అర్థంలేని ‘అనుసంధానం’తో అడ్డగోలు దోపిడీ | TDP Govt robbery in the name of River Integration | Sakshi
Sakshi News home page

అర్థంలేని ‘అనుసంధానం’తో అడ్డగోలు దోపిడీ

Published Thu, Sep 13 2018 4:13 AM | Last Updated on Thu, Sep 13 2018 4:13 AM

TDP Govt robbery in the name of River Integration - Sakshi

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపానికి, అవగాహనా రాహిత్యానికి, ఆయకట్టు రైతుల హక్కుల పరిరక్షణలో ఘోర వైఫల్యానికి ఇది మరో నిదర్శనం. నాలుగేళ్లుగా నాగార్జున సాగర్‌ కుడి కాలువ ఆయకట్టు రైతల ప్రయోజనాలను కాపాడడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం తన నిర్వాకాన్ని కప్పిపుచ్చుకోవడం, ఎన్నికల వేళ భారీ ఎత్తున కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా గోదావరి–పెన్నా నదుల అనుసంధానంపై ‘వ్యాప్కోస్‌’ ఇచ్చిన నివేదికను సైతం వక్రీకరించింది. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ పనులకు ఆర్థిక శాఖ అభ్యంతరాలను సైతం బేఖాతరు చేస్తూ రూ.6,020.15 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు జూన్‌ 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. పోలవరం ప్రాజెక్టులో నామినేషన్‌ విధానంలో పనులు కట్టబెట్టిన కాంట్రాక్టర్‌కే ఈ అనుసంధానం పనులను అప్పగించేందుకు వీలుగా మంగళవారం జలవనరుల శాఖతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు.

నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.071 టీఎంసీలు. నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంటే బ్యారేజీ గేట్లు ఎత్తి నీటి ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేయాల్సిందే. కృష్ణా, గోదావరి నదులకు ఇంచుమించుగా ఒకేసారి వరదలు వస్తాయి. జూలై నుంచి అక్టోబర్‌ దాకా దాదాపు 70 రోజులు వరద ప్రవాహంతో రెండు నదులు ఒకేసారి ఉప్పొంగుతాయి. ఈ ఏడాది గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కురిసిన వర్షాలకే పులిచింతలకు దిగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ 21 రోజులు వరద రావడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 38.677 టీఎంసీలను కడలిలోకి విడుదల చేశారు. ఆ సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటార్లను నిలిపేశారు. ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో చింతలపూడి నీటిని పోలవరం కుడి కాలువ మీదుగా జత చేసి తరలించడం వల్ల ప్రయోజనం ఉండదు. కృష్ణా డెల్టాలో 13.09 లక్షల ఎకరాలకు నీళ్లందించాలంటే రోజుకు కనీసం 15,000 క్యూసెక్కులు అవసరం.

ప్రస్తుతం పట్టిసీమ ద్వారా రోజూ సగటున వస్తున్న 6,000 క్యూసెక్కుల నీటికి.. పులిచింతల నుంచి విడుదల చేసిన 9,500 క్యూసెక్కులను జత చేసి డెల్టాకు విడుదల చేస్తున్నారు. అయినా కృష్ణా డెల్టా ఆయకట్టులోని చివరి భూములకు నీరందడం లేదు. అంటే.. పులిచింతల నీళ్లు లేకుంటే కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవడం ఖాయం. దీన్నిబట్టి చూస్తే పట్టిసీమ ఎత్తిపోతల పథకం కృష్ణా డెల్టా అవసరాలను తీర్చడం లేదన్నది స్పష్టమవుతోంది. నాగార్జునసాగర్‌ కుడి కాలువకు నీళ్లందించాలంటే రోజుకు 11,000 క్యూసెక్కులు అవసరం. కానీ, గోదావరి–పెన్నా అనుసంధానం పేరుతో 7,000 క్యూసెక్కులను ఎత్తిపోసి, అరకొరగా నీళ్లందించడం వల్ల కాలువల్లో నీటి మట్టం లేక కృష్ణా డెల్టా ఆయకట్టు రైతుల తరహాలోనే డీజిల్‌ మోటార్లతో రైతులు పొలాల్లోకి నీటిని తోడుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. చివరి భూములకు నీళ్లందక పంటలు ఎండిపోతాయి. నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు ఉండే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. వ్యాప్కోస్‌ ఇచ్చిన నివేదిక మేరకు 5 దశల్లో గోదావరి–పెన్నా అనుసంధానాన్ని చేపడితేనే ప్రయోజనం ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టే గోదావరి–పెన్నా తొలిదశ ‘వ్యాప్కోస్‌’ నివేదికకు పూర్తిగా భిన్నమైనది కావడం గమనార్హం.

