mission bhaghiratha
-
నాడు వెలవెల.. నేడు జలకళ
సాక్షి, అడవిదేవులపల్లి :మూడేళ్లుగా చెరువు కింద బీడుగా మారిన పొలాలు నేడు పంటలతో కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువు నిండా జలకళ ఏర్పడి, తాగు, సాగుకు ఎంతో ఉపయుక్తంగా మారడంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని భాస్కర్‌రావు చెరువు 111.26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈచెరువు కింద 72 ఎకరాల వరిసాగు అవుతోంది. దశాబ్దాలుగా చెరువు నిండా మట్టి పూడిక ఏర్పడి అరకొరగానే నీల్లు నిలుస్తున్నాయి. దీంతో మూడేళ్లుగా చెరువు కింద ఉన్న భూములన్నీ బీళ్లుగా మారాయి. మిషన్ కాకతీయ పథకం కింద ప్రభుత్వం ఈచెరువుకు రూ.51లక్షలు మంజూరు చేసింది. ఈనిధులతో చెరువు పూడికను తీసి ఆమట్టిని రైతులు తమ పొలాల్లో పోయించుకున్నారు. చెరువు మట్టికట్ట, రోలింగ్ చేశారు. తూముల మరమ్మతులు చేశారు. దీంతో చెరువు నిండి జలకళ ఏర్పడింది. చేతికి వస్తున్న పంటలు చెరువులో పుష్కలంగా నీరు ఉండడంతో రబీ సీజన్లో ఆలస్యంగానైనా రైతులు సాగు చేశారు. చెరువుల్లో నీళ్లు ఉన్నాయన్న భరోసాతో చెరువు కింద ఉన్న భూములన్నీ వరి సాగు చేశారు. రైతుల నమ్మకం వమ్ముకాలేదు. సీజన్ పొడవునా చెరువులో నీరు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. వరి పంటలు చేతి కొస్తున్నాయి. చెరువు కింద సాగు చేసిన భూముల్లో వరి కోతలు ప్రారంభించారు. చెరువులో నీరు వృథాగా పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, చేపల వేటకు సైతం పడవలు, వలలే ఉపయోగించాలని రైతులు కోరుతున్నారు.చెరువులో జలకళ ఈవిధంగానే కొనసాగితే గ్రామంలో సాగుతో పాటుగా తాగునీటికి కూడా ఇబ్బంది ఉండదన్న అబిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఆనందంగా ఉంది నాకు చెరువు కింద మూడు ఎకరాల పొలం ఉంది. చెరువులో నీరు లేకపోవడంతో గత మూడేళ్లుగా పొలాలను బీల్లుగానే ఉంచాం. మిషన్ కాకతీయ పథకంతో చెరువులో పూడిక తీయడం వలన భారీగా నీరు చేరింది. దీంతో వరి సాగు చేశాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా పంట చేతికి వచ్చింది. – మంత్రాల అశోక్‌రెడ్డి, రైతు -
మిషన్ భగీరథ నీళ్లొచ్చాయ్..
సాక్షి, కేటీదొడ్డి: ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించాలనే సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరథ నీళ్లు వచ్చేశాయ్.ప్రధాన పైపులైన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.నల్లా కనెక్షన్ల ద్వారా మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గువ్వలదిన్నె తదితర గ్రామాల్లో తాగునీరు చేరింది.అలాగే కేటీదొడ్డి మండలంలోని తండాల్లో పనులు పూర్తికావడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లతో తాగునీరు ఇచ్చి తీరుతానని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. వేసవికాలం వస్తే చాలు ప్రతి సంవత్సరం ప్రజలు గ్రామశివారులోని పొలాల నుంచి తాగునీరు తెచ్చుకునేవారు. మిషన్ భగీరథ నీరు రావడంతో నీటికోసం పొలాల్లో బోరుబావులను ఆశ్రయించాల్సిన పనితప్పింది. పలు గ్రామాల్లో తాగునీరు మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గు వ్వలదిన్నె తదితర గ్రామాల్లో ఇప్పటికే పనులు పూర్తయి నల్లాల ద్వారా తాగునీరు కూడా వస్తుంది. నూతనంగా గ్రామపంచాయతీలుగా ఏర్పడిన పైజారితాండా, తూర్పుతండా గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు అంతా పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లాలు కూడా బిగించారు. తండాలో గతంలో కిలో మీటర్ దూరం నుంచి తాగునీరు తెచ్చుకునే వారు. ఇప్పుడు నల్లా కనెక్షన్ల ద్వారా ఆ సమస్య తీరనుందని గ్రామస్తులు, తండవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గువ్వలదిన్నెలో దాదాపు నల్లా కనెక్షన్ పూర్తియ్యాయి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు వేసవికా లంలో కూడా పుష్కలంగా మిషన్ భగీరథ నీటిని తాగుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామానికి ఇబ్బంది లేదు గత సంవత్సరం నుంచి మా గ్రామానికి తాగునీటికి ఎలాంటి సమస్య లేదు. 6 నెలల నుంచి మిషన్ బగీరథ ద్వారా తాగునీరు వస్తుంది. దీంతో తాగునీటి ఇబ్బందులు తీరాయి. ఎండాకాలంలో కూడా నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారు. – అంజనమ్మ, కొండాపురం -
తప్పనున్న నీటి తిప్పలు
సాక్షి, దామరచర్ల : మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు దృష్టి సారిస్తోంది. మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా ఈనెల చివరినాటికి అన్ని గ్రామాలకు నీరు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అప్పటిలోగా తాగునీటి సమస్య తీర్చేందుకు ట్యాంకర్లు వినియోగించనున్నారు. వేసవి వచ్చిందంటే చాలు దామరచర్ల మండల ప్రజల్లో తాగునీటి వెతలు తప్పడం లేదు. ఈఏడాది వేసవి ప్రారంభంలోనే నీటి సమస్య ఎదురైంది. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు పోయడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సమస్యలపై అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. నెలాఖరులోగా మిషన్ భగీరథ నీరు దామరచర్ల మండలంలో ఈనెల చివరి నాటికి అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పనుల వేగాన్ని పెంచారు. మండలంలో మిషన్ భగీరథ పనులకు రూ.25.40 కోట్లు మంజూరయ్యాయి. మండలంలో మొత్తం 71 ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 36 పూర్తయ్యాయని, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మండలంలోని 53 ఆవాస గ్రామాల్లో అంతర్గత పైప్లైన్లు వేస్తున్నారు. ఇప్పటికే 49 గ్రామాల్లో పూర్తయ్యాయని, మరో వారంలోగా మిగిలిన 4 గ్రామాల్లోనూ పైపులైన్లు పూర్తికానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీలున్నచోట్ల మరమ్మతులు చేయించి, ఈనెల చివరిలోగా అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ బ్రహ్మం బాబు చెబుతున్నారు. ట్యాంకర్ల ద్వారానీటి సరఫరా మండల ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. దామరచర్ల మండల కేంద్రంలోని ఎర్రనామ్, వీరభద్రాపురం ప్రాంతాలతో పాటుగా తాళ్లవీరప్ప గూడెం, నర్సాపురం, కేశవాపురం, గాంధీనగర్, కల్లేపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. దామరచర్ల, తాళ్లవీరప్ప గూడెంలలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి సమస్యలున్న మిగిలిన గ్రామాల్లో సైతం ప్రజలు ఇబ్బందులు పడకుండా నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలిస్తున్నారు. అవసరమైన చోట్ల రైతుల బోర్లను అద్దెకు తీసుకొని ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. భూగర్భజలాలు పెంచేందుకు చెరువులు నింపాలని ప్రజలు కోరుతున్నారు. -
భగీరథ ముహూర్తం మే 15
పరిగి: మే 15న ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందిస్తామని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. పరిగి మండలం జాపర్‌పల్లి శివారులో మిషన్ భగీరథ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటుతో పాటు నిర్మాణంలో పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న చోట కొందరు రైతులు తమ పొలాలు ఉన్నాయని కాంట్రాక్టర్‌కు అడ్డుతగలడంతో ఆ ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. భూములు ప్రైవేటువైనా, ప్రభుత్వానివైనా పనులకు అడ్డు తగులొద్దని సూచించారు. పనులు సజావుగా జరిగేలా చూడాలని తహసీల్దార్ అబీద్అలీని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయన ఇంజనీర్లతో మాట్లాడారు. పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని తెలిపారు. ఏప్రిల్ మాసంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. అనంతరం మే 15వ తేదీన ఇంటింటికి తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మిషన్ భగీరథలో భాగంగా జిల్లాలోని పరిగి, తాండూరు, కొడంగల్, వికారాబాద్ నియోజకవర్గాల్లోని 1050 గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందజేస్తామని వివరించారు. ఇందుకోసం అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. పరిగి మండలం జాపర్‌పల్లి శివారులో 135 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ ఫర్ డే) సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంటులో శుద్ధిచేసి ఇంటింటికి తాగు నీరందిస్తామని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అబీద్‌అలీ, ఎంపీడీఓ విజయప్ప, ఇంజనీర్లు పద్మలత, నరేందర్, బాబు, శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ లాల్‌కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. -
మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీరు
మాచిరెడ్డిపల్లి (అర్వపల్లి) : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లానీరు అందించేందుకు రూ.40వేల కోట్లతో మిషన్ భగీరథ పనులను ప్రభుత్వం నిర్వహిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని మాచిరెడ్డిపల్లిలో రూ.21లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కానుందని చెప్పారు. 2017 డిసెంబర్ తర్వాత మల్లన్నసాగర్ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలో 1.20లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ రెండోదశ నుంచి గోదావరి జలాలను అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ పాశం విజయయాదవరెడ్డి, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, గుండగాని అంబయ్యగౌడ్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ శిరీష, సర్పంచ్‌లు శీల స్వరూప, మామిడి రమణమ్మ, మన్నె లక్ష్మినర్సు, ఎంపీటీసీలు మంగమ్మ, బొడ్డు రామలింగయ్య, యారాల రాంరెడ్డి, కళ్లెట్లపల్లి శోభన్‌బాబు, వెంకటబిక్షం, ఉప్పలయ్య, తోట భిక్షం, సోమేష్ తదితరులు పాల్గొన్నారు.