సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్లకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రూ.3,128.31 కోట్లు దోచిపెట్టినట్లు నిపుణుల కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. జల వనరుల శాఖ అధికారులు ఇచ్చిన రికార్డుల ఆధారంగానే ఈ అక్రమాలను గుర్తించామని, మెజర్‌మెంట్ బుక్స్(ఎం–బుక్స్) ఆధారంగా క్షేత్రస్థాయిలో సాంకేతిక నిపుణుల బృందంతో సమగ్రంగా తనిఖీలు చేయిస్తే మరిన్ని అవకతవకలు బహిర్గతమవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జీవో 22(ధరల సర్దుబాటు), జీవో 63 (పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు) వక్రీకరించి, కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చారని, దీనివల్ల ఖజానాపై పెనుభారం పడిందని తేల్చిచెప్పింది. హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే.. ఒకే కాంట్రాక్టర్ పనులు చేయడం వల్ల సమన్వయం ఉంటుందని, రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని అభిప్రాయపడింది. కుడి, ఎడమ కాలువ పనుల్లో మిగిలిపోయిన పనులకు వేర్వేరు ప్యాకేజీల కింద రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
టీడీపీ సర్కారు దోచిపెట్టిన సొమ్మును కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు నిపుణుల కమిటీ బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుందని జలవనరుల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు రిటైర్డు ఈఎన్‌సీలు ఎఫ్‌సీఎస్ పీటర్, అబ్దుల్ బషీర్, ఎల్.నారాయణరెడ్డి, సుబ్బరాయశర్మ, ఐఎస్‌ఎన్ రాజు, ఏపీ జెన్‌కో రిటైర్డు డైరెక్టర్ ఆదిశేషు, ఐఏఎస్‌ఈ మాజీ అధ్యక్షుడు పి.సూర్యప్రకాశ్ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఈ కమిటీ తొలుత పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టింది. పోలవరం ఈఎన్‌సీ, సీఈ, ఎస్‌ఈలు, ఈఈలు అందజేసిన రికార్డులను అధ్యయనం చేసింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అక్రమాల నిగ్గు తేల్చింది. నిపుణుల కమిటీ బహిర్గతం చేసిన కొన్ని అంశాలు..
హెడ్ వర్క్స్‌లో అదనం
- 2013 మార్చిలో హెడ్ వర్క్స్(జలాయశం) పనులను రూ.4,054 కోట్లకు ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ దక్కించుకుంది. కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియకుండానే 2015–16 ధరలను వర్తింపజేస్తూ అంచనా వ్యయాన్ని రూ.5,535.91 కోట్లకు పెంచుతూ 2016 సెప్టెంబరు 8న అప్పటి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమే. ట్రాన్స్‌ట్రాయ్ చేసిన పనులకు రూ.1,331 కోట్లను అదనపు బిల్లుల రూపంలో చెల్లించారు.
- కాంట్రాక్టర్ రోజువారీ ఖర్చుల కోసం ఎక్కడా లేని రీతిలో ట్రాన్స్‌ట్రాయ్‌కి తొలుత రూ.25 కోట్లతో ప్రారంభించిన ప్రత్యేక నిధిని ఆ తర్వాత రూ.170 కోట్లకు పెంచారు.
- ట్రాన్స్‌ట్రాయ్‌కి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో చెల్లించిన నిధులను ఎలాగోలా వసూలు చేయగలిగినా.. వాటిపై వడ్డీ రూ.84.43 కోట్లను వసూలు చేయలేదు.
- పోలవరం హెడ్ వర్క్స్‌లో చేసిన పనుల పరిమాణాన్ని పరిశీలించకుండానే, నాణ్యతను తనిఖీ చేయకుండానే బిల్లులు చెల్లించేశారు. ట్రాన్స్‌ట్రాయ్ చేయని పనులకు రూ.101 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత వాటిని ప్రసారమాధ్యమాలు బయటపెడితే తిరిగి వసూలు చేశారు.
- 2018 ఫిబ్రవరి 17న పోలవరం హెడ్ వర్క్స్ నుంచి 60సీ నిబంధన కింద ట్రాన్స్‌ట్రాయ్‌ని తొలగించేసి.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఎల్‌ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో రూ.3,102.37 కోట్లకు నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. గేట్ల పనులను రూ.387.56 కోట్లకు బీకెమ్ సంస్థకు నామినేషన్‌పై అప్పగించారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఎల్‌ఎస్–ఓపెన్ విధానంలో మరొక కాంట్రాక్టర్‌కు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. పనుల్లో జాప్యం చేసినందుకు ట్రాన్స్‌ట్రాయ్ నుంచి జరిమానా వసూలు చేయలేదు.
- ఆర్థికంగా బలవంతమైన సంస్థ అని అప్పటి సీఎం చంద్రబాబు పదే పదే చెప్పిన నవయుగ సంస్థకు రివాల్వింగ్ ఫండ్‌గా ఒకేసారి రూ.50 కోట్లు ఇచ్చారు. దాన్ని ఇప్పటికీ వసూలు చేయలేదు. ఆ రూ.50 కోట్ల ఖర్చులకు సంబంధించి సరైన రికార్డులు లేవు.
జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్తినే రూ.787.20 కోట్ల లబ్ధి
పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను రూ.3,220.22 కోట్లకు 2017 డిసెంబర్ 30న నవయుగ సంస్థ దక్కించుకుని ఏపీ జెన్‌కోతో ఒప్పందం చేసుకుంది. నిబంధలకు విరుద్ధంగా 2018 జనవరి 6న ఒకేసారి రూ.322.03 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఏపీ జెన్‌కో చెల్లించింది. డిజైన్ల తయారీ పేరుతో 2018 మార్చి 29న ఒకేసారి రూ.193.22 కోట్లు చెల్లించింది. 3–డీ నమూనా పరిశోధనల పేరుతో రూ.100 కోట్లు, ఇతర పరిశోధనల పేరుతో రూ.45.77 కోట్లు, జీఎస్టీ పేరుతో రూ.114.93 కోట్లు, కార్యాలయ భవన నిర్మాణం కోసం రూ.1.17 కోట్లు ఇలా నవయుగకు రూ.787.20 కోట్లు చెల్లించింది. కానీ, నవయుగ ఇప్పటికీ జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. నవయుగ సంస్థ నుంచి జరిమానా వసూలు చేయాలి. అలాగే ఎడమ కాలువ పనుల్లో రూ.492.48 కోట్లు, కుడి కాలువ పనుల్లో రూ.288.98 కోట్ల అవినీతి జరిగినట్లు నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment