సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీల్లో భారీగా పేరుకుపోయిన ఇసుకను వెలికితీయడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరితగతిన చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 పైగా ఓపెన్ ర్యాంపుల్లో తవ్వకాలు జరపడం, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేయడం ద్వారా డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక విధానం–2019కి సవరణల ద్వారా పాలసీని మరింత పారదర్శకంగా, లోపరహితంగా మార్చిన ప్రభుత్వం డ్రెడ్జింగ్‌పై దృష్టి పెట్టింది.
ఇందులో భాగంగానే కాటన్, ప్రకాశం బ్యారేజీల్లో ఇసుక పరిణామాన్ని అంచనా వేయడం కోసం బాతిమెట్రిక్ (నీటి లోతుల్ని, నేలల్ని పరీక్షించడం) సర్వే జరిపించింది. ఒక్కొక్క బ్యారేజీలో రెండేసి కోట్ల టన్నుల చొప్పున ఇసుక నిక్షేపాలున్నట్లు సర్వేలో తేలింది. నిబంధనల ప్రకారం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్ చేసుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కూడా అంగీకారం తెలిపింది. అవరోధాలు తొలగిపోవడంతో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) తయారు చేయాలని రాష్ట్ర గనుల శాఖ అధికారులు జల వనరుల శాఖను కోరారు. ఆ శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపించి ఎలా చేయాలనే దానిపై ఉన్నత స్థాయిలో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గనుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
రెండు శాఖల సమన్వయంతో డ్రెడ్జింగ్
రెండేళ్లుగా భారీ వర్షాలు కురవడం, వరదలు రావడంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల్లోకి భారీగా ఇసుక చేరి పేరుకుపోయింది. దీనిని జల వనరుల, గనుల శాఖలు సమన్వయంతో డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసి ప్రజల డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. గుర్తించిన ఓపెన్ రీచ్‌లకు చట్టబద్ధమైన పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకునే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment