పోలవరం ఎడమ కాలువ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ | Reverse Tendering for Polavaram Left Canal Works | Sakshi
Sakshi News home page

పోలవరం ఎడమ కాలువ పనులకు రివర్స్‌ టెండరింగ్‌

Published Sun, Dec 1 2019 4:24 AM | Last Updated on Sun, Dec 1 2019 4:25 AM

Reverse Tendering for Polavaram Left Canal Works - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం.. లెఫ్ట్‌ కనెక్టివిటీ(65వ ప్యాకేజీ) పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి దాకా రూ.841.33 కోట్ల మేర ప్రజాధనం ఆదా చేసింది. ఎడమ కాలువలో మిగిలిన పనులకూ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడానికి సిద్ధమైంది. పనులు చేయడానికి మొండికేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని.. అప్పటికీ దారికి రాకపోతే ఆంధ్రప్రదేశ్‌ డీటెయిల్డ్‌ స్టాండర్డ్‌ స్పెసిఫికేషన్స్‌లోని (ఏపీడీఎస్‌ఎస్‌) 61సీ నిబంధన కింద వేటు వేసి, ఆ పనులకు అయ్యే అదనపు వ్యయంలో 95 శాతం సొమ్మును సదరు కాంట్రాక్టర్‌ నుంచి జరిమానా కింద వసూలు చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది. 

పోలవరం ఎడమ కాలువ పనులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎడమ కాలువను 213.49 కిలోమీటర్ల పొడవున తవ్వి లైనింగ్‌ చేయాలి. 4 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలి. 2005 నుంచి ఇప్పటివరకు కేవలం 69 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేయడానికి జలవనరుల శాఖ ప్రణాళిక రచించింది.

యనమల వియ్యంకుడికి రివర్స్‌ పంచ్‌ 
- పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్‌ నుంచి 60సీ నిబంధన కింద విడదీసి.. వాటి వ్యయాన్ని రూ.181.87 కోట్లకు పెంచేసి, 2016లో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు చెందిన పీఎస్కే–హెచ్‌ఈఎస్‌(జాయింట్‌ వెంచర్‌) సంస్థకు టీడీపీ ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిలో అప్పగించింది. ఇప్పటివరకూ రూ.119.23 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రూ.62.64 కోట్ల పనులు మిగిలాయి. పుట్టా సుధాకర్‌ యాదవ్‌తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న జలవనరుల శాఖ.. ఆ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి సన్నద్ధమైంది. 
రూ.196.20 కోట్ల విలువైన ఆరో ప్యాకేజీ పనులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితునికి చెందిన మధుకాన్‌–సినో హైడ్రో సంస్థ 2005లో దక్కించుకుంది. 2018 నాటికి రూ.112.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ఈ సంస్థకు ధరల సర్దుబాటు కింద రూ.11.45 కోట్లను అదనపు బిల్లుగా టీడీపీ సర్కార్‌ చెల్లించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పనుల్లో రూ.70.29 కోట్ల విలువైన పనులను 60సీ నిబంధన కింద తొలగించి.. వాటి వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచి, రాజమండ్రి టీడీపీ నేతకు చెందిన బీఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్‌ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టారు. మిగిలిన రూ.13.43 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.119.81 కోట్లకు పెంచేసి, మధుకాన్‌కు భారీగా లబ్ధి చేకూర్చారు. రివర్స్‌ టెండరింగ్‌కు సర్కార్‌ సిద్ధమవడంతో.. తమకు అప్పగిస్తే పాత ధరలకే పనులు చేస్తామని మధుకాన్‌ సంస్థ వినతి పత్రం ఇవ్వడం గమనార్హం. 
ఏడో ప్యాకేజీలో రూ.52.04 కోట్లు, ఎనిమిదో ప్యాకేజీలో రూ.53.19 కోట్ల విలువైన పనులు మిగిలాయి. నిర్దేశిత గడువులోగా పనులు చేయడానికి కాంట్రాక్టు సంస్థలు అంగీకరిస్తే వాటితోనే పనులు చేయించాలని.. మొండికేస్తే 61సీ కింద వేటు వేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement