జీవో 94ను ఉల్లంఘించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తే చర్యలు తప్పవని జలవనరుల శాఖ కార్యదర్శి జారీ చేయించిన అంతర్గత ఉత్తర్వులు
ఆయనో ఐఏఎస్ అధికారి.. కార్యదర్శి హోదాలో ఉన్నారు. నెలకు రూ.1,72,200 జీతం. ఆయన ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు అనధికారికంగా చెబుతున్న లెక్కల ప్రకారం రూ.84 లక్షల నగదు, రూ.26 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆయన ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డే దొంగిలించాడు. కానీ ఐఏఎస్ అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఆయన ఇంట్లో రూ.4.50 కోట్లకుపైగా నగదు, భారీ ఎత్తున బంగారం చోరీకి గురయ్యాయి. నెలకు రూ.1,72,200 వేతనం వచ్చే ఆ ఐఏఎస్ ఇంట్లో అంత భారీ ఎత్తున నగదు ఎలా వచ్చిందన్నది బహిరంగ రహస్యమే. ప్రభుత్వ పెద్దల బాటలోనే కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన కమీషన్లలో ఇది కొంత మాత్రమేనని ఐఏఎస్ అధికారవర్గాలే చెబుతున్నాయి.
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ దోపిడీకి వ్యూహం రచించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 2016లో చిన్న నీటిపారుదల, భారీ నీటిపారుదల శాఖలను విలీనం చేసి జలవనరుల శాఖగా నామకరణం చేశారు. అత్యంత ప్రధానమైన జలవనరుల శాఖకు ముఖ్యకార్యదర్శి హోదా కలిగిన ఐఏఎస్ అధికారిని నియమించాలి. కానీ జూనియర్ ఐఏఎస్ శశిభూషణ్ కుమార్‌ను సీఎం చంద్రబాబు ఏరికోరి నియమించారు. ఇందుకు ప్రతిఫలంగా నిబంధనలకు విరుద్ధమైన ప్రతిపాదనలకు సైతం ఆయన ఆమోదముద్ర వేశారు. కమీషన్లు చెల్లించని కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడమే ఆలస్యం ఆగమేఘాలపై పూర్తి చేశారు. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి పెద్దలు సూచించిన కాంట్రాక్టర్లకే నామినేషన్ పద్ధతిలో లేదంటే జీవో 94కి విరుద్ధంగా టెండర్ నోటిఫిషన్ ద్వారా అప్పగించేశారు. ఈ వ్యవహారంలో పనుల విలువలో ఒక శాతం కమీషన్ గిట్టుబాటు అయినట్లు జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం నుంచి వంశధార, గాలేరు–నగరి, హంద్రీ–నీవా సుజల స్రవంతి దాకా ఇదే తంతు.
జీవో 94 చాటున వసూళ్లు..
ఉమ్మడి రాష్ట్రంలో 2003 జూలై 1న జారీ చేసిన జీవో 94 ప్రకారమే సాగునీటి టెండర్లను నిర్వహించాలి. ఈ జీవోను అడ్డుపెట్టుకుని ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే అధిక ధర (ఎక్సెస్)కు పనులు కట్టబెట్టి భారీ ఎత్తున వసూలు చేసుకునేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా స్కెచ్ వేశారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపి ప్రాజెక్టుల పనులను పంచేశారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన సీఈలు జీవో 94కు విరుద్ధంగా టెండర్ నోటిఫికేషన్‌లు జారీ చేశారు. వీటిని ఆమోదించాలంటే జీవో 94ను ఉల్లంఘిస్తూ రూపొందించిన టెండర్ నిబంధనలను జలవనరుల శాఖ కార్యదర్శి ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. దీన్నే అస్త్రంగా చేసుకున్న శశిభూషణ్‌కుమార్ టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి ఒక శాతం చొప్పున కమీషన్ వసూలు చేసుకున్నట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి.
టెండర్లలో దోపిడీకి ఆధారాలు ఇవిగో..
- వైకుంఠపురం బ్యారేజీ పనులకు 13.19 శాతం ఎక్సెస్‌కు నవయుగ–ఆర్వీఆర్(జేవీ) షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్సెస్‌కు షెడ్యూలు కోట్ చేస్తే టెండర్ రద్దు చేయాలి. కానీ కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్‌పై ఒత్తిడి తెచ్చి సీవోటీ ఆమోదం కోసం పంపారు. ఈలోగా ఐదు శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేస్తే టెండర్ రద్దు చేయాలన్న నిబంధన నుంచి సడలింపు ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. దీంతో టెండర్‌పై సీవోటీ ఆమోదముద్ర వేసింది.
- వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ టెండర్లలో జాయింట్ వెంచర్ల (ఒకరు కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడటం)కు అవకాశం లేదని నిబంధన విధించారు. కానీ సీబీఆర్–వైవీఆర్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశ ఎత్తిపోతల్లో జాయింట్ వెంచర్లు కూడా టెండర్లలో పాల్గొనవచ్చునని నిబంధన చేర్చారు. దీన్ని ఆమోదిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు.
- కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం కోసం జీవో 94కు విరుద్ధంగా ఏకంగా ఎనిమిది నిబంధనలను టెండర్ నోటిఫికేషన్‌లోచేర్చారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టాక జీవో 94 నుంచి సడలింపు ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు.
- గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, వంశధార–బాహుదా నదుల అనుసంధానం నుంచి ముక్త్యాల ఎత్తిపోతల వరకూ 17 ప్రాజెక్టుల పనుల టెండర్లలోనూ ఇదే కథ.
అధికారంతమున దోపిడీకి సంపూర్ణ సహకారం..
ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు అంటే జనవరి నుంచి మార్చి మొదటి వారం వరకూ 17 ప్రాజెక్టుల పనులకు నిర్వహించిన టెండర్లలో అక్రమాలకు జలవనరుల శాఖ కార్యదర్శి సంపూర్ణ సహకారం అందించారు. 2014కి ముందు పారదర్శకంగా టెండర్లు నిర్వహించడం వల్ల గరిష్టంగా 27 శాతం నుంచి కనిష్ఠంగా 8.77 శాతం లెస్ (తక్కువ) ధరలకు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అయింది. కానీ టీడీపీ సర్కారు 17 ప్రాజెక్టులకు నిర్వహించిన టెండర్లలో నలుగురు కాంట్రాక్టర్లకే రూ.18,648.71 కోట్ల విలువైన పనులు దక్కాయి. కాంట్రాక్టర్లు ముందే కుమ్మక్కు కావడంతో గరిష్టంగా 13.19 శాతం నుంచి కనిష్టంగా 3.52 శాతం ఎక్సెస్ (అధిక) ధరకు కోట్ చేసి షెడ్యూళ్లను దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు.
ముందే జీవో 94 నుంచి సడలింపు
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన టెండర్లను సీవోటీ రద్దు చేస్తుంది. అయితే సీవోటీ నిర్ణయం తీసుకోక ముందే టెండర్ నిబంధనలకు జీవో 94 నుంచి సడలింపు ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ప్రభుత్వ పెద్దలు ఉత్తర్వులు జారీ చేయించారు. దీంతో ఆ పనుల టెండర్లను సీవోటీ ఆమోదించింది. అనంతరం వీటిని ఆగమేఘాలపై కాంట్రాక్టర్లకు కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.
17 ప్రాజెక్టుల్లో కమీషన్ల డబ్బే చోరీ..!
జనవరి నుంచి మార్చి మొదటి వారం వరకూ నిర్వహించిన 17 ప్రాజెక్టుల టెండర్లలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కింద వసూలు చేసిన డబ్బులనే శశిభూషణ్ కుమార్ విజయవాడలో సూర్యారావుపేటలోని తన ఇంట్లో దాచినట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలే చెబుతున్నాయి. కొంత డబ్బును ఇతర ప్రాంతాలకు తరలించినా ఎన్నికల షెడ్యూలు వెలువడటం, తనిఖీలు పెరగడంతో రూ.4.50 కోట్లకుపైగా ఇంట్లోనే దాచారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కర్ణాటకలోని హసన్ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దీంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు ఇంటి భద్రతను అప్పగించి ఆయన హసన్ వెళ్లారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకూ అంటే గత నెల 18వ తేదీ వరకూ ఆయన హసన్‌లోనే విధులు నిర్వహించారు. ఇదే సమయంలో బెంగాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు బిస్వాస్ డబ్బులు, బంగారు అభరణాలను చోరీ చేసి ఉడాయించాడు.
తాను స్వయంగా అన్వేషించినా ఫలితం లేకపోవడం, పోలీసు కేసు పెట్టి విషయం బయటకు పొక్కితే ఏసీబీ, సీబీఐ, ఐటీ, ఈడీ అధికారుల విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తించిన శశిభూషణ్‌కుమార్ సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టిన పోలీసులు మూడు రోజుల క్రితం సెక్యూరిటీ గార్డు బిస్వాస్‌ను అదుపులోకి తీసుకున్నా అధికారికంగా వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. చోరీ చేసిన సొమ్ములో పది శాతం మాత్రమే రికవరీ చేశారని సమాచారం. కాగా, శశిభూషణ్ ఇంట్లో జరిగిన చోరీ విలువ రూ. 6.35 లక్షలు మాత్రమేనని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అయితే నిందితుడి వద్ద రూ. 6.35 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలతో పాటు అదనంగా ఉన్న నగదు, 3 ఫోన్లు, రిస్ట్‌వాచ్ మొత్తం రూ.18.03 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment