 వేల మంది మత్స్యకారులకు మంచి ఆదాయం సమకూరింది. కాగా ఈ సారి నిజాంసాగర్ ప్రాజెక్టు, సింగూర్ ప్రాజెక్టు, కడెం, ఎస్సార్ఎస్పీ, ఎల్ఎండీ, ఎగువ మానేరు, పోచారం ప్రాజెక్టు, సతనాల, మత్తడివాగు, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీ కొమురం భీం ప్రాజెక్టు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మూíసీ ప్రాజెక్టు, దిండి, కోయిల్ సాగర్, పాలేరు, వైరా, లంకసాగర్, పెద్దవాగు ప్రాజెక్టు, తాలిపేరు, ఘన్పూర్ ములుగు ప్రాజెక్టు, శనిగరం ప్రాజెక్టుల్లో రొయ్యలు వదులుతున్నారు. యూరోపియన్ దేశాలకు ఎగుమతి.. నీలకంఠ రొయ్య (స్కాంపి) నీలంరంగులో రెండు పొడువైన కాళ్లు కలిగి ఉంటుంది. 1.5 అంగుళాల సైజులో ఉండే ఈ రొయ్య పిల్లలు 4 నుంచి 6 నెలల్లో దాదాపు 100గ్రా. వరకు బరువు పెరుగుతాయి. వీటికి మార్కెట్ ధర కిలోకు రూ.240 వరకు ఉంటుంది. ఈ రొయ్యలు ఎక్కువగా యూరోపియన్ దేశాలకు ఎగుమతవుతాయి. -
22న అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ ఐపీవో
ప్రైస్ బ్యాండ్ రూ.171–175 రూ.152 కోట్లు సమీకరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రొయ్యల ఉత్పత్తి రంగంలో ఉన్న అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ ఆగస్టు 22న ఐపీవోకి వస్తోంది. ప్రైస్‌బ్యాండ్ రూ.171–175గా నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ కలిగిన 87,00,000 షేర్లను ఆఫర్ చేయనుంది. వీటిలో ఫ్రెష్ ఇష్యూ కింద 72,50,000 షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌నకు చెందిన 14,50,000 షేర్లున్నాయి. ఆగస్టు 24న ఐపీవో ముగియనుంది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో షేర్లను లిస్ట్ చేస్తారు. ఐపీవో ద్వారా సుమారు రూ.152 కోట్ల దాకా సమీకరించనున్నారు. ఇందులో రూ.90 కోట్లను కాకినాడ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ కోసం వ్యయం చేయనున్నట్టు అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ సీఎండీ కారుటూరి సత్యనారాయణ మూర్తి శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. 100 శాతం ఉన్న ప్రమోటర్ల వాటా ఇష్యూ అనంతరం 72 శాతానికి చేరుతుందని చెప్పారు. కంపెనీ 1,340 ఎకరాల్లో రొయ్యలు పండిస్తోంది. రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఉత్పత్తులను యూఎస్, యూరప్ తదితర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ వార్షిక ప్రాసెసింగ్ సామర్థ్యం 9,240 మెట్రిక్ టన్నులు. థర్డ్ పార్టీ ప్లాంటు ద్వారా మరో 6,000 మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తులను సరఫరా చేయలేకపోతోంది. దీంతో విస్తరణకు వెళ్తున్నట్టు అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ ఈడీ సుబ్రహ్మణ్య చౌదరి తెలిపారు.