హైదరాబాద్: మరో గంటలో పరీక్ష రాయాల్సిన ఓ వెటర్నరీ విద్యార్థి డ్రగ్స్ మత్తులో చేతి మనికట్టును కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మొదటిసారిగా వెటర్నరీ హాస్టల్‌లో మత్తు మందు వాడకం బహిర్గతం కావడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో వరంగల్‌కు చెందిన తరుణ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆనంద నిలయం హాస్టల్‌లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా తరుణ్ తోటి విద్యార్థులకు దూరంగా ఉంటూ.. తనకు కేటాయించిన గదిలో కాకుండా మరో గదిలో ఉంటున్నాడు. పరీక్షల సమయం కావడంతో అందులోని విద్యార్థులు మరో గదిలో చదువుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తరుణ్ గది లోపలి నుంచి గడియ వేసుకొని చేతి మనికట్టును బ్లేడ్‌తో కోసుకున్నాడు. 9.30 గంటల ప్రాంతంలో విద్యార్థులంతా పరీక్ష హాల్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తరుణ్ తలుపు తీయకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది, తోటి విద్యార్థులు అనుమానం వచ్చి బలంగా నెట్టి తలుపు తెరిచారు. తరుణ్ రక్తపుమడుగులో పడి ఉండటంతో ప్రిన్సిపల్‌కు సమాచారం అందించి నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ప్రేమలో విఫలం....
తరుణ్ ప్రేమ్‌లో విఫలమయ్యాడని తోటి విద్యార్థులు వెల్లడించారు. కొన్ని రోజులుగా మత్తుమందుకు అలవాటుపడ్డాడని, అనస్థీషియాకు ఇచ్చే జైలాజిన్ అనే డ్రగ్స్‌ను వాడుతున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఖాళీ సిరంజీలు, బాటిళ్లు రూమ్‌లో లభ్యమయ్యాయని వీటిని అధికారులకు అందించినట్లు తెలిపారు. డ్రగ్స్ మత్తులోనే తరుణ్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చన్నారు. కాగా కొన్ని రోజులుగా తరుణ్ తన గదిలో కాకుండా ఇతరుల గదుల్లో ఉన్నా రోజూ తనిఖీలు నిర్వహించే యాంటీ ర్యాగింగ్ టీమ్ పట్టించుకోలేదు. తరుణ్ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ మేరకు విద్యార్థులకు ఆదేశాలిచ్చారు. ఈ విషయమై సంప్రదించేందుకు యత్నించగా, కళాశాల రిజిస్ట్రార్‌తో పాటు ప్రిన్సిపల్, డీన్ ఫోన్‌లను స్వీచ్ ఆఫ్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment