సాక్షి, అమరావతి: ‘రివర్స్ టెండరింగ్’ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు బలంగా వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం నూటికి నూరు శాతం సబబేనని వెల్లడైంది. టీడీపీ అధికారంలో ఉండగా నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల దాహంతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరలకు అప్పగించి ఖజానాను దోచేశారన్నది ‘రివర్స్’ టెండర్ల సాక్షిగా నిరూపితమైంది.. పోలవరం 65వ ప్యాకేజీ పనులకు గత జనవరిలో నిర్వహించిన టెండర్లలో 4.77 శాతం అధిక ధరలకు దక్కించుకున్న ‘మ్యాక్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్’ సంస్థే తాజాగా శుక్రవారం రివర్స్ టెండరింగ్‌లో 15.6 శాతం తక్కువ ధరలకు దక్కించుకోవటాన్ని బట్టి చూస్తే సాగునీటి పనుల్లో టీడీపీ సర్కార్ భారీ అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
వెరసి పోలవరం 65వ ప్యాకేజీ పనుల్లో 20.37 శాతం తక్కువ ధరలకే కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లైంది. దీనివల్ల రూ.274.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లోనే.. రూ.58.53 కోట్లు ఖజానాకు ఆదా అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే టీడీపీ సర్కార్ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ స్థాయిలో దోపిడీ చేశారో ఊహించుకోవచ్చు. రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టిన తొలి టెండర్ విజయవంతమవడంతో జలవనరుల శాఖ అధికారవర్గాల్లో, పారదర్శకంగా నిర్వహించడంతో కాంట్రాక్టర్లలో, ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా కావడంతో ప్రజలు, మేధావులు, నిపుణుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.
అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ‘రివర్స్’
టీడీపీ అధికారంలో ఉండగా సాగునీటి ప్రాజెక్టులను కమీషన్లు రాల్చే ఏటీఎంల మాదిరిగా మార్చుకుంది. పాత కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి అంచనా వ్యయాన్ని పెంచేయడం.. ఎక్కువ కమీషన్లు చెల్లించే కొత్త కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం.. అధిక ధరలకు కట్టబెట్టి.. ఖజానాకు తూట్లు పొడిచి ముడుపులు వసూలు చేసుకోవడాన్ని చంద్రబాబు బృందం ఆనవాయితీగా మార్చుకుంది. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టీడీపీ ప్రభుత్వం అంచనా వ్యయాలు పెంచేసి అధిక ధరలకు అప్పగించిన పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు.
ఎక్కువ మంది పోటీపడేలా నిబంధనలు సడలించి పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తామని ప్రకటించారు. తద్వారా 10 – 20 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తారని, ఖజానాకు కూడా భారీగా ఆదా అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గత సర్కార్ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు నిపుణుల కమిటీని నియమించారు. కమిటీ సిఫార్సుల మేరకు అవినీతి నిర్మూలనే లక్ష్యంగా రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
టెండర్లను అపహాస్యం చేసిన గత సర్కారు..
పోలవరం పనుల్లో 65వ ప్యాకేజీ (919 మీటర్లు సొరంగం తవ్వకం, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, నావిగేషన్ లాక్, అప్రోచ్ కెనాళ్ల తవ్వకం, నావిగేషన్ ఛానల్‌లో మిగిలిన పనులు) నుంచి రివర్స్ టెండరింగ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2005లో ఈ పనులను ‘యూనిటి ఇన్‌ఫ్రా’ అనే సంస్థ రూ.103.91 కోట్లకు దక్కించుకుంది. రూ.13.92 కోట్ల విలువైన పనులను మాత్రమే పూర్తి చేసింది. అనంతరం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ సంస్థ ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ సంస్థపై వేటు వేయాలన్న పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ) ఆమోదముద్ర వేసింది. 2018 నవంబర్ 8న ఆ సంస్థతో కాంట్రాక్టు ఒప్పందాన్ని నాటి ప్రభుత్వం రద్దు చేసుకుంది. అనంతరం ఆ పనుల అంచనా వ్యయాన్ని 2018–19 ధరల ప్రకారం రూ.358.11 కోట్లకు పెంచేసిన టీడీపీ సర్కార్.. రూ.318.84 కోట్లకు చేపట్టడానికి సాంకేతిక అనుమతులిచ్చింది.
అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బినామీ సంస్థ సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు ఈ పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆదేశించారు. అయితే ఆ ప్రతిపాదనను అధికారులు తిరస్కరించారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు అంటే జనవరి 28న ఈ పనులకు రూ.276,80,38,942 వ్యయంతో ఎల్‌ఎస్–ఓపెన్ విధానంలో ఎంపిక చేసిన సంస్థకే దక్కేలా నిబంధనలు రూపొందించి గత సర్కారు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మ్యాక్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, శంకరనారాయణ కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు మాత్రమే బిడ్‌లు దాఖలు చేశాయి. 4.77 శాతం అధిక ధరలకు(రూ.290,00,74,399.53) కోట్ చేస్తూ బిడ్ దాఖలు చేసిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ దీన్ని దక్కించుకుంది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని అప్పట్లో జలవనరుల శాఖ అధికారవర్గాలే వ్యాఖ్యానించాయి.
ఆన్‌లైన్‌లో పారదర్శకంగా....
► పోలవరం 65వ ప్యాకేజీ పనుల్లో ఈ ఏడాది ఆగస్టు 17 నాటికి ‘మ్యాక్స్ ఇన్‌ఫ్రా’ రూ.2.55 కోట్ల పనులను చేసింది. 25 శాతం లోపు పూర్తయిన పనులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసిన పోలవరం అధికారులు మిగతా పనులకు రూ.274,25,33,909 వ్యయంతో ఆగస్టు 17న రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. దేశంలో ఎక్కడ రిజిస్టర్ చేసుకున్న కాంట్రాక్టు సంస్థలైనా బిడ్‌లు దాఖలు చేయవచ్చని నిబంధనలు సడలించారు.
►ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్ వేదికగా ‘ఆన్‌లైన్’లో అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తుండటంతో ఆరు సంస్థలు(పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్‌అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్‌ఫ్రా, ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రా, ఎమ్మార్కేఆర్–ఎస్‌ఎల్‌ఆర్(జేవీ), ఆర్‌ఆర్‌సీఐఐపీఎల్–డబ్ల్యూసీపీఎల్)బిడ్‌లు దాఖలు చేశాయి.
►ఆర్థిక బిడ్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికారులు తెరిచారు. రూ.260,26,64,679లకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థ పేరును గోప్యంగా ఉంచిన అధికారులు.. ఆ సంస్థ కోట్ చేసిన ధరను ‘ఆన్‌లైన్’లో ఉంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్) చేపట్టారు. రివర్స్ బిడ్డింగ్ 2.45 గంటల పాటు అంటే.. సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహించారు.
►గడువు ముగిసే సమయానికి 15.600253 శాతం అంటే రూ.231,46,91,679లకు కోట్ చేసిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ఎల్–1గా నిలిచింది. దాంతో అదే సంస్థకు పనులు అప్పగించాలని పోలవరం ప్రాజెక్టు అధికారులు కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు ప్రతిపాదనలు పంపారు.
►తక్కువ ధరకు కోట్ చేయడం వల్ల ఖజానాకు రూ.42,78,42,230 ఆదా అయింది. టీడీపీ సర్కార్ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చూస్తే రూ.58,53,82,720 ఖజానాకు ఆదా అయింది.
►టీడీపీ హయాంలో 4.77 శాతం అధిక ధరలకు పనులు దక్కించుకున్న సంస్థే ఇప్పుడు 15.60 శాతం తక్కువ ధరకు పనులు చేజిక్కించుకోవడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు అండ్ కో టెండర్లను అపహాస్యం చేసి ప్రభుత్వ ఖజానాను లూటీ చేసినట్లు తేలిపోతోంది.
ఇక సత్తా చాటేందుకు సిద్ధం..
దేశంలో ఎక్కడా లేని రీతిలో రివర్స్ టెండరింగ్‌లో చేపట్టిన తొలి టెండర్ గ్రాండ్ సక్సెస్ అవడం, రూ.274.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్‌లోనే రూ.58.53 కోట్లు ఆదా కావడంతో అందరిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం పనులకు రూ.4,987.55 కోట్ల వ్యయంతో చేపట్టిన రివర్స్ టెండరింగ్‌లోనూ భారీ ఎత్తున ప్రజాధనం ఆదా కావడం ఖాయమని, చంద్రబాబు అక్రమాల బాగోతం వెలుగులోకి వస్తోందనే అభిప్రాయం అందరిలో బలంగా వ్యక్తమవుతోంది. రివర్స్ టెండరింగ్ మొదటి టెండర్‌లోనే ఖజానాకు రూ.58.53 కోట్లను ఆదా చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ పనులను గడువులోగా అంటే 18 నెలల్లో పూర్తి చేయడం ద్వారా సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభుత్వ అధినేతలు స్వేచ్ఛ ఇస్తే, పారదర్శకంగా వ్యవహరిస్తే ఏ స్థాయిలో ప్రజాధనం ఆదా చేయవచ్చో ఈ ఒక్క టెండర్‌తోనే రుజువైందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు సచివాలయంలో బాహాటంగా వ్యాఖ్యానించడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment