
సాక్షి, అమరావతి: పోలవరం పనులను లక్ష్యం మేరకు 2019లోగా పూర్తి చేయాలంటే 60–సీ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. దీనిపై బుధవారం జరిగే మంత్రిమండలి సమా వేశంలో మరింత వివరంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పనులలో పురోగతిని సమీక్షించారు. పోలవరం ప్రధాన పనులు పూర్తి చేయడంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు చట్టప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించామని, ప్రధాన కాంట్రాక్టు సంస్థ విషయంలో ఎలా వ్యవహ రించాలనే అంశంపై పలు మార్గాలను పరిశీలించామని సీఎం చెప్పారు.
అంటే ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్‌ను కొనసాగిస్తూనే కొన్ని పనులను మరో సంస్థకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్), కాఫర్ డ్యామ్ పనులు ఈ సీజన్‌లోనే చేపట్టాల్సి ఉన్నందున ప్రధాన నిర్మాణ సంస్థను కొనసాగిస్తూనే, కొన్ని పనులకు 60–సీ నిబంధన వర్తింపచేసి ముందుకు వెళ్లాలని జలవనరుల నిపుణులు సూచించడంతో ఆ ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించామని వివరించారు. సీడబ్ల్యూసీ నుంచి ఈ వారంలో అవసరమైన క్లియరెన్స్ వచ్చే విధంగా తగు చర్యలు చేపట్టి గేట్ల నిర్మాణపు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. డిసెంబర్‌లోగా పూర్తి చేయాల్సిన 28 సాగునీటి ప్రాజెక్టుల్లో 10 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యా యని అధికారులు సీఎంకు తెలిపారు.