సాక్షి, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో ఈనాడుకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. వర్సిటీల్లో బోధన పోస్టుల నియామకాల అంశం కోర్టులో ఉన్నంత కాలం ఒక్క పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయట్లేదని మొసలి కన్నీరు కార్చిన రామోజీ.. ఇప్పుడు ఒప్పంద ఉద్యోగులకు భద్రత లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అభూతకల్పనలు, అవాస్తవాలతో ఒప్పందం చేసుకుని విషపూరిత రాతలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఇందులో భాగంగానే ‘ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు జగన్ ఎసరు’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేశారు. దీనిని ఉన్నత విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో ఖండించింది.
3,295 పోస్టుల భర్తీ
ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రబాబు హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ బోధన సిబ్బంది నియామకాలు చేపడుతోంది. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని జీర్ణించుకోలేని రామోజీరావు ఒప్పంద ఉద్యోగులకు భద్రత కరువైందంటూ ఊహాజనిత వార్తను అచ్చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 20 వర్సిటీల్లో దాదాపు 3,046 మంది ఒప్పంద అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ ప్రోగ్రామ్‌లలో ఉన్నారు. వర్సిటీల్లో కొత్తగా చేపడుతున్న అధ్యాపక నియామకాలన్నీ రెగ్యులర్ పోస్టుల్లోనివే. అందువల్ల సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ ప్రోగ్రామ్‌లలో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బందీ లేదు.
వెయిటేజీతో భరోసా
వర్సిటీల్లో పోస్టుల భర్తీలోనూ ఒప్పంద అధ్యాపకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెయిటేజీ రూపంలో భరోసా కల్పించారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ వెయిటేజితో చాలా మంది ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్‌గా మారతారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది. అయితే వర్సిటీల్లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. చాలా వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించేటప్పుడు రిజిర్వేషన్ విధానాన్ని అవలంభించలేదు. రోస్టర్ పద్ధతిని పాటించలేదు.ఏ వర్సిటీ కూడా యూజీసీ నిర్దేశించిన పద్ధతుల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించలేదు.
కొన్ని వర్సిటీల్లో ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు పని చేస్తున్నారు, ఎవరు రెగ్యులర్ పోస్టులకు పని చేస్తున్నారో కూడా తెలియదు. ఆ వ్యత్యాసాన్ని పాటించలేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆమోదాన్ని పొందలేదు. వీటన్నింటీకి తోడు కోర్టు ఉత్తర్వులు వీరిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రతిబంధకాలుగా మారాయి. అంతేగానీ ఎవరికీ అన్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో పని చేస్తున్న పలువురు ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్ అవుతారు. మిగతా వారు ఇప్పుడున్నట్లుగానే కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతారు. ఎవరి ఉద్యోగాలకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పైగా కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెయిటేజీని ప్రస్తావిస్తుంటే వారి ఉద్యోగాలు పోతాయంటూ ఈనాడు దుర్మార్గపు రాతలు రాయడం సిగ్గుచేటు.
Comments
Please login to add a commentAdd a comment