
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వరదలు భాగ్యనగరాన్ని ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. భారీ వరదల నేపథ్యంలో బండ్ల గూడ చెరువు నిండిపోయింది. దీంతో అయ్యప్ప కాలనీ మునిగిపోవడంతో బండ్ల గూడ చెరువుకి గండి కొట్టడానికి అయ్యప్ప కాలనీ వాసులు వచ్చారు. అయితే గండికొడితే చెరువు కింద ఉన్న ఆరు కాలనీలు మునిగిపోతాయంటూ పలు కాలనీ వాసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఎల్బీనగర్ నగర్ పోలీసుల సహాయంతో వారు చెరువుకు గండికొడుతున్నారంటూ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ విషయంపై నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ మాట్లాడతూ, భాగ్యనగరంలో 185 చెరువులు ఉన్నాయని, చెరువులు అన్ని ఓవర్ ఫ్లో అవుతున్నాయని తెలిపారు. ఆక్రమణల జోలికి వెళ్లడం లేదని వెల్లడించారు. సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో 15 టీమ్స్ ఏర్పాటు చేశామని, జోనల్ కమిషనర్ స్థాయి అధికారికి చెరువుల మరమ్మతుల కోసం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసే అధికారం ఇచ్చినట్లు ప్రకటించారు. అక్కడికక్కడే చెరువుల మరమ్మతులు చేసేలా ఆదేశాలు జారీచేశామన్నారు. 53 చెరువులు ప్రమాదకరంగా ఉన్నాయని, మరమ్మతులు పనులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయిస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు.
చదవండి: శాంతించవమ్మా.. గంగమ్మా