- గరివిడి వెటర్నరీ కళాశాలకు ఈ ఏడాది అనుమతి లేదు
- అనంతపురం జిల్లాలో గొర్రెల పరిశోధనా స్థానం ఏర్పాటుకు అనుమతి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎనిమిది మంది అధికారుల పదవీకాలాన్ని పొడిగిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇన్‌చార్జీ వీసీ మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన మంగళవారం వెటర్నరీ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 8 మంది అధికారుల పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త అధికారులను నియమించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఖాళీగా ఉన్న 3 యూనివర్సిటీ అధికారుల పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 14 అంశాలపై చర్చించారు.
గ్రామీణ అభివృద్ధి నిధుల కింద యూనివర్సిటీకి మంజూరైన 135 కోట్ల నిధుల వ్యయం, అభివృద్ధిపనులపై చర్చించారు. జాతీయ అర్హత పరీక్ష కొన్ని సబ్జెక్టులకు మినహాయిస్తూ పాలకమండలి తీర్మానించింది. ఐసీఏఆర్ కొన్ని సబ్జెక్టులకు నిర్వహించకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌చార్జీ వీసీ మన్మోహన్‌సింగ్ తెలిపారు. విజయనగరం జిల్లా గరివిడికి మంజూరైన వెటర్నరీ కళాశాలను ఈ ఏడాది ఏర్పాటు చేయడంలేదని చెప్పారు. అవసరం అయిన మౌలిక వసతులు కల్పించి వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అనంతపురం జిల్లాలో గొర్రెల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. కర్నూలు జిల్లా బనవాసిలో గొర్రెలు, మేకల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు అనుమతించామన్నారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ కళాశాలల ఏర్పాటు అంశం కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ కారణంగా ఈ అంశంపై పాలకమండలిలో చర్చించలేదన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ సుధాకర్‌రెడ్డి, బోర్డు సభ్యులు కరుణానిధి, వేణుగోపాల్‌నాయుడు, శ్రావణ్‌కుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వెటర్నరీ యూనివర్సిటీ అధికారుల పదవీకాలం పెంపు
Published Tue, Jun 21 2016 8:12 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement