జిల్లాకు మరో యూనివర్శిటీ | Another University for the District | Sakshi
Sakshi News home page

జిల్లాకు మరో యూనివర్శిటీ

Published Wed, Oct 8 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

జిల్లాకు మరో యూనివర్శిటీ

జిల్లాకు మరో యూనివర్శిటీ

సాక్షి, ఒంగోలు: జిల్లాకు మరో యూనివర్శిటీ వచ్చింది. ఇప్పటికే జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ ప్రతిపాదనలు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా, ఇక్కడ్నే వెటర్నరీ యూనివర్శిటీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లా పర్యటనకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పర్చూరు, ఒంగోలు జన్మభూమి సభల్లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రకటించారు. ఒంగోలుగిత్త బ్రీడ్‌ను కాపాడేందుకు అన్నివిధాలా కృషి చేస్తామన్నారు. దొనకొండను ఇండస్ట్రియల్ సిటీగా మారుస్తామని, కనిగిరిలో జాతీయ పారిశ్రామికవాడతో పాటు రామాయపట్నం పోర్టు, ఒంగోలులో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చంద్రబాబు చెప్పారు.

వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేస్తామని, దాదాపు పూర్తిదశలో ఉన్న రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులను సద్వినియోగంతో ఆయకట్టుకు సరిపడా నీరిస్తామన్నారు.  కొత్తపట్నానికి నాలుగులైన్ల రహదారిని విస్తరించి అభివృద్ధిచేస్తామని, ఒంగోలులో మినీ, అవుట్‌డోర్ స్టేడియంల అభివృద్ధికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి సారించి ఎన్టీఆర్ సుజల పథకం కింద నీటిప్లాంట్లను నెలకొల్పుతామన్నారు. డ్వాక్రా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులతోపాటు, ఒంగోలులో మైసూర్‌పాక్, వేటపాలెం జీడిపప్పు వంటి రుచికరమైన ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు ‘ఇ-కామర్స్’ విధానం అమలు చేస్తానన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయాన్ని పెంచుతామని, స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో పైపులైన్‌ల ద్వారా గ్యాస్‌ను ఇంటింటికీ సరఫరా చేస్తామని, వాహనాలకు సీఎన్‌జీ గ్యాస్ అందిస్తామన్నారు.

‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమృలో చేపట్టిన ఏడు మిషన్‌లు, ఐదు గ్రిడ్‌ల కోసం సభల్లో ప్రత్యేకంగా వివరించారు. భవిష్యత్‌లో ఇంటింటికీ బ్రాడ్‌బ్రాండ్ ఇంటర్‌నెట్ సౌకర్యంతో పాటు విద్యార్థులకు ఐపాడ్‌లు, టాబ్‌లు అందించి పేదరికంపై గెలుపును సాధిస్తామని  చెప్పారు. పేదవిద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తెస్తామని.. దశలవారీగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మూసివేసి క్లస్టర్ పాఠశాలల ఏర్పాటుతో వాహనసదుపాయం కూడా సమకూరుస్తామన్నారు.

కూచిపూడి నాట్యం నేర్చుకున్న ప్రతి విద్యార్థినికి అదనంగా మార్కులు కలిపే ప్రతిపాదనపై ఆలోచిస్తామని, వచ్చేరోజుల్లో వివిధ అంశాల్లో పోటీతత్వ పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. తొలుత పర్చూరులోని స్థానిక వైఆర్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన ‘బడి పిలుస్తోంది రా..’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బడి బయటనున్న పిల్లలను గుర్తించి విద్యను నేర్పించడంలో ప్రకాశం జిల్లా ప్రథమస్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. నియోజకవర్గ చుట్టుపక్కలనున్న 73 పాఠశాలల నుంచి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో బాబు ముచ్చటించారు. వేదికపైన మాట్లాడిన చిన్నారుల వాగ్ధాటికి చంద్రబాబు ముచ్చటపడ్డారు. కార్యక్రమంలో అధికసమయం చిన్నారుల అభిప్రాయాలకే కేటాయించారు.

డ్రిప్,స్ప్రింక్లర్‌లతో సాగు ప్రోత్సాహం
పర్చూరులోని నాగులపాలెంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం కాస్తంత పేలవంగా సాగింది. ఒకరిద్దరు రైతుల మినహా అందరూ ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలే ఉండటంతో సమావేశ ఉద్దేశం పక్కదారి పట్టింది. తొలుత అక్కడ పత్తిపంటను సందర్శించి చేనుగల రైతులతో బాబు మాట్లాడారు. శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ పొలంపిలుస్తోంది కార్యక్రమంలో క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా తెలుసుకున్న అంశాలేంటని అడిగారు. ఈ సందర్భంగా శెనగరైతులు తమ బాధలను చెప్పుకున్నారు.  

40 వేల పోరంబోకు భూముల్లో ..
జిల్లాలోని 40 వేల పోరంబోకు భూముల్లో నీరు, చెట్టు పథకం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. నాగులపాలెం జన్మభూమి వేదికపై బాబు చేతులమీదుగా చెట్టుపట్టాలను కలెక్టర్ విజయకుమార్ అందించారు. ఇక్కడ సభాధ్యక్షత వహించిన స్థానిక సర్పంచి గంగాభవాని, ఎంపీటీసీ వాణి, జెడ్పీటీసీ ఉషారాణి తదితరులు కోరిన గ్రామసమస్యలపై బాబు సానుకూలంగా స్పందించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, నీరు - చెట్టు, డ్వాక్రారుణాలు, పింఛన్‌లపంపిణీ తదితర అంశాలపై తయారుచేసిన పాటల సీడినీ బాబు ఆవిష్కరించి.. ప్రతీ పాటను వేదికపై నుంచి జనాలకు వినిపించారు. వేదికపైన రూ.50కోట్ల రుణాల చెక్‌ను లబ్ధిదారులకు అందించారు.
 
రుణమాఫీ అమలుపై కట్టుడతా..
తమ్ముళ్లూ.. రుణమాఫీ అమలు సాధ్యం కాదన్నారు. ఆరునూరైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు విడతలవారీ మాఫీకి ప్రణాళిక రూపొందించాం. వందరోజులపాటు కేంద్రంతో మాట్లాడా.. ఆర్బీఐకి లేఖలు రాసా.. అన్నివైపుల నుంచి ప్రోత్సాహం కరువే.. నా సొంత ఆలోచనతో ‘రైతు సాధికారసంస్థ’ను నెలకొల్పాను. జిల్లాలో బాబు పర్యటన మంగళవారం అధికారిక షెడ్యూల్ సమయం కంటే గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. పర్చూరులోని మార్కెట్‌కమిటీ యార్డు ఆవరణలో హెలీప్యాడ్‌కు ఉదయం 10.30కి చేరుకోవాల్సి ఉండగా, మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు.

అక్కడ జిల్లామంత్రి సిద్దా రాఘవరావు, పర్చూరు, కనిగిరి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కదిరి బాబూరావు, మాజీ ఎంపీ కరణం బలరాంతో పాటు అధికార పార్టీ ప్రముఖులు ఆయనకు స్వాగతం పలకగా, అక్కడ్నుంచి బడిపిలుస్తోంది రా, పొలంపిలుస్తోంది, జన్మభూమి సభలు ముగిసేనాటికి సాయంత్రం ఐదుగంటలు దాటింది. అక్కడ్నుంచి ఒంగోలుకు చేరుకుని మినీస్టేడియం ఆవరణలో సభ ప్రారంభం సాయంత్రం ఏడుగంటలైంది. అన్నిచోట్ల జనాలతరలింపులో అధికారపార్టీ నేతలు విజయవంతం అయ్యారు. చంద్రబాబు రాత్రిబస స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథిగృహంలో చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement