డిజైన్లే ఆమోదం కాలేదు
డిజైన్లే ఆమోదం కాలేదు
Published Wed, Sep 20 2017 12:06 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
కీలక పనులకు దొరకని ఆమోదం
పోలవరం పనులు నత్తనడక
2018 జూన్‌కు నీరు ప్రశ్నార్థకమే
సాక్షి ప్రతినిధి, ఏలూరు
2018 జూన్ నాటికి గ్రావిటీపై కుడి, ఎడమ కాల్వలకు నీరు ఇస్తాం. దీని కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. అందుకే 19 సార్లు ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం వచ్చాను. 40 సార్లు అమరావతి నుంచి రివ్యూ చేశాను.... ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా చేసిన ప్రకటన.
అయితే ఇప్పటికీ 21 కీలకమైన పనులకు సంబంధించి డిజైన్లకు సెంట్రల్ వాటర్ కమిటీ (సీడబ్ల్యుసీ) నుంచి ఆమోదం రాలేదు. డిజైన్లు రాకుండా పనులు చేపట్టడం సాధ్యం కాదు. సాంకేతిక ఇబ్బందుల వల్ల డిజైన్లు రావడంలో జాప్యం జరుగుతోంది. అసలు డిజైన్లే ఆమోదం పొందకుండా షెడ్యూల్ టైంలో ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారన్నది ప్రశ్నగా మారుతోంది. ప్రాజెక్టులో ప్రధానమైన స్పిల్‌వేకు సంబంధించి కూడా కొన్ని బ్లాక్‌లకు సంబంధించిన డిజైన్లకు ఆమోదం రాలేదు. స్పిల్‌వే పూర్తి అయితేగాని గేట్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండదు. స్పిల్‌వే పనులు ప్రస్తుతం జరుగుతున్న వేగంతో చూస్తే వచ్చే డిసెంబర్ 31కి పూర్తి చేయడం అసాధ్యంగా కనపడుతోంది. స్పిల్‌వేకి 11.61 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ కేవలం 2.06 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ మాత్రమే పూర్తి అయ్యింది. ఇంకా 9.55 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయాల్సి ఉంది. ప్రధానమైన ఈ పనికి సంబంధించే సుమారు తొమ్మిది డిజైన్లు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. స్పిల్‌వే బ్లాక్2కు సంబంధించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్, సీఐఎఫ్‌ఆర్‌ఐ ఇచ్చిన నివేదికలను ఫైనల్ డిజైన్ కోసం పంపించారు. స్పిల్‌వే డీపర్ బ్లాక్26 కోసం పంపిన ప్రతిపాదనలు సీడబ్ల్యుసీ వద్ద పరిశీలనలో ఉన్నాయి. స్పిల్‌వేకు సంబంధించి సైడ్‌స్లోప్‌కు సంబంధించి జియలాజికల్ సర్వే, డిజైన్లు, రక్షణ చర్యలు ఎలా తీసుకోవాలనేదానికి సంబంధించి న్యూఢిల్లీకి చెందిన ఈజిఈ కన్సల్టెంట్ తయారు చేస్తోంది. వీటిని బుధవారం సీడబ్ల్యుసీకి అందచేయాల్సి ఉంది. బ్లాక్50 డిజైన్లు సీడబ్ల్యుసీ పరిశీలనలో ఉన్నాయి. స్పిల్‌వేపైన నిర్మించే బ్రిడ్జికి సంబంధించిన డిజైన్లు ఢిల్లీకి చెందిన ఐసిసిఎస్ సంస్థ తయారు చేస్తోంది. డ్రైనేజి, సంప్‌వెల్ ఇతర ప్రతిపాదనలు సీడబ్ల్యుసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. స్పిల్‌వే కుడి, ఎడమ అబట్‌మెంట్స్ (ఆసరా కోసం నిర్మించే దిమ్మెలు), డివైడ్ వాల్స్, ట్రైనింగ్ వాల్స్ ఇంకా అమోదం పొందాల్సి ఉంది. రివర్ స్లూయిజ్ గేట్లకు సంబంధించి సీడబ్ల్యుసీ చేసిన సూచనలకు అనుగుణంగా రివైజ్డ్ డిజైన్ అనుమతి సీడబ్ల్యుసీ వద్ద పెండింగ్‌లో ఉంది. స్పిల్‌వేలో ఏర్పాటు చేయాల్సిన రేడియల్ గేట్స్‌ను అమర్చేందుకు కాంట్రాక్ట్ సంస్థ చెబుతున్న హైడ్రాలిక్ పద్ధతిపై సీడబ్ల్యుసీ కొన్ని వివరణలు కొరింది. ఇవి సమర్పించిన తర్వాత డిజైన్లు ఇస్తారు. ఇవి కాకుండా స్పిల్‌ఛానల్‌కు సంబంధించి, కాఫర్ డ్యాంకు సంబం«ధించి ప్రొఫెసర్ రమణ, ఫ్రొఫెసర్ రాజుల బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటన్నింటిని ముఖ్యమంత్రి వచ్చేవారం ఢిల్లీ పర్యటనలో కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు డిజైన్లు ఆమోదం పొందాల్సి వస్తుందని, అందువల్ల కొంత జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ డిజైన్లన్నీ సకాలంలో అమోదం పొందితేనే పనులు ముందుకు వెళ్తాయని, లేకపోతే జాప్యం తప్పదని చెబుతున్నారు.
Advertisement
Advertisement