ఎట్టకేలకు కదిలారు
ఎట్టకేలకు కదిలారు
Published Thu, Jun 15 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM
- స్పందించిన నీటిపారుదల అధికారులు
- పంట కాలువలకు నీటి విడుదల
- ‘సాక్షి’ ఎఫెక్ట్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలు నీటిపారుదల శాఖలో కదలిక తెచ్చాయి. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి కాలువలకు సాగునీరు విడుదల చేయకుండా క్లోజర్ పనులు చేస్తున్న తీరుపై ‘సస్యశ్యామలంపై స్వార్థపు నీడ’, ‘ముందస్తు నీరు.. అందని తీరు’ శీర్షికలతో ఈ నెల 7, 10 తేదీల్లో ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. అమాత్యులు, వారి బంధుగణం, వందిమాగదులు వ్యక్తిగత స్వార్థంతో సామర్లకోట గోదావరి కాలువ, అమలాపురం - చల్లపల్లి, ఎదుర్లంక - కొమరగిరి, శానపల్లిలంక తదితర పలు పంట కాలువలకు సాగునీరు విడుదల చేయకుండా అడ్డుకట్టలు వేసి మరీ క్లోజర్ పనులు చేసుకుంటున్నారు. రైతులు ఎలా పోయినా ఫర్వాలేదు తమ పనులు పూర్తయిపోవాలనుకుంటున్న అధికార పార్టీ నేతలు, వారి వందిమాగదులు, కాంట్రాక్టర్ల స్వార్థాన్ని ఫొటోలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘సాక్షి’ కథనాలు ప్రచురితమయ్యాక రైతుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు రావడంతో అధికారులు భయపడ్డారు. వాస్తవానికి ఈ ఖరీఫ్‌లో వారం రోజులు ముందుగానే పంటకాలువలకు నీటిని విడుదల చేశామమని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా ప్రకటించుకుని ఎక్కడికక్కడ ఏరువాక కూడా ఆర్భాటంగా చేపట్టారు. తీరా ఏరువాకకు సహితం పలు ప్రాంతాల్లో సాగునీరు లేకపోవడం, అదే సమయంలో ‘సాక్షి’ కథనాలు ప్రచురితమవ్వడంతో నాలుగు రోజుల క్రితమే అమలాపురం - చల్లపల్లి పంటకాలువకు నీరు విడుదల చేశారు. సామర్లకోట కెనాల్‌లో చేపడుతున్న వంతెన పనుల్లో ఒక అమాత్యుని కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉందనే ఉద్దేశంతో అధికారులు కూడా కిమ్మనకుండా ఉండిపోయారు. సామర్లకోట కెనాల్‌లో వంతెన పనులు ఇంకా కొలిక్కి రాలేదు. మరోపక్క ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, తిళ్లకుప్ప గ్రామాల రైతులు పంట విరామ హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో సమస్య జటిలమవుతుందన్న ఆందోళనతో ఇరిగేషన్ అధికారులు గురువారం జిల్లాలోని పలు పంటకాలువలకు నీరు విడుదల చేశారు. ప్రధానంగా రూ.2.50 కోట్లతో పనులు జరుగుతున్న సామర్లకోట పంటకాలువకు సహితం నీరు విడుదల చేశారు. సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల్లో ప్రజలకు దాహార్తి తీరడంతోపాటు, పిఠాపురం బ్రాంచి కెనాల్, కాకినాడ రూరల్‌లో ఆయకట్టులో నీటి విడుదలకు సహకరించిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement