సాక్షి, అమరావతి : తన సంస్థ తప్పు చేస్తే.. విచారణ చేస్తారా అంటూ జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీ సీఎం రమేష్ చిందులు తొక్కినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ నివేదికను పక్కన పెట్టి తన సంస్థకే పనులు కట్టబెట్టాలంటూ ఆయన తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈయనకు ముఖ్యనేత కూడా వత్తాసు పలకడంతో చేసేదిలేక రూ.239.03 కోట్లను ఆయన సంస్థకే కట్టబెట్టడానికి సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్) సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ.4,460.64 కోట్లకు ఖరారు చేస్తూ మార్చి 20, 2007న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2009 నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో అంచనా వ్యయాన్ని రూ.6,671.62 కోట్లకు పెంచేస్తూ 2018 మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో.. మిగిలిన పనులను బినామీ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారు.
ఈ క్రమంలో తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ నుంచి 18.20 కి.మీ వరకూ లైనింగ్ చేయడం, 18.200 కి.మీ నుంచి 42.566 కి.మీ వరకూ గతంలో లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులు, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్ ఛానల్ 0.00 కి.మీ నుంచి 7.380 కి.మీ వరకూ లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ.. ఈ ఏడాది మార్చి 9న జారీ చేసిన ఉత్తరులలో ఈ పనుల విలువను రూ.180.48 కోట్లుగా ఖరారు చేశారు. ఆ పనుల వ్యయాన్ని మళ్లీ పెంచాలని ముఖ్యనేత ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన అధికారులు ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8న ఉత్తర్వులు జారీచేశారు. ఈ పనులకు రూ.239.03 కోట్లను అంతర్గత విలువగా నిర్ణయించిన అధికారులు.. ముఖ్యనేత ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంస్థకు ఆ పనులు దక్కేలా రూపొందించిన నిబంధనలతో జూలై 16న ఎల్‌ఎస్–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. 18 నెలల్లో ఈ పనుల పూర్తికి గడువు విధించారు. జూలై 31న టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థతోపాటూ ‘స్యూ’, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రాలు బిడ్‌లు దాఖలు చేశాయి.
రిత్విక్ అనర్హతపై స్యూ ఫిర్యాదు
ఇదిలా ఉంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్ పనుల టెండర్లలో టెక్నికల్ బిడ్‌ను తెరిచిన సమయంలో రిత్విక్ సంస్థ తప్పుడు అర్హత పత్రాలు సమర్పించినట్లు స్యూ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, అలహాబాద్ జిల్లాల పరిధిలో బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టు పనులను రిత్విక్ సంస్థ సబ్ కాంట్రాక్టర్లతో చేయించిందని.. కానీ, ఆ పనులు తానే చేసినట్లు తప్పుడు పత్రాలు సమర్పించిందని.. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని స్యూ సంస్థ ప్రతినిధులు కోరారు. కానీ, ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆగస్టు 6న ప్రైస్ బిడ్ తెరిచారు. 2.88 శాతం అధిక ధర(ఎక్సెస్)కు రిత్విక్ (ఎల్–1), 3.61 శాతం ఎక్సెస్‌కు స్యూ (ఎల్–2), 4.31 శాతం ఎక్సెస్‌కు హెచ్‌ఈఎస్ (ఎల్–3) సంస్థలు బిడ్‌లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఎల్–1గా నిలిచిన రిత్విక్ సంస్థకు పనులు అప్పగించాలని సీవోటీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
నాపైనే విచారణకు ఆదేశిస్తారా?
స్యూ సంస్థ ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులను సీవోటీ ఆదేశించారు. దీంతో సీఎం రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన సంస్థపైనే విచారణకు ఆదేశిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే టెండర్లు ఆమోదించి తన సంస్థకు పనులు అప్పగించాలంటూ ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆ ఒత్తిళ్లకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తలొగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం నేరుగా జలవనరుల శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరుకుని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారాన్ని ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై మండిపడినట్లు చెబుతున్నారు. దాంతో చేసేదిలేక విచారణ నివేదికను పక్కన పెట్టి సీఎం రమేష్ సంస్థకు పనులు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment