ఔను.. మట్టితిన్నారు | PAO and the auditor general says TDP main leader hand in sand works | Sakshi
Sakshi News home page

ఔను.. మట్టితిన్నారు

Published Thu, Jul 19 2018 3:10 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

PAO and the auditor general says TDP main leader hand in sand works - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి రూ.150.93 కోట్లు దోచుకోవడంపై గత మార్చి 24వతేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని తేలింది. మట్టి పనులు చేయకుండానే చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి రూ.112,47,19,305 కాజేసినట్లు ఆడిటింగ్‌ విభాగం, పే అండ్‌ అకౌంట్స్‌ విభాగం(పీఏవో) నిర్ధారించింది. అయితే స్వాహా చేసిన సొమ్మును గుట్టు చప్పుడు కాకుండా రికవరీ చేసి అక్రమాలను కప్పిపుచ్చాలంటూ పీఏవో విభాగం అధికారులపై ముఖ్యనేత తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు.దీంతో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేటప్పుడు రూ.10,57,21,084 మినహాయించుకున్నారు. కాంట్రాక్టర్‌ నుంచి మిగతా రూ.101,89,98,221 రికవరీ చేయాల్సి ఉంది. కానీ ఈ సొమ్ము రికవరీ చేయకుండా ముఖ్యనేత అడ్డుపడ్డారు.

పనులకు ఆటంకం కలుగుతుందంటూ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే నిర్థారణకు వచ్చిన ఏలూరు పీఏవో కె.సోమయ్య కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేది లేదని తేల్చి చెబుతూ ఈనెల 10వతేదీన పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం) ఈఈకి లేఖ రాయడం కలకలం రేపుతోంది. మట్టిలో రూ.వందల కోట్లను మళ్లించిన ఈ అక్రమాల దందా ఇదిగో..

పనులు చేయకుండానే..
పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, పవర్‌ హౌస్‌ పునాది తవ్వకంతో కలిపి మొత్తం 10.49 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాలి. ప్రాజెక్టు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్నాక ప్రధానంగా జలాశయం పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఇదే క్రమంలో మట్టి తవ్వకం పనులను త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ సంస్థకు సబ్‌ కాంట్రాక్టు కింద కట్టబెట్టేశారు. సాగునీటి ప్రాజెక్టు పనుల్లో 2015–16 ధరల ప్రకారం క్యూబిక్‌ మీటర్‌ మట్టి పనికి రూ.92.60 చెల్లిస్తారు. హార్డ్‌రాక్‌(బండరాళ్లు)తో కూడిన మట్టి తవ్వకం పనులకు అదనంగా చెల్లిస్తారు. 2017 అక్టోబర్‌ 3వ తేదీన సీఎం చంద్రబాబు పోలవరం పనులను 20వసారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆ రోజు నాటికి 7.59 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తి చేసినట్లు అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. మరో 2.96 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మిగిలాయని చూపారు. కానీ ఆ రోజు నాటికి వాస్తవంగా 5.96 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మాత్రమే చేశారు. ముఖ్యనేత ఒత్తిడి మేరకు 1.63 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయకున్నా చేసినట్లుగా చూపించి రూ.150.93 కోట్ల మేర కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత ఆ డబ్బులు ముఖ్యనేతకు చేరాయి. ఈ దోపీడీ పర్వాన్ని గత మార్చి 24వతేదీన ‘మట్టిలో రూ.150.93 కోట్లు మింగేశారు’ శీర్షికన ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది.

అక్రమాలను తేల్చిన ఆడిటింగ్‌ విభాగం
పోలవరం మట్టి పనుల్లో సాగిన దోపిడీని సాక్ష్యాధారాలతో ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), ఆడిటర్‌ జనరల్‌ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశాయి. మట్టి పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లుల రూపంలో రూ.112,47,19,305 కాజేసినట్లు తేల్చాయి. అదనంగా చెల్లించిన బిల్లులను కాంట్రాక్టర్‌ నుంచి వసూలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారుకు నివేదిక ఇచ్చాయి. ఈ అక్రమాల పర్వంపై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకూ బిల్లులు చెల్లించవద్దని పీఏవోను ఆదేశించాయి.

