అడవిదేవులపల్లి చెరువులో నిండుగా ఉన్న నీరు
సాక్షి, అడవిదేవులపల్లి :మూడేళ్లుగా చెరువు కింద బీడుగా మారిన పొలాలు నేడు పంటలతో కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువు నిండా జలకళ ఏర్పడి, తాగు, సాగుకు ఎంతో ఉపయుక్తంగా మారడంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని భాస్కర్‌రావు చెరువు 111.26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈచెరువు కింద 72 ఎకరాల వరిసాగు అవుతోంది. దశాబ్దాలుగా చెరువు నిండా మట్టి పూడిక ఏర్పడి అరకొరగానే నీల్లు నిలుస్తున్నాయి.
దీంతో మూడేళ్లుగా చెరువు కింద ఉన్న భూములన్నీ బీళ్లుగా మారాయి. మిషన్ కాకతీయ పథకం కింద ప్రభుత్వం ఈచెరువుకు రూ.51లక్షలు మంజూరు చేసింది. ఈనిధులతో చెరువు పూడికను తీసి ఆమట్టిని రైతులు తమ పొలాల్లో పోయించుకున్నారు. చెరువు మట్టికట్ట, రోలింగ్ చేశారు. తూముల మరమ్మతులు చేశారు. దీంతో చెరువు నిండి జలకళ ఏర్పడింది.
చేతికి వస్తున్న పంటలు
చెరువులో పుష్కలంగా నీరు ఉండడంతో రబీ సీజన్‌లో ఆలస్యంగానైనా రైతులు సాగు చేశారు. చెరువుల్లో నీళ్లు ఉన్నాయన్న భరోసాతో చెరువు కింద ఉన్న భూములన్నీ వరి సాగు చేశారు. రైతుల నమ్మకం వమ్ముకాలేదు. సీజన్ పొడవునా చెరువులో నీరు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. వరి పంటలు చేతి కొస్తున్నాయి.
చెరువు కింద సాగు చేసిన భూముల్లో వరి కోతలు ప్రారంభించారు. చెరువులో నీరు వృథాగా పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, చేపల వేటకు సైతం పడవలు, వలలే ఉపయోగించాలని రైతులు కోరుతున్నారు.చెరువులో జలకళ ఈవిధంగానే కొనసాగితే గ్రామంలో సాగుతో పాటుగా తాగునీటికి కూడా ఇబ్బంది ఉండదన్న అబిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
ఆనందంగా ఉంది
నాకు చెరువు కింద మూడు ఎకరాల పొలం ఉంది. చెరువులో నీరు లేకపోవడంతో గత మూడేళ్లుగా పొలాలను బీల్లుగానే ఉంచాం. మిషన్ కాకతీయ పథకంతో చెరువులో పూడిక తీయడం వలన భారీగా నీరు చేరింది. దీంతో వరి సాగు చేశాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా పంట చేతికి వచ్చింది.
– మంత్రాల అశోక్‌రెడ్డి, రైతు
Comments
Please login to add a commentAdd a comment