వెలి‘కొండంత’ అవినీతి! | A main leader was planing to huge robbery in the Veligonda project | Sakshi
Sakshi News home page

వెలి‘కొండంత’ అవినీతి!

Published Mon, Nov 20 2017 3:55 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

A main leader was planing to huge robbery in the Veligonda project - Sakshi - Sakshi

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టులో కొండంత అవినీతి బయటపడుతోంది. కాంట్రాక్టర్లతో కలసి ముఖ్యనేత, మరో కీలక మంత్రి భారీ ఎత్తున ప్రజాధనం దోపిడీ చేయడానికి వ్యూహం రచించారు. పనులు వేగవంతం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్‌ తీర్మానం ద్వారా కాంట్రాక్టర్లకు గతంలో రూ. 68.44 కోట్లు అదనపు నిధులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని చెప్పి 60సీ నిబంధన కింద వేటు వేయాలని నిర్ణయించారు. ఇంకోవైపు జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 5,150 కోట్ల నుంచి రూ. 7,784.28 కోట్లకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. తద్వారా అంచనా వ్యయాన్ని రూ. 2,634.28 కోట్లు పెంచేశారు. పెంచిన ధరలతో మళ్లీ టెండర్లు పిలిచి, తమ కోట రీలోని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి భారీ ఎత్తున దోచుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. 

పెంపులో దోపిడీ వ్యూహం..
శ్రీశైలం జలాశయం నుంచి 43.5 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 885 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో రూ. 5,150 కోట్ల వ్యయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. ఏడు ప్యాకేజీల కింద పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు పనుల్లో రెండు సొరంగాలు ప్రధాన మైనవి. మొదటి సొరంగాన్ని 7 మీటర్ల వ్యాసా ర్థంతో 18.828 కి.మీలు, రెండో సొరంగాన్ని 9.2 మీటర్ల వ్యాసార్థంతో 18.838 కి.మీలు తవ్వాలి. వీటిలో మొదటి సొరంగం పనులను రూ.624.60 కోట్లకు, రెండో సొరంగం పనులను రూ.735.21 కోట్లకు కాంట్రా క్టర్లకు అప్పగించారు. 2006 నుంచి 2014 వరకు మొదటి సొరంగం పనుల్లో 13.146 కి.మీలు, రెండో సొరంగం పనులు 9.413 కి.మీలు పూర్తి చేశారు. సొరంగాల పనులను త్వరితగతిన పూర్తి చేయడం పేరుతో కాంట్రా క్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వ ముఖ్యనేత, కీలక మంత్రి కలసి భారీ దోపిడీకి వ్యూహం రచించారు. మొదటి సొరంగాన్ని 4.233 కి.మీలు, రెండో సొరంగాన్ని 8.275 కి.మీల మేర ఇంకా తవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మొదటి సొరంగం అంచనా వ్యయాన్ని రూ. 930.99 కోట్లకు, రెండో సొరంగం అంచనా వ్యయాన్ని రూ. 1,031 కోట్లకు పెంచారు. మిగిలిపోయిన మొదటి సొరంగం పనులను రూ. 306.39 కోట్లకు, రెండో సొరంగం పనులను రూ. 483.37 కోట్లకు కొత్తగా టెండర్లు పిలవనున్నారు. 

ఐదు ప్యాకేజీల్లోనూ అదే దందా..
- రెండో ప్యాకేజీ కింద ఫీడర్‌ కెనాల్, తీగలేరు గ్యాప్, కెనాల్‌ పనులను రూ. 254.50 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇందులో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే ఈ ప్యాకేజీ అంచనా వ్యయాన్ని రూ. 688 కోట్లకు పెంచారు.
మూడో ప్యాకేజీ కింద గొట్టిపడియ గ్యాప్‌తో పాటు 14.440 కి.మీల పొడవున కెనాల్‌ తవ్వే పనులను రూ. 380 కోట్లకు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఇప్పటికే గొట్టిపడియ గ్యాప్‌తో, 14 కి.మీల కెనాల్‌ పనులు పూర్తి చేశారు. కేవలం 0.440 కి.మీల కెనాల్‌ తవ్వకం మిగిలింది. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ. 480 కోట్లకు పెంచారు.
నాలుగు ప్యాకేజీ కింద కాకర్ల జలాశయంతో పాటు 44.625 కి.మీల పొడవున తూర్పు ప్రధాన కాలువ తవ్వే పనులను రూ. 206 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. జలాశయం పనులు 80 శాతం పూర్తయ్యాయి. తూర్పు ప్రధాన కాలువ పనులు 700 మీటర్ల మేర మాత్రమే మిగిలింది. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ. 855 కోట్లకు పెంచారు. 
ఆరో ప్యాకేజీ కింద 86.20 కి.మీల పొడవున ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులను రూ.1,135 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇందులో ఇప్పటికే 68.20 కి.మీల పొడవునా ప్రధాన కాలువ తవ్వేశారు. 18 కి.మీల మేర కాలువ తవ్వాల్సి ఉంది. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ. 1,448 కోట్లకు పెంచారు.
ఏడో ప్యాకేజీ కింద పశ్చిమ ఉపకాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.757 కోట్ల నుంచి రూ.977 కోట్లకు పెంచారు. ఈ ఐదు ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేసి.. కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు. 
ప్రాజెక్టుకు 41,130 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకూ 29 వేల ఎకరాలు సేకరించారు. భూసేకరణ వ్యయాన్ని రూ.970 కోట్లకు పెంచారు. మొత్తం పనుల వ్యయం రూ.1,159 కోట్లకు పెంచారు. వెరసి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 2,634.28 కోట్లు మేర పెంచారు. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తి చేసి రూ. 4,485.28 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.

గతేడాది వరకూ పట్టించుకోని ప్రభుత్వం
మూడున్నరేళ్ల క్రితం అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం 2016 జూన్‌ 24 వరకూ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. అప్పుడు జరిగిన కేబినెట్‌లో జూన్, 2017 నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని తీర్మానించారు. కన్వేయర్‌ బెల్ట్‌లు, టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం)లకు కొత్త బుష్‌లను సమకూర్చితేనే రోజుకు కనీసం పది మీటర్ల వంతున సొరంగం తవ్వవచ్చని తేల్చారు. వాటిని సమకూర్చుకోవడానికి నిబంధనలను విరుద్ధంగా మొదటి సొరంగం కాంట్రాక్టర్లకు ఒకేసారి రూ. 50.15 కోట్లు, రెండో సొరంగం కాంట్రాక్టర్‌కు ఒకేసారి రూ. 18.29 కోట్లను జూలై 5, 2016న అదనంగా ఇచ్చారు. ఇప్పటి వరకూ మొదటి సొరంగం కాంట్రాక్టర్‌ రోజుకు కేవలం 2.86 మీటర్ల చొప్పున 1,459 మీటర్ల మేర తవ్వితే, రెండో సొరంగం కాంట్రాక్టర్‌ రోజుకు 2.25 మీటర్ల చొప్పున 1,150 మీటర్ల మేర తవ్వారు.

విచిత్రం ఏంటంటే.. ప్రభుత్వం అదనంగా నిధులు ఇవ్వక ముందు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు మీటర్లు తవ్వేవారు. ఈ పనులను బట్టి అదనంగా ఇచ్చిన రూ. 68.44 కోట్లను కాంట్రాక్టర్లతో కలసి కీలక మంత్రి కాజేసినట్లు స్పష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. బోరింగ్‌ మెషీన్‌లను జర్మనీ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకోవడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి.. వారి ముసుగులో పాత కాంట్రాక్టర్లతోనే పనులు చేయించి, పెంచిన వ్యయాన్ని దోచుకోవాలన్నది ముఖ్యనేత ఎత్తుగడని జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇప్పటివరకూ తొలి సొరంగం కాంట్రాక్టర్‌కు రూ. 629.54 కోట్లు, రెండో సొరంగం కాంట్రాక్టర్‌కు రూ. 547.63 కోట్లు చెల్లించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement