బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ ఆనవాళ్లున్నాయనే అనుమానం
తనిఖీలు చేయకుండానే వెళ్లిపోయిన ‘పున్నీ’ షిప్
కేంద్ర స్థాయిలో అమాత్యుని బంధువు లాబీయింగ్
నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ ద్వారా ఒత్తిళ్లు
ఆగమేఘాలపై ఎగుమతులకు అనుమతి
ఆఫ్రికాలోని డక్కర్‌కు 40 వేల టన్నుల బ్రోకెన్ రైస్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆ ఓడ మనోళ్లదే.. వదిలేయండి. బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ బియ్యం ఎందుకు కలుస్తాయి? తనిఖీలు చేసి నిర్ధారించాల్సింది ఏముంటుంది? ఓడ పోర్టులో నిలిచిపోయి చాలా రోజులైంది. తక్షణం ఎగుమతికి అనుమతిచ్చి ఓడను వదిలేయండి’ అంటూ మూడు వారాలుగా కాకినాడ పోర్టులో నిలిపివేసిన నౌకకు కూటమి నేతలు ఆఘమేఘాలపై అనుమతిచ్చేశారు.
మంత్రిగారి బంధువుకు చెందిన ఎక్స్‌పోర్టు కంపెనీ తరలిస్తున్న బియ్యం ఇందులో ఉందని, అందువల్లే బ్రోకెన్ రైస్ కాబట్టి అందులో పీడీఎస్ బియ్యం కలవలేదని ఎలా నిర్ధారిస్తారన్న మిగతా ఎగుమతిదారుల ప్రశ్నలకు సమాధానం రాకుండానే ఆ నౌక విదేశాలకు తరలిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కేంద్రంలో చక్రం తిప్పిన మంత్రి
మరోపక్క మంత్రి బంధువుల కన్సైన్‌మెంట్లు ఉండటంతో బ్రోకెన్ రైస్ అంటూ కాకినాడ నుంచే పున్నీ నౌకను పంపించేశారు. ఆఫ్రికా ఖండంలోని డక్కర్ దేశానికి కాకినాడ పోర్టు నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఇటీవల కేంద్రం అనుమతించింది. ఈ ఎగుమతి హక్కులను పట్టాభి ఆగ్రోస్, కేఎన్ రిసోర్సెస్, మురళీమోహన్, సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి.
డక్కర్‌కు బ్రోకెన్ రైస్ ఎగుమతి కోసం ఎంవీక్యూ పున్నీ నౌక గత నెల 28న కాకినాడ వచ్చింది. అదే సమయానికి కాకినాడ పోర్టులో ఉన్న స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యంపై రాద్ధాంతం మొదలైంది. ఈ నౌకను పోర్టులో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పున్నీ నౌకను కూడా పోర్టులో మూడు వారాలుగా నిలిపివేశారు. ఈ నౌకను పంపించేయడానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఒక ఎక్స్‌పోర్టర్ నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ ద్వారా లాబీయింగ్ చేశారని సమాచారం.
ఇందుకోసం ఆయన తన బంధువైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కేబినెట్ మంత్రి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పినట్లు సమాచారం. సహజంగా రా రైస్ లేదా బ్రోకెన్ రైస్‌లో పోర్టిఫైడ్ రైస్‌లోని కేర్నల్స్ (పేదలకు పంపిణీ చేసే బియ్యంలో పౌష్టికాహారం కలిపే ప్రక్రియ) ఒక శాతం అనుమతిస్తారు. అంతకు మించి ఉంటే 6ఏ కేసు అవుతుంది. డక్కర్ దేశానికి ఎగుమతికి సిద్ధం చేసిన బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలిసి ఉండవచ్చుననే అనుమానంతో ఇన్ని రోజులూ నిలిపివేశారు. అయినా నౌకలో తనిఖీలు లేకుండా అనుమతివ్వడం పలు సందేహాలకు తావిస్తోంది.
పైగా, స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో గుర్తించిన పీడీఎస్ బియ్యం మొత్తం సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు ప్రైవేట్ లిమిటెడ్‌దేనని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ స్వయంగా ప్రకటించారు. పున్నీ నౌకలో బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఆర్డర్ పొందిన నాలుగు సంస్థలో సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు కూడా ఉంది. అటువంటప్పుడు బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలవలేదని ఎలా నిర్థారిస్తారని, కనీసం శాంపిళ్లు తీయకుండా, కెమికల్ టెస్ట్ చేయకుండా ఎగుమతికి ఎలా అనుమతిస్తారని ఎక్స్‌పోర్టర్లు ప్రశ్నిస్తున్నారు.
కాకినాడ పోర్టుపై నానాయాగీ
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిపోతోందంటూ కాకినాడ పోర్టులో యాగీ ప్రారంభించారు. రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి నుంచి విదేశాలకు తరలించేసి కోట్లు కొల్లగొట్టేశారని గత ప్రభుత్వంపై విషం చిమ్మారు.
ఆఫ్రికా ఖండానికి స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయని, సినిమా స్టైల్‌లో ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ పెద్ద బిల్డప్పే ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి నాదెండ్ల విశాఖ పోర్టుకు వెళ్లి, అక్కడ కూడా పీడీఎస్ బియ్యం తరలిపోతోందంటూ హడావుడి చేశారు. అయితే, ఆ బియ్యం టీడీపీ నేతల అనుచరులదేనని తెలియడంతో మారు మాట్లాడలేదు.
Comments
Please login to add a commentAdd a comment