నీళ్లొస్తాయ్
నీళ్లొస్తాయ్
Published Tue, Apr 18 2017 1:44 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
కొవ్వూరు/నిడదవోలు/భీమవరం : జిల్లాలోని కాలువలకు నీటి విడుదలను మరో రెండు రోజులు పొడిగించారు. వాస్తవంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి కాలువలను మూసివేయాలని నిర్ణయించారు. అయితే, వరి కోతలు పూర్తికాకపోవడం, శివారు ప్రాంతాల్లోని తాగునీటి చెరువులు నిండకపోవడంతో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి నది నుంచి మరో రెండు రోజులపాటు నీరివ్వాలని నిర్ణయించారు. బ్యాంక్ కెనాల్ పరిధిలోని వడ్డిలంక కాలువ ద్వారా మంచినీటి చెరువుల్ని నింపాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే 80 శాతంపైగా చెరువులను నీటితో నింపామని, రానున్న రెండు రోజుల్లో అన్ని చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. పశ్చిమ డెల్టాకు ప్రస్తుతం 4,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు నీటి విడుదలను నిలిపివేస్తారు. తిరిగి జూన్ 1వ తేదీన విజ్జేశ్వరంలోని గోదావరి హెడ్ స్లూయిస్ తలుపులు తెరుస్తారు.
రొయ్యల చెరువులకు తరలించడంతో సమస్య
ఎన్నడూ లేనివిధంగా ఈసారి రొయ్యలు, చేపల చెరువులకు నీటిని పెద్దఎత్తున తోడుకోవడంతో జిల్లాలోని మంచినీటి చెరువులకు కొరత ఏర్పడింది. రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు బడా వ్యక్తులు ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్ల సాయంతో కాలువల్లోని నీటిని ఆక్వా చెరువుల్లో తోడుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు, సెంట్రల్ డెల్టాలకు ఈనెల 10వ తేదీన కాలువల్ని మూసివేశారు. అదే రోజున పశ్చిమ డెల్టాకూ నీటి విడుదలను నిలిపివేయాల్సి ఉండగా.. చేలు, చెరువులకు వెళ్లాల్సిన నీటిని చేపలు, రొయ్యల చెరువులకు మళ్లించారు. దీంతో మంచినీటి చెరువులు నిండలేదు. ఈ నేపథ్యంలో కాలువల మూసివేతను మరో వారం రోజులపాటు పొడిగించి.. సోమవారం సాయంత్రం 6 గంట లకు నీటి విడుదలను నిలిపివేయాలని భావించారు. అయినప్పటికీ మంచినీటి చెరువులు నిండకపోవడం, శివారు ప్రాంతాల్లో వరి చేలు కోత దశకు చేరుకోకపోవడంతో మరో రెండు రోజులపాటు నీటి విడుదలను పొడిగించక తప్పలేదు. అయినా.. మంచినీటి చెరువులు పూర్తిగా నిండుతాయో లేదోననే అనుమానాలు నెలకొన్నాయి.
Advertisement