ఒకేసారి ఎలా సాధ్యం?
గోదావరి నదికి వరద వచ్చే 90 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా రౌతులగూడెం వద్ద నుంచి రోజుకు 56 క్యూమెక్కుల(1,977.64 క్యూసెక్కులు) చొప్పున.. 15.50 టీఎంసీలను తరలించి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు, 6.65 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.1,701 కోట్ల వ్యయంతో 2008 అక్టోబర్‌ 24న చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈ పథకం అంచనా వ్యయాన్ని రూ.4,909.80 కోట్లకు పెంచుతూ 2016 సెప్టెంబరు 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి గతేడాది ఆగస్టులో రూ.2,282 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ పనులను 2019 జనవరి నాటికి పూర్తి చేసి చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద 4.90 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రకటించింది. కానీ, గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశలో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల నీటితోనే నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు 2020 నాటికి సాగునీరు అందిస్తామని చెబుతోంది. ఒకే పథకంతో రెండు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని ఒకేసారి అందించడం ఎలా సాధ్యమో ప్రభుత్వానికే తెలియాలి.

‘వ్యాప్కోస్‌’ నివేదిక ఏం చెప్పింది?
పోలవరం జలాశయం ఎగువ నుంచి రోజుకు 3.50 టీఎంసీల చొప్పున ఎత్తిపోసి, కాలువ ద్వారా తరలించాలి. గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం వద్ద నిర్మించనున్న బ్యారేజీకి ఎగువన అక్విడెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిని దాటించాలి. బొల్లాపల్లి వద్ద 200 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే జలాశయంలో ఈ నీటిని నిల్వ చేయాలి. బొల్లాపల్లి జలాశయం నుంచి నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు నీటిని అందించడంతోపాటు సోమశిల జలాశయానికి తరలిస్తారు. మార్గమధ్యంలో గుండ్లకమ్మ, ముప్పవరం, చిన్నిపాడు, ఉప్పులూరు జలాశయాలను నింపి.. ఆయకట్టుకు నీటిని అందిస్తారు. గోదావరి నుంచి మొత్తం 320 టీఎంసీలను తరలించడం ద్వారా సాగర్‌ కుడి కాలువ, పెన్నా డెల్టాతోపాటు వర్షాభావ ప్రాంతాలైన ప్రకాశం జిల్లాకూ సాగునీరు, తాగునీరు అందించవచ్చు. ఇందుకు రూ.80,000 కోట్ల వ్యయం అవుతుంది. అంచనా వ్యయం భారీగా ఉన్న నేపథ్యంలో ఐదు దశల్లో ఈ పనులు చేపట్టాలి. గోదావరి జలాలను పెన్నాకు తరలించడానికి కాలువ, సొరంగాలను 701 కి.మీ.ల పొడవున తవ్వాలి. భవిష్యత్‌ అవసరాల కోసం రోజుకు 4.9 టీఎంసీలను తరలించేలా అధిక సామర్థ్యంతో కాలువను తవ్వాలి.

రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అనుసంధానం ఇదీ.. 
పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువలోకి ఇప్పటికే 8,500 క్యూసెక్కుల గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 7,000 క్యూసెక్కులను పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోసి, పట్టిసీమ జలాలతో కలిపి ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. ప్రవాహ నష్టాలు, మార్గమధ్యంలో వినియోగంపోనూ ప్రకాశం బ్యారేజీకి 14,000 క్యూసెక్కులు చేరుతాయి. ఇందులో 7,000 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు విడుదల చేస్తారు. మిగతా 7,000 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో హరిశ్చంద్రాపురం నుంచి 5 దశల్లో ఎత్తిపోసి.. నాగార్జునసాగర్‌ కుడి కాలువలో పోసి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఇందుకు 56.5 కి.మీ.ల పొడవున కాలువ, 10.09 కి.మీ.ల పొడవున ప్రెజర్‌మైన్‌లు అవసరం. దీన్నే గోదావరి–పెన్నా నదుల అనుసంధానంలో తొలిదశగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది. ఈ పనులను రూ.6,020.15 కోట్లతో చేపట్టేందుకు జూన్‌ 13న గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement