Veterinary University
-
మత్స్యరంగం కొత్త పుంతలు
సాక్షి, అమరావతి: ‘ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మూడోదిగా ఏర్పాటైన ఈ వర్సిటీకి ఓ వైపు నూతన భవన సముదాయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే.. మరోవైపు దీనికి అనుబంధంగా కొత్త మత్స్య కళాశాల కొలువు దీరింది. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు..నిష్ణాతులైన అధ్యాపక బృందంతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 1200కు మించి పట్టభద్రుల్లేని పరిస్థితి రాష్ట్రంలో 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం..1.10 లక్షల హెక్టార్ల మంచినీటి సాగు..80 వేల హెక్టార్లలో ఉప్పునీటి సాగు విస్తీర్ణం ఉంది. 1.75 లక్షల మంది ఆక్వా రైతులు..8.50 లక్షల మంది మత్స్యకారులున్నారు. ఈ రంగంపై ఆధారపడి 16.50 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 51.06 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే నం.1 స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో చేపల ఉత్పత్తిలో 25.60 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 78 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి 11,901 డిప్లమో హోల్డర్లు, 6118 బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ), 2541 మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (ఎంఎఫ్ఎస్సీ) చదివిన వారు అవసరం. 2030 నాటికి కనీసం 50 వేల మందికి పైగా అవసరమవుతారని అంచనా. కానీ ప్రస్తుతం కేవలం 450 మంది డిప్లమో, 700 మంది బీఎఫ్ఎస్సీ, 50–60 మంది ఎంఎఫ్ఎస్సీ పూర్తిచేసిన వారు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2005 వరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, ఆ తర్వాత వెటర్నరీ యూనివర్సిటీకీ అనుబంధంగా ఉన్న మత్స్య యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్టు–2020ను తీసుకురావడమే కాదు..2022 ఫిబ్రవరి 19 నుంచి వర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లా ముతుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్‌తో పాటు అవనిగడ్డ మండలం బావదేవర పల్లి వద్ద ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల, కాకినాడలో ఉప్పునీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభధ్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రం, ఉండి వద్ద మంచి నీటి చేపలు, రొయ్యల పరిశోధన కేంద్రంతో పాటు 8 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలను మత్స్య వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తొలి ఏడాదిలోనే గుర్తింపు వర్సిటీకి అనుబంధంగా 60 బీఎఫ్ఎస్సీ సీట్లతో కొత్తగా నర్సాపురం మత్స్య కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచింది. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సాపురం కళాశాలకు నిష్ణాతులైన అధ్యాపక బృందాన్ని నియమించి 2022–23 విద్యా సంవత్సరం నుంచే నర్సాపురంలోని తుఫాన్ భవనం (తాత్కాలికంగా)లో తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు యూజీసీ, ఐసీఏఆర్ గుర్తింపు కూడా లభించడం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, పీహెచ్డీ కోర్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఫిషరీస్ కళాశాలలతో పాటు కొత్తగా నాలుగు మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ తాడిగడపలో వర్సిటీ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కార్యకలాపాలకు శ్రీకారంచుట్టారు. శరవేగంగా నిర్మాణ పనులు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో లఖితపూడి– సరిపల్లి గ్రామాల మధ్య 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో యూనివర్సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే 40 ఎకరాలను గుర్తించగా, దాంట్లో రూ.100 కోట్లతో పరిపాలనా భవనంతో పాటు అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టళ్లు, రైతుల శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. పిల్లర్ల దశకు చేరుకున్నాయి. మరొక పక్క వర్సిటీతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మత్స్యకళాశాల కోసం 48 టీచింగ్, 52 నాన్ టీచింగ్, 40 అవుట్సోర్సింగ్ కలిపి 140 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనామోదం కూడా ఇచ్చింది. శాస్త్రవేత్తను కావాలని.. మాది నెల్లూరు. మా నాన్న ఆర్టీసీ కండక్టర్.గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఎంసెట్‌తో పాటు నీట్లో కూడా క్వాలిఫై అయ్యాను. చిన్నప్పటి నుంచి మత్స్యశాస్త్రవేత్త కావాలన్న సంకల్పంతో బ్యాచురల్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో చేరాను. నర్సాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో సీటు వచ్చింది. ఫ్యాకల్టీ చాలా బాగుంది. నర్సాపురం సమీపంలోనే ప్రాసెసింగ్ ప్లాంట్స్, హేచరీలు, మత్స్య పరిశ్రమలుండడం మాకెంతో ఉపయోగంగా ఉంది. –పి.హరిబాబు, బీఎఫ్ఎస్సీ విద్యార్థి అపార అవకాశాలు మాది గుంటూరు. నాన్న బ్యాంక్ మేనేజర్. ఎంబీబీఎస్ చేయాలని నీట్ రాశాను. క్వాలీఫై కాలేకపోయాను. అపారమైన ఉపాధి అవకాశాలున్న మత్స్య రంగంలో అడుగు పెట్టాలన్న సంకల్పంతో నర్సాపురం కళాశాలలో బీఎఫ్ఎస్సీలో సీటు సాధించా. మత్స్య శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నదే నా లక్ష్యం. –ఎస్డీ షరీఫాతేజ్, బీఎఫ్ఎస్సీ విద్యార్థిని త్వరలో నూతన ప్రాంగణంలోకి.. అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న మత్స్యరంగం బలోపేతం కావాలంటే ప్రత్యేకంగా మత్స్య యూనివర్సిటీ అవసరం. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మూడో మత్స్య వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలిదశలో రూ.100 కోట్లతో వర్సిటీ భవనాలు నిర్మాణమవుతున్నాయి. వర్సిటీ భవనాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా నూతన ప్రాంగణంలో వర్సిటీ కార్యకలాపాలతో పాటు మరిన్ని కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. –డాక్టర్ ఓగిరాల సుధాకర్, రిజిస్ట్రార్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం -
గొర్రెలకు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏ జీఆర్) గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో రెండొందలకు పైగా గొర్రె జాతులను అధికారికంగా గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని గొర్రెల్లో జన్యు వైవిధ్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాగావళి గొర్రె(విజయనగరం నాటు గొర్రె)లతో పాటు పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల (కృష్ణ) గొర్రెలను అధికారికంగా గుర్తించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఏదైనా కొత్త జాతిని గుర్తించాలంటే వాటి బాహ్య, జన్యు లక్షణాల నిర్థారణ, జనాభా స్థితుగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న మాచర్ల, గరివిడి పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు 15 ఏళ్లపాటు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక సమర్పించాయి. అధికారిక గుర్తింపుతో ప్రయోజనాలివీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు పొందాలంటే గొర్రెల జాతులను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్రా, పల్నాడు, రాయలసీమ ప్రాంతవాసులు తాము పెంచే జాతులను నాటు గొర్రెలుగా పేర్కొనాల్సి రావడంతో తగిన లబ్ధి, ఆశించిన ధర పొందలేకపోతున్నారు. ప్రస్తుతం వీటికి అధికారిక గుర్తింపు లభించడంతో వాటిని పెంచేవారు ఇకపై అన్ని రకాల లబ్ధి పొందగలరు. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధర ప్రస్తుతం రూ.30 వేలు కాగా గుర్తింపుతో రూ.45 వేలు పలికే అవకాశం ఉంది. ఆడ గొర్రెలకు ప్రస్తుతం రూ.10 వేలు లభిస్తుండగా.. ఇకపై రూ.15 వేల వరకు పలుకుతాయి. కృష్ణ గొర్రెలకు వందేళ్ల చరిత్ర మాచర్ల గొర్రెల జన్మస్థలం కృష్ణా నది పరీవాహక ప్రాంతం కావడంతో వీటిని కృష్ణ గొర్రెలుగా పిలుస్తారు. నదికి ఇరువైపులా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఏపీలో 6.60 లక్షల సంపద ఉందని అంచనా. నెల్లూరు, ముజఫర్ నగర్ గొర్రెల కంటే అధిక బరువు కలిగి ఉంటాయి. నలుపు, తెలుగు, గోధుమ రంగుల్లో ఉంటాయి. తల కుంభాకారంగా, చెవులు, తోక గొట్టాల వలె ఉంటాయి. కొమ్ములు తలకి సమాంతరంగా వుంటాయి. మొదటి ఈత 18–24 నెలలకు వస్తాయి. 20 శాతంపైగా కవలలకు జన్మనిస్తాయి.ప్రతి రెండేళ్లకు 3 పిల్లల చొప్పున ఏడేళ్ల జీవిత కాలంలో 6–8 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 53.25 కేజీలు, ఆడ గొర్రె 40 కేజీల వరకు పెరుగుతాయి. యుద్ధాలు చేసిన గొర్రెలివి నాగావళి జాతి గొర్రెలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కళింగుల కాలంలో ఈ గొర్రెలను యుద్ధాలు, పందేలకు వినియోగించేవారని చెబుతుంటారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో సుమారు 9.90 లక్షల నాగావళి గొర్రెలు ఉన్నట్టు అంచనా. బూడిద, గోధుమ, తెలుపు మిశ్రమ వర్ణం కలిపి ఉంటాయి. తల పాము పడగ ఆకారం ఉంటుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయం, నోరు, ఉదరం, కాళ్ల చివర భాగం నల్లగా, తోక సన్నగా, కాళ్లు, గిట్టలు బలంగా పొడవుగా ఉంటాయి. ఏడేళ్ల పాటు జీవించే ఈ గొర్రెలు ఏడాదిన్నర నుంచి ప్రతి రెండేళ్లకు 6 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 2.5 అడుగులు ఎత్తు పెరిగితే.. ఆడ గొర్రెలు మగ గొర్రెల కంటే 2 అంగుళాల తక్కువ ఎత్తు ఉంటాయి. పొట్టేలు 42 కిలోలు, ఆడ గొర్రెలు 35 కిలోల వరకు బరువు పెరుగుతాయి. 12 నెలల వయసులోనే మంచి మాంసం దిగుబడి వస్తుంది. వీటి మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. పరాన్న జీవులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే రోగాలను తట్టుకునే శక్తి వీటికి ఉంది. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కీలక ముందడుగు నాగావళి, మాచర్ల గొర్రె జాతులకు గుర్తింపు లభించడం ఏపీ పశు గణాభివృద్ధిలో కీలకమైన ముందడుగు. 15 ఏళ్లుగా వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు, అధ్యయనం ఎట్టకేలకు ఫలించాయి. గుర్తింపుతో ఈ జాతుల పరిరక్షణకు పెద్దఎత్తున నిధులు మంజూరవుతాయి. – డాక్టర్ కె.సర్జన్‌రెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్, ఎస్వీవీ విశ్వవిద్యాలయం -
వెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్ ‘కలకలం’.. 34 మందిపై చర్యలు!
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. మొదటి ఏడాది చదువుతున్న 25 మంది విద్యార్థులను ర్యాగింగ్ చేశారన్న ఆరోపణలపై మొత్తం 34 మంది విద్యార్థులను హాస్టళ్ల నుంచి బహిష్కరించారు. ఇందులో తీవ్ర నేరం చేశారని భావిస్తున్న 25 మందిని రెండు వారాల పాటు తరగతులకు హాజరు కాకుండా కళాశాల ప్రాంగణం నుంచి బహిష్కరిస్తూ కళాశాల అసోసియేట్ డీన్, వార్డెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు విశ్వవిద్యాలయ వర్గాలు ఆదేశించాయి. ఏం జరిగిందంటే...! రెండు, నాలుగో సంవత్సరం చదువుతున్న సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారంటూ హాస్టల్ వార్డెన్‌కు 25 మంది జూనియర్ విద్యార్థులు సీల్డ్ బాక్స్‌లో ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఘటనపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ నెల 27వ తేదీన మొదటి ఏడాది చదువుకుంటున్న జూనియర్లను, 28న రెండు, నాలుగో ఏడాది చదువుతున్న సీనియర్లను విచారించి ఆరా తీసింది. విచారణ తర్వాత మొత్తం 34 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారిస్తూ ఈ నెల 29న సదరు కమిటీ నివేదిక ఇచ్చింది. ఇందులో 16 మంది రెండో ఏడాది విద్యార్థులు కాగా, 18 మంది నాలుగో ఏడాది విద్యార్థులున్నారు. నివేదిక ఆధారంగా 25 మందిని హాస్టల్–ఏ నుంచి బహిష్కరించడంతో పాటు తరగతులకు కూడా రెండు వారాల పాటు హాజరు కావద్దని ఆదేశించారు. అదే విధంగా మరో 9 మందిని అన్ని హాస్టళ్ల నుంచి బహిష్కరించడంతో పాటు కళాశాల వాహనాలు ఎక్కవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ర్యాగింగ్‌లో భాగంగా మొదటి ఏడాది చదువుతున్న జూనియర్లను సీనియర్లు కొందరు నగ్నంగా నిలబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. -
జాతి మెరిసేలా.. పునరుత్పత్తి పెరిగేలా!
అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవుల సంరక్షణే ధ్యేయంగా వెటర్నరీ యూనివర్సిటీ అడుగులు వేస్తోంది. మేలు జాతి దూడల పరిరక్షణే లక్ష్యంగా దూసుకుపోతోంది. దీనికోసం అత్యాధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పిండ మార్పిడి చేసేందుకు వీలుగా సరికొత్త ప్రయోగశాలను సిద్ధం చేసింది. సరోగసీ ద్వారా పుంగనూరు జాతి సంతతిని మరింత పెంచేలా ప్రణాళిక రచించింది. ఈమేరకు పలమనేరులో ఏర్పాటు చేసిన ప్రయోగశాలను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ప్రారంభించనుండటం విశేషం. తిరుపతి ఎడ్యుకేషన్: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ తన ప్రగతి ప్రస్థానంలో మరో ముందడుగు వేసింది. ఉమ్మడి జిల్లాలకు తలమానికమైన పుంగనూరు జాతి పొట్టిరకం ఆవుల పరిరక్షణ, మేలు జాతి దూడల పునరుత్పత్తికి ఇన్విట్రో ఫరి్టలిటీ(ఐవీఎఫ్), ఎంబ్రియో ట్రాన్స్ఫర్(పిండ మార్పిడి) టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. పలమనేరులోని వర్సిటీ పశుపరిశోధన స్థానంలో ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ.1.8 కోట్ల రా్రïÙ్టయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) నిధులు వెచ్చించింది. మూడో ప్రయోగశాల శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధి, పలమనేరులోని పశుపరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఐవీఎఫ్ ల్యాబ్ మూడవది. గుంటూరులోని లాం ఫామ్‌లో ఒంగోలు జాతుల అభివృద్ధికి ఐవీఎఫ్ ల్యాబ్ ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నారు. అలాగే టీటీడీతో కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగా టీటీడీ గోశాలల్లోని దేశీయ ఆవుల్లో మేలు జాతిని ఉత్పత్తిచేసి శ్రీవారి సేవకు ఉపయోగించేందుకు వీలుగా తిరుపతి వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ (వీసీసీ)లో రూ.3.2 కోట్లతో ఐవీఎఫ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా దేశీయ ఆవుల ఉత్పత్తి పెంచి రోజుకు 3 వేల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధి కోసం పలమనేరు పరిశోధన స్థానంలో ఐవీఎఫ్ ప్రయోగశాలను బుధవారం ప్రారంభించనున్నారు. నేడు ప్రారంభం వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం, పలమనేరులోని పశు పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్, ఈటీ ప్రయోగశాలలను పశు సంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారంప్రారంభించనున్నారు. విద్యలో ప్రమాణాల పెంపునకు పరిశోధనల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తున వెటర్నరీ వర్సిటీ పశువైద్య విద్యలో ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వెటర్నరీ వర్సిటీ ఆవరణలో రూ.7.04 కోట్లతో అత్యాధునిక వసతులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. ఆకట్టుకునే విధంగా భవన నిర్మాణం రూపకల్పన చేశారు. ఇందులో పూర్వవిద్యార్థి (ఎన్ఆర్ఐ) ప్రతాపరెడ్డి పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పశువైద్య విద్య, న్యూట్రిషన్ కోర్సులకు సంబంధించి అత్యాధునిక జర్నల్స్ అందుబాటులో ఉంచనున్నారు. -
117 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీతో పాటు వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బోధన విభాగంలో ఖాళీగా ఉన్న 117 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కేటాయించిన ఈ పోస్టుల భర్తీకి ఇటీవలే యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 47 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 70 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి వెటర్నరీ సైన్స్‌లో 40, ఫిషరీస్ సైన్స్‌లో 4, డెయిరీ సైన్స్‌లో 2, వ్యవసాయ విభాగంలో ఒక పోస్టు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి వెటర్నరీ సైన్స్‌లో 64, ఫిషరీస్ సైన్స్‌లో 4, డెయిరీ సైన్స్‌లో 2 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4.30 గంటలలోగా ది రిజిస్ట్రార్, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, డాక్టర్ వైఎస్సార్ భవన్, తిరుపతి–517502 చిరునామాకు దరఖాస్తులు పంపాలని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వి.పద్మనాభరెడ్డి చెప్పారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్వివియూ.ఈడీయూ.ఇన్‌లో చూడాలని ఆయన సూచించారు. -
డ్రగ్స్ మత్తులో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: మరో గంటలో పరీక్ష రాయాల్సిన ఓ వెటర్నరీ విద్యార్థి డ్రగ్స్ మత్తులో చేతి మనికట్టును కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మొదటిసారిగా వెటర్నరీ హాస్టల్లో మత్తు మందు వాడకం బహిర్గతం కావడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో వరంగల్‌కు చెందిన తరుణ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆనంద నిలయం హాస్టల్లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా తరుణ్ తోటి విద్యార్థులకు దూరంగా ఉంటూ.. తనకు కేటాయించిన గదిలో కాకుండా మరో గదిలో ఉంటున్నాడు. పరీక్షల సమయం కావడంతో అందులోని విద్యార్థులు మరో గదిలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తరుణ్ గది లోపలి నుంచి గడియ వేసుకొని చేతి మనికట్టును బ్లేడ్‌తో కోసుకున్నాడు. 9.30 గంటల ప్రాంతంలో విద్యార్థులంతా పరీక్ష హాల్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తరుణ్ తలుపు తీయకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది, తోటి విద్యార్థులు అనుమానం వచ్చి బలంగా నెట్టి తలుపు తెరిచారు. తరుణ్ రక్తపుమడుగులో పడి ఉండటంతో ప్రిన్సిపల్‌కు సమాచారం అందించి నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రేమలో విఫలం.... తరుణ్ ప్రేమ్‌లో విఫలమయ్యాడని తోటి విద్యార్థులు వెల్లడించారు. కొన్ని రోజులుగా మత్తుమందుకు అలవాటుపడ్డాడని, అనస్థీషియాకు ఇచ్చే జైలాజిన్ అనే డ్రగ్స్‌ను వాడుతున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఖాళీ సిరంజీలు, బాటిళ్లు రూమ్‌లో లభ్యమయ్యాయని వీటిని అధికారులకు అందించినట్లు తెలిపారు. డ్రగ్స్ మత్తులోనే తరుణ్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చన్నారు. కాగా కొన్ని రోజులుగా తరుణ్ తన గదిలో కాకుండా ఇతరుల గదుల్లో ఉన్నా రోజూ తనిఖీలు నిర్వహించే యాంటీ ర్యాగింగ్ టీమ్ పట్టించుకోలేదు. తరుణ్ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ మేరకు విద్యార్థులకు ఆదేశాలిచ్చారు. ఈ విషయమై సంప్రదించేందుకు యత్నించగా, కళాశాల రిజిస్ట్రార్‌తో పాటు ప్రిన్సిపల్, డీన్ ఫోన్లను స్వీచ్ ఆఫ్ చేసుకున్నారు. -
త్వరలో వెటర్నరీ వర్సిటీకి ఐకార్ గుర్తింపు!
నేటి నుంచి ఐకార్ బృందం తనిఖీలు సాక్షి, హైదరాబాద్: పీవీ నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఐకార్ ఉన్నత స్థాయి బృందం బుధవారం హైదరాబాద్ రానుంది. వర్సిటీతో పాటు దాని పరిధిలోని పశు వైద్య కళాశాలలకు వెళ్లి మౌలిక సదుపాయాలపై తనిఖీలు చేయనుంది. వర్సిటీ పరిధిలో పశు విద్య, మౌలిక సదుపాయాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితే ఐకార్ గుర్తింపు లభిస్తుంది. ఈ మేరకు అధికారులు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిసింది. ఈ బృందంలో బెనారస్ విశ్వవిద్యాలయానికి చెందిన డీన్ డాక్టర్ రమాదేవి సహా ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరు ఈ నెల 18 వరకు పర్యటించి సమగ్రంగా అధ్యయనం చేస్తారు. -
వెటర్నరీ యూనివర్సిటీ అధికారుల పదవీకాలం పెంపు
- గరివిడి వెటర్నరీ కళాశాలకు ఈ ఏడాది అనుమతి లేదు - అనంతపురం జిల్లాలో గొర్రెల పరిశోధనా స్థానం ఏర్పాటుకు అనుమతి యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎనిమిది మంది అధికారుల పదవీకాలాన్ని పొడిగిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇన్చార్జీ వీసీ మన్మోహన్సింగ్ అధ్యక్షతన మంగళవారం వెటర్నరీ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 8 మంది అధికారుల పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త అధికారులను నియమించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఖాళీగా ఉన్న 3 యూనివర్సిటీ అధికారుల పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 14 అంశాలపై చర్చించారు. గ్రామీణ అభివృద్ధి నిధుల కింద యూనివర్సిటీకి మంజూరైన 135 కోట్ల నిధుల వ్యయం, అభివృద్ధిపనులపై చర్చించారు. జాతీయ అర్హత పరీక్ష కొన్ని సబ్జెక్టులకు మినహాయిస్తూ పాలకమండలి తీర్మానించింది. ఐసీఏఆర్ కొన్ని సబ్జెక్టులకు నిర్వహించకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు ఇన్చార్జీ వీసీ మన్మోహన్సింగ్ తెలిపారు. విజయనగరం జిల్లా గరివిడికి మంజూరైన వెటర్నరీ కళాశాలను ఈ ఏడాది ఏర్పాటు చేయడంలేదని చెప్పారు. అవసరం అయిన మౌలిక వసతులు కల్పించి వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో గొర్రెల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. కర్నూలు జిల్లా బనవాసిలో గొర్రెలు, మేకల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు అనుమతించామన్నారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ కళాశాలల ఏర్పాటు అంశం కేబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ కారణంగా ఈ అంశంపై పాలకమండలిలో చర్చించలేదన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ సుధాకర్‌రెడ్డి, బోర్డు సభ్యులు కరుణానిధి, వేణుగోపాల్‌నాయుడు, శ్రావణ్‌కుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు మరో యూనివర్శిటీ
సాక్షి, ఒంగోలు: జిల్లాకు మరో యూనివర్శిటీ వచ్చింది. ఇప్పటికే జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ ప్రతిపాదనలు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా, ఇక్కడ్నే వెటర్నరీ యూనివర్శిటీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లా పర్యటనకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పర్చూరు, ఒంగోలు జన్మభూమి సభల్లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రకటించారు. ఒంగోలుగిత్త బ్రీడ్‌ను కాపాడేందుకు అన్నివిధాలా కృషి చేస్తామన్నారు. దొనకొండను ఇండస్ట్రియల్ సిటీగా మారుస్తామని, కనిగిరిలో జాతీయ పారిశ్రామికవాడతో పాటు రామాయపట్నం పోర్టు, ఒంగోలులో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చంద్రబాబు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేస్తామని, దాదాపు పూర్తిదశలో ఉన్న రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులను సద్వినియోగంతో ఆయకట్టుకు సరిపడా నీరిస్తామన్నారు. కొత్తపట్నానికి నాలుగులైన్ల రహదారిని విస్తరించి అభివృద్ధిచేస్తామని, ఒంగోలులో మినీ, అవుట్డోర్ స్టేడియంల అభివృద్ధికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి సారించి ఎన్టీఆర్ సుజల పథకం కింద నీటిప్లాంట్లను నెలకొల్పుతామన్నారు. డ్వాక్రా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులతోపాటు, ఒంగోలులో మైసూర్‌పాక్, వేటపాలెం జీడిపప్పు వంటి రుచికరమైన ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు ‘ఇ-కామర్స్’ విధానం అమలు చేస్తానన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయాన్ని పెంచుతామని, స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో పైపులైన్ల ద్వారా గ్యాస్‌ను ఇంటింటికీ సరఫరా చేస్తామని, వాహనాలకు సీఎన్జీ గ్యాస్ అందిస్తామన్నారు. ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమృలో చేపట్టిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల కోసం సభల్లో ప్రత్యేకంగా వివరించారు. భవిష్యత్‌లో ఇంటింటికీ బ్రాడ్‌బ్రాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు విద్యార్థులకు ఐపాడ్లు, టాబ్లు అందించి పేదరికంపై గెలుపును సాధిస్తామని చెప్పారు. పేదవిద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తెస్తామని.. దశలవారీగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మూసివేసి క్లస్టర్ పాఠశాలల ఏర్పాటుతో వాహనసదుపాయం కూడా సమకూరుస్తామన్నారు. కూచిపూడి నాట్యం నేర్చుకున్న ప్రతి విద్యార్థినికి అదనంగా మార్కులు కలిపే ప్రతిపాదనపై ఆలోచిస్తామని, వచ్చేరోజుల్లో వివిధ అంశాల్లో పోటీతత్వ పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. తొలుత పర్చూరులోని స్థానిక వైఆర్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ‘బడి పిలుస్తోంది రా..’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బడి బయటనున్న పిల్లలను గుర్తించి విద్యను నేర్పించడంలో ప్రకాశం జిల్లా ప్రథమస్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. నియోజకవర్గ చుట్టుపక్కలనున్న 73 పాఠశాలల నుంచి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో బాబు ముచ్చటించారు. వేదికపైన మాట్లాడిన చిన్నారుల వాగ్ధాటికి చంద్రబాబు ముచ్చటపడ్డారు. కార్యక్రమంలో అధికసమయం చిన్నారుల అభిప్రాయాలకే కేటాయించారు. డ్రిప్,స్ప్రింక్లర్లతో సాగు ప్రోత్సాహం పర్చూరులోని నాగులపాలెంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం కాస్తంత పేలవంగా సాగింది. ఒకరిద్దరు రైతుల మినహా అందరూ ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలే ఉండటంతో సమావేశ ఉద్దేశం పక్కదారి పట్టింది. తొలుత అక్కడ పత్తిపంటను సందర్శించి చేనుగల రైతులతో బాబు మాట్లాడారు. శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ పొలంపిలుస్తోంది కార్యక్రమంలో క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా తెలుసుకున్న అంశాలేంటని అడిగారు. ఈ సందర్భంగా శెనగరైతులు తమ బాధలను చెప్పుకున్నారు. 40 వేల పోరంబోకు భూముల్లో .. జిల్లాలోని 40 వేల పోరంబోకు భూముల్లో నీరు, చెట్టు పథకం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. నాగులపాలెం జన్మభూమి వేదికపై బాబు చేతులమీదుగా చెట్టుపట్టాలను కలెక్టర్ విజయకుమార్ అందించారు. ఇక్కడ సభాధ్యక్షత వహించిన స్థానిక సర్పంచి గంగాభవాని, ఎంపీటీసీ వాణి, జెడ్పీటీసీ ఉషారాణి తదితరులు కోరిన గ్రామసమస్యలపై బాబు సానుకూలంగా స్పందించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, నీరు - చెట్టు, డ్వాక్రారుణాలు, పింఛన్లపంపిణీ తదితర అంశాలపై తయారుచేసిన పాటల సీడినీ బాబు ఆవిష్కరించి.. ప్రతీ పాటను వేదికపై నుంచి జనాలకు వినిపించారు. వేదికపైన రూ.50కోట్ల రుణాల చెక్‌ను లబ్ధిదారులకు అందించారు. రుణమాఫీ అమలుపై కట్టుడతా.. తమ్ముళ్లూ.. రుణమాఫీ అమలు సాధ్యం కాదన్నారు. ఆరునూరైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు విడతలవారీ మాఫీకి ప్రణాళిక రూపొందించాం. వందరోజులపాటు కేంద్రంతో మాట్లాడా.. ఆర్బీఐకి లేఖలు రాసా.. అన్నివైపుల నుంచి ప్రోత్సాహం కరువే.. నా సొంత ఆలోచనతో ‘రైతు సాధికారసంస్థ’ను నెలకొల్పాను. జిల్లాలో బాబు పర్యటన మంగళవారం అధికారిక షెడ్యూల్ సమయం కంటే గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. పర్చూరులోని మార్కెట్‌కమిటీ యార్డు ఆవరణలో హెలీప్యాడ్‌కు ఉదయం 10.30కి చేరుకోవాల్సి ఉండగా, మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. అక్కడ జిల్లామంత్రి సిద్దా రాఘవరావు, పర్చూరు, కనిగిరి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కదిరి బాబూరావు, మాజీ ఎంపీ కరణం బలరాంతో పాటు అధికార పార్టీ ప్రముఖులు ఆయనకు స్వాగతం పలకగా, అక్కడ్నుంచి బడిపిలుస్తోంది రా, పొలంపిలుస్తోంది, జన్మభూమి సభలు ముగిసేనాటికి సాయంత్రం ఐదుగంటలు దాటింది. అక్కడ్నుంచి ఒంగోలుకు చేరుకుని మినీస్టేడియం ఆవరణలో సభ ప్రారంభం సాయంత్రం ఏడుగంటలైంది. అన్నిచోట్ల జనాలతరలింపులో అధికారపార్టీ నేతలు విజయవంతం అయ్యారు. చంద్రబాబు రాత్రిబస స్థానిక ఎన్ఎస్పీ అతిథిగృహంలో చేశారు. -
కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ?
శాతవాహన యూనివర్సిటీ : రాష్ట్ర ప్రభుత్వం పీవీ నర్సింహారావు పేరిట ఏర్పా టు చేయనున్న వెటర్నరీ యూనివర్సిటీని కోరుట్లలోని వె టర్నరీ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేయించేందుకు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయమై ఇప్పటికే కళాశాల అధికారులతో చర్చించిన ఆమె ఆదివారం వారితో హైదరాబాద్‌లో మరోసారి స మావేశమయ్యారు. యూనివర్సిటీ ఏర్పాటు సంబంధిత విషయాలను వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ రమేశ్ గుప్తా ఎంపీకి వివరించినట్లు సమాచారం. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత మరిన్ని వసతులు సమకూర్చుకునే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం యూనివర్సిటీ ఏర్పాటుకు అనువుగా ఉన్న వసతులు, అనుకూల వాతావరణాన్ని ఆయన వివరించారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపీ కవిత కలిసి వెటర్నరీ యూనివర్సిటీని కోరుట్లలో ఏర్పాటు చేయాలని కోరనున్నారు. జిల్లాలోని కథలాపూర్ ప్రాంతంలో ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారని భావించినా... సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో వెటర్నరీ యూనివర్సిటీని మన జిల్లాకు మంజూరు చేయించేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారు. అనుకూల అంశాలు.. * ఇప్పటికే ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయ వెటర్నరీ సైన్స్ కళాశాలకు 58 ఎకరాల స్థలం ఉంది. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అదనపు స్థలాన్ని ప్రభుత్వం సేకరించడానికి వీలుంది. * హైదరాబాద్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కళాశాల కరీంనగర్ జిల్లా కేంద్రానికి 72 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచి రోడ్డు రవాణా సదుపాయాలు ఉన్నాయి. * అవసరమైన విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, నీటి సదుపాయాలు, అంతర్గత రోడ్లు, ప్రహారీ ఉన్నాయి. *అన్ని రకాల భవనాలున్నాయి. విద్యార్థులకు, విద్యార్థినులకు హాస్టళ్లున్నాయి. క్యాంటీన్, గెస్ట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ఇతర భవనాలు నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాయి. యూనివర్సిటీ నిర్వహణకు అవసరమయ్యే అదనపు ఏర్పాట్లు మాత్రం చేయవలసి ఉంటుంది. * విద్యార్థులకు ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడి యం, ఉద్యోగులకు క్వార్టర్స్, హెల్త్ సెంటర్లకు ప్రతి పాదనలు ఇప్పటికే పంపారు. అనుమతి రావాల్సి ఉంది. * పశు వైద్యశాలలు, దాణా కలిపే ప్లాంట్, పోస్ట్‌మార్టమ్ హాల్, పశువులకు షెడ్లు ఉన్నాయి. * తెలంగాణలో ప్రాంతీయ సమతుల్యతకు సహకరిస్తుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చేరువలో ఉంటుంది.