సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు రెండవసారి సవరించిన అంచనా వ్యయానికే పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్) జారీ చేసేలా కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిధులు విడుదల చేస్తే 2021 డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేయనుంది. జాప్యం చేస్తే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందని, దీనివల్ల అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తేల్చిచెప్పాలని నిర్ణయించింది.
పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదిస్తే.. రూ.2,234.77 కోట్లు రీయింబర్స్ చేస్తామనే షరతు విధిస్తూ అక్టోబర్ 12న కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి ఎల్‌కే త్రివేది.. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాశారు. దీనిపై పీపీఏ అభిప్రాయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ కోరింది. పీపీఏ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. షరతుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితునిగా సలహాదారు ఎం.వెంకటేశ్వరావు పాల్గొననున్నారు.
రూ.20,398.61 కోట్లతో పూర్తి సాధ్యమేనా?
కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్న మేరకు రూ.20,398.61 కోట్లతో పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం పనులను పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అని పీపీఏను ప్రశ్నించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2017–18 ధరల ప్రకారం పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ), ఆర్‌సీసీ (సవరించిన అంచనా వ్యయ కమిటీ) ఆమోదించిన.. రెండవసారి సవరించిన అంచనా వ్యయంలో భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.28,191.03 కోట్లు అవసరమని తేల్చిన అంశాన్ని గుర్తు చేయనుంది.
ఒక్కో జాతీయ ప్రాజెక్టుకు ఒక్కో రకంగానా?
కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం జలాశయం పనులు, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పన, నీటి సరఫరా (కాలువలు, పిల్ల కాలువలు, ఆయకట్టు అభివృద్ధి) మొత్తాన్ని కలిపి నీటిపారుదల విభాగం వ్యయంగా పరిగణించాలి. దేశంలో 16 ప్రాజెక్టులను కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించింది. అన్ని ప్రాజెక్టులకు నీటిపారుదల విభాగం వ్యయాన్ని ఇదే తరహాలో అందిస్తోంది. కానీ పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసరికి నీటిపారుదల విభాగం వ్యయం నుంచి నీటి సరఫరా వ్యయాన్ని తొలగించడం ఎంతవరకు న్యాయమని పీపీఏను నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే..
విభజన చట్టం సెక్షన్–90 ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేననే అంశాన్ని మరో సారి గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తరఫున, పీపీఏ పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని.. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగినా, తగ్గినా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అనే అంశాన్ని గుర్తు చేయనుంది. 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చే.. 2017–18 ధరల ప్రకారం రెండవసారి సవరించిన అంచనా వ్యయానికి పీపీఏ, సీడబ్ల్యూసీ, టీఏసీ, ఆర్‌సీసీ ఆమోదం తెలిపాయనే అంశాన్ని ఎత్తిచూపనుంది. ఆర్‌సీసీ చైర్మన్ జగ్‌మోహన్ గుప్తా పీపీఏలో సభ్యులని, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ పీపీఏ పాలక మండలి చైర్మన్ అని, టీఏసీకీ ఆయనే నేతృత్వం వహించారని.. వారే 2017–18 ధరల ప్రకారం రెండవసారి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి.. ఇప్పుడు 2013–14 ధరలను తెరపైకి తేవడం భావ్యం కాదని తేల్చిచెప్పనుంది.
పోలవరం: పెట్టుబడి అనుమతి ఇవ్వాలి
Published Mon, Nov 2 2020 2:02 AM | Last Updated on Mon, Nov 2 2020 2:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment