![Rayalaseema Lift Irrigation Tender Notification after Judicial Preview Approval - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/18/JUDICIAL-REVIEW1.jpg.webp?itok=S5l6bxKW)
‘రాయలసీమ ఎత్తిపోతల’ పథకం పనుల ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)ను రూ. 3,278.18 కోట్లుగా నిర్ధారిస్తూ టెండర్ ప్రతిపాదనలను రాష్ట్ర జలవనరుల శాఖ జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. 30 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో ఈపీసీ విధానంలో టెండర్ నిర్వహించనున్నారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయడంతోపాటు పథకాన్ని 15 ఏళ్లపాటు కాంట్రాక్టరే నిర్వహించాలని నిబంధన విధించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది.
సాక్షి, అమరావతి: దాహార్తితో అలమటిస్తున్న దుర్భిక్ష సీమ గొంతు తడపడమే లక్ష్యంగా ‘రాయలసీమ ఎత్తిపోతల’ పథకం పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పథకం పనుల ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)ను రూ.3,278.18 కోట్లుగా నిర్ధారిస్తూ టెండర్ ప్రతిపాదనలను జలవనరుల శాఖ జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. 30 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో టెండర్ నిర్వహించనున్నారు. ప్రైస్ బిడ్‌లో తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ పేర్కొన్న ధరనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి రివర్స్ టెండరింగ్(ఈ–ఆక్షన్) నిర్వహిస్తారు. రివర్స్ టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయడంతోపాటు పథకాన్ని 15 ఏళ్లపాటు కాంట్రాక్టరే నిర్వహించాలని నిబంధన విధించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం లభించాక టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది.
‘రాయలసీమ ఎత్తిపోతల’ ఇదీ..
► శ్రీశైలం జలాశయంలో సంగమేశ్వరం (+ 243 మీటర్ల) నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఎత్తిపోసి పీహెచ్‌పీకి దిగువన ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ)లో 4 కిమీ వద్దకు తరలించి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేస్తారు.
► ఈ పనులకు రూ.3,278.18 కోట్లు ఐబీఎంగా జలవనరుల శాఖ నిర్థారించింది. ఇందులో రూ.10.32 కోట్లు ఇన్వెస్టిగేషన్, డిజైన్ల కోసం కేటాయించారు. రూ.1360.35 కోట్లను అప్రోచ్ చానల్, కాలువ పనులకు నిర్దేశించారు. లిఫ్టింగ్ సిస్టమ్, పంప్‌హౌస్, ఎలక్ట్రో మెకానికల్ పనులు, ప్రైజర్ మెయిన్, పైపులైన్ పనులకు రూ.1611.02 కోట్లను కేటాయించారు. 400 కేవీ సబ్ స్టేషన్ పనులకు రూ.217.88 కోట్లను కేటాయించగా నిర్వహణకు రూ.78.16 కోట్లు కేటాయించారు. ఇతర ఖర్చులకు రూ.44.18 లక్షలు కేటాయించారు.
► టెండర్ ప్రతిపాదన వివరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ తన వెబ్‌సైట్లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచింది.
మన వాటా నీళ్లను వాడుకోవడానికే..
► కృష్ణా బేసిన్(నదీ పరీవాహక ప్రాంతం)లో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజులు గణనీయంగా తగ్గాయి. శ్రీశైలం జలాశయంలో 881 అడుగుల్లో నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ (పీహెచ్‌పీ) ద్వారా ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులను రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు తరలించవచ్చు. కానీ ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో సగటున 10 నుంచి 15 రోజులు కూడా ఉండటం లేదు.
► ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచితే అదనంగా 174 టీఎంసీలను కర్ణాటక వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు శ్రీశైలం జలాశయానికి వరద వచ్చే రోజులు మరింత తగ్గుతాయి.
► ఇక శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటే పీహెచ్‌పీ ద్వారా ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. నీటి మట్టం అంతకంటే తగ్గితే.. కృష్ణా బోర్డు నుంచి కేటాయింపులు ఉన్నా సరే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు నీళ్లందవు.
► ఈ నేపథ్యంలో శ్రీశైలంలో నీటి మట్టం + 243 మీటర్లు (800 అడుగులు) నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులకు రోజుకు మూడు టీఎంసీల చొప్పున కృష్ణా జలాలను తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment