రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ రామేశ్వరరావు ఇతర నిపుణులు
రాయదుర్గం: పట్టణ ప్రాంతాల్లో నిత్యం నాలాలు, వరద నీటి కాలువలను శుభ్రం చేసే అంశంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి చారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఫ్లడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ‘ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ అండ్ మేనేజ్‌మెంట్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ... ప్రస్తుతం పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో రోడ్లపైకి మురుగునీరు, వర్షపునీరు రాకుండా శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్షపు నీటిని చాలా వరకు భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని కూడా పేర్నొన్నారు. అన్ని విభాగాల వారు సమష్టిగా చర్యలు చేపడితే దాదాపు అన్ని సమస్యలు తీరేందుకు అవకాశం ఉంటుందన్నారు.
తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలిస్తే వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తే చాలా వరకు సమస్యలు తీరేందుకు ఆస్కారం ఉందన్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కరుణాగోపాల్, రీ సస్టేనబిలిటీ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పి.జి.శాస్త్రి, జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ కె.కిషన్, జేఎన్‌టీయూఏ వాటర్ రిసోర్సెస్ హెచ్‌ఓడీ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.గిరిధర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.గోపాల్‌నాయక్, సిటీ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నర్సింగ్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment