
అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలలోని నల్లమల అడవులలో వ్యాపించి ఉన్న కొండల వరుసను వెలుగొండలు అంటారు. ఈ కొండల శ్రేణిలో మధ్య ఖాళీ స్థలంలో వున్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే మూడు గ్రామాల దగ్గర గోడలలాగ ఆనకట్టలు కట్టి సుమారు 20 కి.మీ. పొడవైన సహజమైన ‘నల్లమల సాగర్’ రిజర్వాయర్ నిర్మించి, కృష్ణా నదిలో 43.5 టీఎమ్‌సీ వరద నీటిని కొల్లంవాగు సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించి నల్లమల సాగర్ రిజర్వాయర్‌లో నిల్వ చేయాలని ప్రతిపాదించారు.
తొలుత ఈ ప్రాజెక్టును ‘వెలిగొండ ప్రాజెక్టు’ అని పిలిచారు. జలయజ్ఞంలో భాగంగా 2004 అక్టోబరు 27న మార్కాపురానికి 15 కి.మీ. దూరంలో గొట్టిపడియ దగ్గర నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని ‘కొల్లం వాగు’ వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జల వనరుల శాఖ చేపట్టింది.
1994 డీపీఆర్‌పై ఆధారపడిన మొదటి దశ ప్రతిపాదనలో 10.7 టీఎమ్‌సీ నీటిని 45 రోజులలో 7 మీటర్ల వ్యాసం, 85 క్యుమెక్స్ సామర్థ్యం గల సొరంగం కాలువ ద్వారా తరలించాలని తలపెట్టారు. రెండవ దశ పనులలో భాగంగా 9.2 మీటర్ల వ్యాసం, 243 క్యుమెక్స్ సామర్థ్యం గల రెండవ సొరంగ కాలువ జతచేయబడటం వలన 30 రోజుల వరద నీటితోనే జలాశయం నిండే అవకాశం ఏర్పడింది. మార్కాపురం, యర్రగొండ పాలెంల నుంచి పలు సార్లు శాసనసభ్యునిగా గెలిచి ప్రకాశం జిల్లాతో పాటు మరికొన్ని కరువు ప్రాంతాలకు సాగు నీరు, త్రాగునీరు అందించడానికి పోరాటం చేసిన పూల సుబ్బయ్య పేరు మీద ఈ ప్రాజెక్టుకు ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ అనే పేరు పెట్టారు.
వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పనులను పరుగులెత్తించారు. 2020లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్ట్ తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడమే కాక, కొండంత అవినీతి జరిగింది.
వెలిగొండ మొదటి సొరంగంలో ఈపీపీ పద్ధతిలో అప్పగించిన పనులను ఆలస్యంగా చేస్తు న్నారనే నెపంతో 2018 ఆగస్టులో 3.6 కి.మీ. పనులను ఎల్‌ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో కొత్త కాంట్రాక్టరుకు అప్పగించడం వలన రూ. 49.49 కోట్లు దుర్వినియోగం కాగా, వైఎసార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వలన ప్రభుత్వ ఖజానాకు రూ. 61.67 కోట్లు మిగిలిందని కాగ్ నివేదిక పేర్కొంది.
ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో 6.686 కి.మీ (మొదటి సొరంగం 4.331 కి.మీ. రెండవ సొరంగం 2.355 కి.మీ.) తవ్వకం పని మాత్రమే జరిగింది. కాగా వైఎస్సార్, జగన్‌ల పాలనా కాలంలో 31 కిలోమీటర్ల దూరం తవ్వకం జరగడం గమనార్హం. టీడీపీ ప్రభుత్వం అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టరుకు పనులు అప్పగించినా కాంట్రాకరుకు లబ్ధి, ఖజా నాపై భారం పడిందే కానీ పని వేగం మాత్రం పెరగలేదనేది కాదనలేని సత్యం.
ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నల్లమల సాగర్ నుంచి ఐదు కాలువల ద్వారా నీటిని నెల్లూరు జిల్లా ఉదయగిరి, కడప జిల్లా బద్వేల్, ప్రకాశం జిల్లాలో కరవు ప్రాంతా లకు మొత్తం 30 మండలాలలోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4,49,000 ఎకరాలకు సాగు నీరు అందించాలన్న స్వర్గీయ డా‘‘ వైఎస్‌ఆర్ లక్ష్యం నెరవేరుతుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం జిల్లా లోని 23 మండలాలకు చెందిన 3.36 లక్షల ఎకరాలకూ, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకూ, కడప జిల్లా లోని రెండు మండలాలకు చెందిన 29 వేల ఎకరాలకూ ఆయకట్టుకు సాగు నీరు, 30 మండ లాల్లోని కరువు పీడిత ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వచ్చమైన త్రాగునీటి సౌకర్యం లభిస్తుంది.
తండ్రి ఆశయాలను సాకారం చేసిన తన యునిగా, కరవు ప్రాంతాలకు నీరు అందించిన భగీరథునిగా జగన్ ప్రజల మన్ననలు పొందేందుకు మార్చి 5వ తేదీన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేయడం మలి అడుగుగా భావించాలి.
లింగమనేని శివరామ ప్రసాద్
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
మొబైల్: 79813 20543