
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చించడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలోని సవరించిన అంచనాల కమిటీ(ఆర్‌ఈసీ) గురువారం ఢిల్లీలో సమావేశమవుతోంది. కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు వ్యక్తం చేసిన అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నివృత్తి చేసిన నేపథ్యంలో.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ‘ఆర్‌ఈసీ’ ఆమోదముద్ర వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఆ ప్రతిపాదనలపై ఆర్‌ఈసీ ఆమోదముద్ర వేసి కేంద్ర మంత్రిమండలికి పంపుతుంది.
సవరించిన అంచనాల ప్రకారం నిధులివ్వాలి
రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ’ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వంద శాతం నిధులతో ఆ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు కేంద్రం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తొలిసారిగా 2015 మార్చి 12న సమావేశమైంది. ప్రాజెక్టు పనులను 2004–05 స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ రేట్స్(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం చేపట్టడం, భూసేకరణ చట్టం–2013 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అంచనా వ్యయం పెరుగుతుందని.. ఆ ప్రతిపాదనలను తక్షణమే పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ, అప్పటి టీడీపీ ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. కేంద్ర జల్ శక్తి శాఖ, పీపీఏ పదేపదే లేఖలు రాయడంతో 2017 ఆగస్టు 16న సవరించిన అంచనా వ్యయ (రూ.57,940.86 కోట్లు) ప్రతిపాదనలు పంపింది. అందులో అవతవకలను ప్రస్తావించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) టీఏసీ(సాంకేతిక సలహా కమిటీ) రూ.2,391.99 కోట్ల మేర కోత పెట్టింది.
చివరకు రూ.55,548.87 కోట్లకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక పోలవరం ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేసిన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటికే రూ.841.33 కోట్లు ఆదా చేయడంతో కేంద్ర సర్కారు వ్యవహార శైలిలోనూ మార్పు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమైన ప్రతి సందర్భంలోనూ.. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఆర్‌ఈసీలో కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్‌దీప్‌సింగ్ చౌదరితో సెప్టెంబరు 6న.. కేంద్ర జల్ శక్తి కార్యదర్శి యూపీ సింగ్‌తో సెప్టెంబర్ 15న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు భేటీ అయ్యారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు కొలిక్కి రావడంతో గురువారం ఢిల్లీలో ఆర్‌ఈసీ భేటీని ఛైర్మన్ జగ్‌మోహన్ గుప్తా ఏర్పాటు చేశారు.