కప్పిపుచ్చే యత్నం
మట్టి పనుల్లో గుట్టుగా సాగించిన అక్రమాల దందా బహిర్గతం కావడంతో ముఖ్యనేత ఉలిక్కిపడ్డారు. అక్రమంగా చెల్లించిన సొమ్మును కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేటపుడు రికవరీ చేసుకుని అవినీతిని కప్పి పుచ్చాలంటూ పీఏవో అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇటీవల పోలవరం హెడ్‌ వర్క్స్‌ అధికారులు సమర్పించిన 37వ బిల్లులో రూ.10,57,21,084లను కాంట్రాక్టర్‌కు చెల్లించకుండా మినహాయించారు. అంటే.. అదనంగా చెల్లించిన బిల్లుల్లో కాంట్రాక్టర్‌ నుంచి ఇంకా రూ.101,89,98,221 వసూలు చేయాల్సి ఉంది.

బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు చేయకుండా మొండికేశారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ముఖ్యనేత.. అక్రమంగా చెల్లించిన సొమ్మును రికవరీ చేయకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటూ పీఏవోపై ఒత్తిడి తెచ్చారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు ఆగిపోతున్నాయని హడావుడి చేశారు. దీంతో ఈ వ్యవహారం తన మెడకు చుట్టుకుంటోందని గుర్తించిన పీఏవో సోమయ్య.. అక్రమంగా చెల్లించిన సొమ్మును పూర్తిగా రికవరీ చేసే వరకూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేది లేదని తేల్చి చెబుతూ పోలవరం ప్రాజెక్టు అధికారులకు లేఖ రాశారు. ఇప్పుడు ఇది అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది.

రూ.61.66 కోట్ల దోపిడీకి బ్రేక్‌!
– మట్టి పనుల పరిమాణం పెంచి కొల్లగొట్టే ఎత్తుగడ
పోలవరంలో మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపించి భారీ ఎత్తున కాజేసిన తరహాలోనే మట్టి పనుల పరిమాణాన్ని కూడా పెంచేసి వాటిని చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లులు కాజేసేలా ఆదిలోనే త్రివేణి సంస్థతో ముఖ్యనేత రహస్య అవగాహనకు వచ్చారు. అందులో భాగంగానే 2016 అక్టోబర్‌ 17 నాటికి మట్టి పనుల పరిమాణాన్ని ఆరు లక్షల క్యూబిక్‌ మీటర్లు పెంచేసి 10.55 కోట్ల కూబ్యిక్‌ మీటర్లుగా అధికారుల చేత ఖరారు చేయించారు. పనుల పరిమాణాన్ని మరింత పెంచాలంటూ ఒత్తిడి చేయడంతో గత ఫిబ్రవరి 5న 16 లక్షల క్యూబిక్‌ మీటర్లు పెంచేసి 10.71 కోట్ల క్యూబిక్‌ మీటర్లుగా మట్టి పనులను ఖరారు చేశారు.

ఆ తరువాత కూడా ముఖ్యనేత పనుల పరిమాణాన్ని మరింత పెంచేయాలని ఆదేశించడంతో ఫిబ్రవరి 19న మరో 44.59 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పెంచేశారు. దీంతో మట్టి పనుల పరిమాణం 11,15,59,000 క్యూబిక్‌ మీటర్లకు చేరుకుంది. అంటే అవసరం లేకపోయినా 66.59 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి పనులను పెంచేసి.. వాటిని చేయకుండానే చేసినట్లు చూపి రూ.61.66 కోట్లను కాజేయడానికి ముఖ్యనేత పక్కాగా ప్రణాళిక వేశారు. తాజాగా పీపీఏ, ఆడిటర్‌ జనరల్‌ నివేదికల నేపథ్యంలో ఈ దోపిడీకి బ్రేక్‌ పడినట్లయిందని జలవనరుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement