
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులు, చేతివృత్తిదారుల జీవనోపాధి అవకాశాలను మెరుగుపర్చడం మాటేమోగానీ తన సన్నిహితుడికి మాత్రం భారీ ప్రయోజనం కల్పించడంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సఫలమయ్యారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పథకానికి తన సన్నిహితుడైన వ్యక్తి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంస్థను కన్సల్టెన్సీగా ఎంపిక చేయడంతోపాటు భారీగా మొబిలైజేషన్ అడ్వాన్సులు సైతం చెల్లించేందుకు సిద్ధం కావడం వెనుక గూడుపుఠాణీ జరిగినట్లు భావిస్తున్నారు.
కన్సల్టెన్సీగా మంత్రి ఉమా సన్నిహితుడి సంస్థ
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, జీవనోపాధుల అభివృద్ధి పథకం(ఏపీఐఎల్‌ఐపీ) రెండో దశ అమలుకు రూ.రెండు వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు తన సన్నిహితుడు డైరెక్టర్‌గా ఉన్న ‘నిప్పాన్ కోయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థను కన్సల్టెన్సీగా ఎంపిక చేసేలా మంత్రి దేవినేని ఉమా చక్రం తిప్పారు. కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.61.24 కోట్లను ఆ సంస్థకు చెల్లించనున్నారు. ఎక్కడా లేని రీతిలో ఈ సంస్థకు అడ్వాన్సుగా రూ.3.06 కోట్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఉన్నతాధికారవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కన్సల్టెన్సీకి అడ్వాన్సు కింద నిధులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
గ్లోబల్ టెండర్ల నిబంధన తుంగలోకి..
ఈ ప్రాజెక్టు అమలుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గ్లోబల్ టెండర్ల ద్వారా కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని జైకా నిబంధన విధించింది. కానీ మంత్రి దేవినేని ఉమా ఆదిలోనే ఈ పథకానికి గండి కొట్టారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్ టెండర్లను నీరుగార్చి తన సన్నిహితుడు డైరెక్టర్‌గా ఉన్న సంస్థను కన్సల్టెన్సీగా నియమించేలా చక్రం తిప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ నీటిపారుదల వ్యవస్థ ఆధునికీకరణ, పంటల సాగు.. వ్యవసాయ యంత్రీకరణ, చేపల పెంపకం, పాడి పశువుల పెంపకం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి వంటి అంశాల్లో కన్సల్టెన్సీ సూచనలు, సలహాలు ఇస్తుంది.
అనుభవం లేకున్నా అందలం..
ప్రభుత్వం కన్సల్టెన్సీగా ఎంపిక చేసిన సంస్థకు ఈ విభాగంలో ఏమాత్రం అనుభవం లేదని ఆదిలోనే అధికారులు అభ్యంతరం చెప్పారు. అయితే మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడడంతో చేసేదిలేక ఆ సంస్థనే కన్సల్టెన్సీగా ఎంపిక చేశామని జలవనరుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కన్సల్టెన్సీ ఫీజు కింద ఐదేళ్లలో రూ.61.24 కోట్లను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ కాంట్రాక్టర్లకు ఇచ్చిన తరహాలో ఎన్నడూ లేని రీతిలో కన్సల్టెన్సీ సంస్థకు కూడా అడ్వాన్సుగా రూ.3.06 కోట్లు ఇవ్వాలని నిర్ణయించడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు.
జైకా రుణం రూ.1,700 కోట్లు
రాష్ట్రంలో చెరువులు, ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, చేతివృత్తిదారుల జీవనోపాధులను మెరుగుపర్చడం కోసం జైకా(జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ) ఆర్థిక సాయంతో రూ.2 వేల కోట్ల వ్యయంతో ఏపీఐఎల్‌ఐపీని 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ పథకానికి కొనసాగింపుగా ఏపీఐఎల్‌ఐపీ రెండో దశను ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో రూ.1,700 కోట్లు జైకా రుణం కాగా రూ.300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా. రెండు భారీ ప్రాజెక్టులు, 18 మధ్య తరహా ప్రాజెక్టులు, 445 చెరువులను ఆధునికీకరించడం ద్వారా 4,07,187 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం, వ్యవసాయ యాంత్రీకరణ, చేపల పెంపకం, పాడి పరిశ్రమ లాంటి వాటి ద్వారా రైతులు, చేతివృత్తిదారుల ఆదాయాన్ని పెంచడం రెండో దశ లక్ష్యంగా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment